Seshadri : శేషాద్రి మృతి వ్యక్తిగతంగా నాకు తీరని లోటు : సీజేఐ రమణ
తిరుపతి: టిటిడి ఓఎస్‌డి డాలర్ శేషాద్రి అంత్యక్రియలు మంగళవారం సాయంత్రం తిరుపతిలో జరిగాయి.
- Author : Hashtag U
Date : 01-12-2021 - 10:40 IST
Published By : Hashtagu Telugu Desk
తిరుపతి: టిటిడి ఓఎస్‌డి డాలర్ శేషాద్రి అంత్యక్రియలు మంగళవారం సాయంత్రం తిరుపతిలో జరిగాయి. భారత ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ, ఉపముఖ్యమంత్రి కే నారాయణ స్వామి, పలువురు రాజకీయ నేతలు, టీటీడీ అధికారులు, మాజీ అధికారులు ఆయన పార్థీవదేహానికి నివాళ్లు అర్పించారు.1978 నుంచి టీటీడీలో సేవలందిస్తున్న శేషాద్రి సోమవారం తెల్లవారుజామున విశాఖపట్నంలో గుండెపోటుతో మరణించారు.తిరుపతిలోని సత్యహరిశ్చంద్ర శ్మశానవాటికలో కుటుంబ సభ్యుల సమక్షంలో తిరుమల ఆలయ మర్యాదలతో ఆయనకు అంత్యక్రియలు జరిగాయి.
శేషాద్రి మృతి వ్యక్తిగతంగా తనకు తీరని లోటు అని సీజేఐ ఎన్వీ రమణ అన్నారు. పాలా శేషాద్రి(డాలర్ శేషాద్రి) తనకు 25 ఏళ్లుగా తెలుసని… ఆయన మృతి తనతో పాటు పలువురిని కలవరపరిచిందన్నారు. డాలర్ శేషాద్రితో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. ఉదయం నుండి రాత్రి వరకు ఆలయంలో విధులు నిర్వహిస్తున్నప్పుడు ఆయన తన ఆరోగ్యం గురించి ఎప్పుడూ పట్టించుకోలేదని…వేంకటేశ్వరుని పాదాల చెంత సేవ చేసిన శేషాద్రి ఇక లేరంటే నమ్మశక్యం కాదన్నారు.
శేషాద్రి తనకు 25 ఏళ్లుగా తెలుసునని, శేషాద్రి మరణవార్త తెలియగానే దిగ్భ్రాంతికి గురయ్యానని సీజేఐ అన్నారు. ఆయన ఎప్పుడూ క్షీణిస్తున్న తన ఆరోగ్యాన్ని పట్టించుకోకుండా భగవంతుని సేవలో మునిగిపోయారని…చివరి శ్వాస వరకు వేంకటేశ్వరునికి సేవ చేయాలనే కోరికను నెరవేర్చుకున్నారని ఎన్వీ రమణ అన్నారు.