Green Field Highway: విజయవాడ-బెంగళూరు గ్రీన్ ఫీల్డ్ హైవే..
జాతీయ రహదారి లేకపోవడంతో అనంతపురం జిల్లావాసులు విజయవాడకు చేరాలంటే దాదాపు 550 కి.మీ, 8 గంటల ప్రయాణం చేయాల్సి వస్తోంది.
- By CS Rao Published Date - 05:43 PM, Thu - 24 March 22

జాతీయ రహదారి లేకపోవడంతో అనంతపురం జిల్లావాసులు విజయవాడకు చేరాలంటే దాదాపు 550 కి.మీ, 8 గంటల ప్రయాణం చేయాల్సి వస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో గ్రీన్ ఫీల్డ్ హైవే ఏర్పాటుకు ప్రభుత్వం ముందుకు రావడంతో మూడు జిల్లాల ప్రజలకు ప్రయాణ కష్టాలు తీరనున్నాయి. జిల్లాలో ఇప్పటికే ఎన్‌హెచ్ 44, 42 ఉండగా ముదిగుబ్బ-కోడూరు వరకు 342 జాతీయ రహదారి మంజూరు కావడం విధితమే. తాజాగా విజయవాడ-బెంగళూరు మధ్య మూడు జిల్లాలను కలుపుతూ గ్రీన్ ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవే రాబోతోంది. గంటకు 120 కి.మీ. వేగంతో వాహనాలు దూసుకుపోయే విధంగా నాలుగు వరుసల రహదారి నిర్మాణానికి ఆకృతులు రూపొందించారు. ఫలితంగా విజయవాడ-బెంగళూరు మధ్య సుమారు 100 కి.మీ దూరం తగ్గనుండగా, ప్రయాణ సమయం 3 గంటల మేర ఆదా కావచ్చని అధికారుల అంచనా.
అనంతపురం జిల్లా వాసులు విజయవాడ వెళ్లాలంటే ఎన్‌హెచ్ 44 రహదారి అనంతపురం వయా కర్నూలు, ప్రకాశం జిల్లా మీదుగా గుంటూరు అటు నుంచి విజయవాడ వెళ్లాలి. ఈక్రమంలో విజయవాడ నుంచి జిల్లా మీదుగా బెంగళూరుకు సులభమైన రహదారి మార్గం నిర్మాణానికి కేంద్రం ఆమోద ముద్ర వేసింది..
బెంగళూరు-హైద్రాబాద్ ఎన్‌హెచ్44లో అనంతపురం జిల్లా కొండికొండ వద్ద గ్రీన్ ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవే ప్రారంభమై పులివెందుల సమీపంలో నుంచి వెళుతూ కడపజిల్లా వీరపునాయునిపల్లి మండలం అనిమెల, ఎర్రగుంట్ల-కమలాపురం మధ్య నుంచి మైదుకూరు మీదుగా బ్రహ్మంగారిమఠం మండలం మల్లేపల్లి, పోరుమామిళ్ల, ప్రకాశం జిల్లా కనిగిరి, చీమకుర్తి మీదుగా మేదరమెట్ల, మార్టూర్‌కు మధ్య చెన్నై-కోల్‌కత్తా జాతీయ రహదారి-16లో కలుస్తుంది. ఈ ప్రాజెక్టులో భాగంగా కొడికొండ-మేదరమెట్ల మధ్య మాత్రమే రహదారి నిర్మాణ పనులు జరగనున్నాయి.
ఎక్కడి నుంచి ఎక్కడికంటే..
చెన్నై-కోల్‌కత్తా జాతీయ రహదారి-16తో అనుసంధానం కానున్న గ్రీన్ ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవే. మన రాష్ట్రంలో ప్రకాశం జిల్లా మేదరమెట్లలో ప్రారంభమై కడప జిల్లా మీదుగా అనంతపురం జిల్లా కొండికొండ చెక్‌పోస్ట్ వద్ద జాతీయ రహదారి-44తో కలువడంతో ముగుస్తుంది.
జిల్లాలో ముదిగుబ్బ మండలం దేవరగుడి వద్ద ప్రారంభమై సానేవారిపల్లి మీదుగా మలకవేముల వద్ధ. తలుపుల మండలంలోని లక్కసముద్రం, కదిరి మండలంలోని పట్నం, నల్లమాడ మండలం వేళ్లమద్ది మీదుగా నల్లమాడ, ఓడీచెరువు కొండకమర్ల, పుట్టపర్తి మండలం అమగొండపాళ్యం, సాతర్లపల్లి రెవెన్యూ గ్రామాల మీదుగా.. గోరంట్ల మండలంలోని జక్కసముద్రం వద్ద మొదలై బూదిలి మీదుగా.. చిల్లమత్తూరు మండలం చాగిలేరు రెవెన్యూ గ్రామంలో మొదలై కోడూరు వద్ద ఎన్‌హెచ్ 44లో కలుస్తుంది. దాదాపు 24 రెవెన్యూ గ్రామాల మీదుగా గ్రీన్ ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవే వెళ్లనుంది. అందుకుగాను 736.63 హెక్టార్ల భూ సేకరణకు సంబంధించిన ఉత్తర్వులు ఆయా మండలాల అధికారులకు చేరాయి.
గ్రీన్ ఫీల్డ్ రహదారి స్వరూపం
అంచనా: రూ.17,000 కోట్లు
భూ సేకరణ: 8,000 ఎకరాలు
ప్రతిపాదిత ప్రాజెక్టు దూరం: 518 కి.మీ.
గ్రీన్ ఫీల్డ్ రహదారి మేరకు: 332 కి.మీ.
రహదారి వరుసలు: 4
రహదారి వెడల్పు: 90 మీటర్లు
ఆకృతుల మేరకు వేగం: 120 కి.మీ.
రహదారి నిర్మాణం ఎక్కడి నుంచి ఎక్కడికంటే: ప్రకాశం జిల్లా మేదరమెట్ల – అనంతపురం జిల్లా కొడికొండ మధ్య
త్వరలో భూసేకరణ
విజయవాడ-బెంగళూరు జాతీయ రహదారికి సంబంధించి డీపీఆర్ రూపొందిస్తున్నారు. త్వరలోనే భూ సేకరణ చేపడతారు.. జిల్లాలో రహదారి ఖర్చులపై ఫైనలైజ్ కావాల్సి ఉంది. డీపీఆర్ సిద్ధం అయ్యాక భూ సేకరణ, ఇతరత్రా చర్యలు చేపడతామని అధికారులు చెబుతున్నారు.