Pastor Praveen : పాస్టర్ పగడాల ప్రవీణ్ మృతి వివరాలు తెలిపిన ఎస్పీ
Pastor Praveen : రాజమహేంద్రవరం శివారులో కొంతమూరు వద్ద రోడ్డు పక్కన ఆయన మృతదేహాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు
- By Sudheer Published Date - 08:36 PM, Wed - 26 March 25

తూర్పు గోదావరి జిల్లాలో పాస్టర్ పగడాల ప్రవీణ్ కుమార్ (Pastor Pagadala Praveen) అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం అందర్నీ షాక్ కు గురి చేసింది. రాజమహేంద్రవరం శివారులో కొంతమూరు వద్ద రోడ్డు పక్కన ఆయన మృతదేహాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. తొలుత ఇది రోడ్డు ప్రమాదం అని అనుకున్నా, పాస్టర్లు హత్య జరిగిందని ఆరోపిస్తూ ఆందోళనకు దిగారు. దీంతో ప్రభుత్వం స్పందించి విచారణకు ఆదేశించింది. ఎస్పీ నరసింహ కిషోర్ వెల్లడించిన వివరాల ప్రకారం.. ఘటనా స్థలంలో మృతదేహంతో పాటు సెల్‌ఫోన్ కూడా లభ్యమైంది. ఆ ఫోన్ నుండి చివరి కాల్ రామ్మోహన్ ఆర్జేవైకి వెళ్లినట్లు గుర్తించడంతో అతనిని విచారించారు.
Bank Account Nominees : ఇక ఖాతాకు నలుగురు నామినీలు.. ‘బ్యాంకింగ్’ బిల్లుకు ఆమోదం
పోలీసులు సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా 11.43 నిమిషాలకు ప్రవీణ్ ద్విచక్రవాహనంపై వెళుతుండగా రోడ్డు ప్రమాదం జరిగినట్లు గుర్తించారు. అయితే ఘటనా స్థలంలో డాగ్ స్క్వాడ్, క్లూస్ టీంతో ఆధారాలు సేకరించారు. ప్రవీణ్ కుటుంబ సభ్యులకు సమాచారం అందించడంతో, అతని బావమరిది అనుమానాస్పద మృతిగా ఫిర్యాదు చేయడంతో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. పోస్టుమార్టం ప్రక్రియను పూర్తి చేసి, వీడియో రికార్డింగ్ కూడా చేసినట్లు ఎస్పీ తెలిపారు. వీటన్నింటినీ పరిశీలిస్తున్న పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
ఈ కేసును త్వరగా ఛేదించేందుకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసినట్లు పోలీసులు ప్రకటించారు. ప్రజలు, పాస్టర్లు ఆందోళన చెందకుండా, ఈ కేసుకు సంబంధించిన ఆధారాలు ఎవరి వద్ద ఉన్నా పోలీసులకు తెలియజేయాలని సూచించారు. నిరసన తెలుపుతున్న వారిని ఒప్పించి మృతదేహాన్ని హైదరాబాద్‌కు పంపినట్లు తెలిపారు. అసలు ప్రవీణ్ మృతి నిజంగా రోడ్డు ప్రమాదమా? లేక ఇతర కారణాలున్నాయా? అన్న విషయంపై పోలీసులు త్వరలో స్పష్టత ఇవ్వనున్నారు.