Nara Lokesh : లోకేష్ పర్యటనపై `ప్రాణహాని` హెచ్చరిక
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ పర్యటనకు వస్తే ప్రాణనష్టం ఉందని పోలీసులు హెచ్చరించారు.
- By CS Rao Published Date - 02:17 PM, Thu - 23 June 22

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ పర్యటనకు వస్తే ప్రాణనష్టం ఉందని పోలీసులు హెచ్చరించారు. ఆయన పల్నాడు పర్యటనకు ఎవరూ రావొద్దని టీడీపీ స్థానిక లీడర్లకు కూడా నోటీసులు జారీ చేయడం కలకలం రేపుతోంది. ఒక వేళ పాల్గొంటే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించడం గమనార్హం. మాజీ మంత్రి, ఎమ్మెల్సీ నారా లోకేష్ చేపట్టిన పల్నాడు పర్యటన టెన్షన్ కు దారితీసింది. అడ్డుకోవాలని వైసీపీ లీడర్లు చూస్తున్నారు. అందుకే, లోకేష్ పర్యటనలో పాల్గొనవద్దంటూ తెదేపా నేతలను అప్రమత్తం చేశారు. జిల్లాలోని ముఖ్యనేతలందరికీ నోటీసులు ఇచ్చారు. లోకేష్ పర్యటనలో పాల్గొంటే ప్రాణనష్టం జరిగే సమాచారం ఉందంటూ నోటీసులో పేర్కొన్నారు. ఈ పర్యటనలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తి, అల్లర్లు జరుగుతాయని నోటీసుల్లో పొందుపరిచారు.
అధికారికంగా అనుమతులు లేని లోకేష్ కార్యక్రమంలో పాల్గొని విధ్వంసకర ఘటనలకు బాధ్యులు కావొద్దంటూ హెచ్చరించారు. నోటీసులు ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు ఉంటాయని వార్నింగ్ ఇవ్వడం కలకలం రేపుతోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ పాల్గొని తీరుతామని తెలుగుదేశం శ్రేణులు అంటున్నాయి. గతంలోనూ జల్లయ్య అంత్యక్రియలకు వెళ్లకుండా తెదేపా నేతలను పోలీసులు అడ్డుకున్నారు. ప్రాణనష్టం, అల్లర్లు, ఉద్రిక్త పరిస్థితులు, శాంతి భద్రతల విఘాతం, విధ్వంసకర పరిస్థితులు వంటి పదాలను పోలీసులు నోటీసుల్లో వాడటాన్ని తెలుగుదేశం ఖండిస్తోంది. హత్యలు చేసేవారిని రోడ్లపైకి వదులుతూ, చనిపోయిన వారి కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు వెళ్తున వారికి ఈ ఆంక్షలేంటని ప్రశ్నిస్తోంది.

2c73fe88 9844 4d63 906a D6e06290bcad
పల్నాడు జిల్లాలో ఇటీవల హత్యకు గురైన టీడీపీ లీడర్ జల్లయ్య కుటుంబాన్ని లోకేశ్ పరామర్శించానలి షెడ్యూల్ చేసుకున్నారు. రావులాపురం గ్రామంలో జల్లయ్య కుటుంబం ఉంటున్న ఇంటికి వెళ్లి, వారికి 25 లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని చేయాలని నిర్ణయించుకున్నారు. ఉదయం 11 గంటలకు పిడుగురాళ్ల, కారంపూడి మీదుగా రావులాపురం గ్రామానికి లోకేశ్ వెళ్లేలా రూట్ మ్యాప్ టీడీపీ తయారు చేసింది. జల్లయ్య పెద్దకర్మ కార్యక్రమంలో పాల్గొనడానికి వెళ్లాలని లోకేష్ సిద్ధం అయ్యారు. పల్నాడు జిల్లాలో లోకేశ్ పర్యటన సందర్భంగా గురజాల నియోజకవర్గం తెలుగుదేశం నాయకులు పెద్ద ఎత్తున స్వాగత ఏర్పాట్లు కూడా చేశారు. కానీ, పోలీసుల అనుమతి లేకుండా ఎవరూ బయటకు రావద్దంటూ పోలీసులు హెచ్చరించడం రాజకీయ దుమారాన్ని రేపుతోంది.