Supreme Court:ఏపీ విభజన చట్టం పిటిషన్ పై సుప్రీంలో విచారణకు ఓకే..
2014 నాటి ఆంధ్రప్రదేశ్ విభజనకు సంబంధించిన పిటిషన్ పై విచారించేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. ఏపీ పునర్‌వ్యవస్థీకరణ చట్టాన్ని రెండు సభల్లోనూ వివాదస్పద తీరును పలువురు సుప్రీంలో సవాల్ చేశారు.
- By Hashtag U Published Date - 12:05 AM, Tue - 12 April 22
2014 నాటి ఆంధ్రప్రదేశ్ విభజనకు సంబంధించిన పిటిషన్ పై విచారించేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. ఏపీ పునర్‌వ్యవస్థీకరణ చట్టాన్ని రెండు సభల్లోనూ వివాదస్పద తీరును పలువురు సుప్రీంలో సవాల్ చేశారు. పిటిషన్ లోని కీలక అంశాల్లో ఒకటైన ఏపీ విభజనను సవాల్ చేసే సమయం మించిపోయింది. అయినప్పటికీ …ఇతర ముఖ్యమైన అంశాలపై విచారణ చేపట్టాల్సి ఉందని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇతర అంశాలకు సంబంధించి ఒకరోజు జాబితా చేయాలన్నారు. త్వరలోనే విచారణ చేపడతామని జస్టిస్ కృష్ణ మురారి, జస్టిస్ హిమ కొహ్లిలు పేర్కొన్నారు.
2014లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి తెలంగాణను విభజించారు. లోకసభ, రాజ్యసభల్లో చట్టం చేశారు. అయితే విభజనను సవాల్ చేస్తూ..అప్పటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పిటిషన్ వేశారు. మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ కూడా పిటిషన్ వేశారు. పార్లమెంటులో బిల్లును ఆమోదించిన వివాదాస్పద విధానాన్ని సవాలు చేస్తూ…2014లో పలు పిటిషన్లు దాఖలు అయ్యాయి. ప్రస్తుతం అవి ఇంకా పెండింగ్ లోనే ఉన్నాయి. ఏపీ విభజన చట్టం వ్యతిరేకం, రాజ్యాంగ విరుద్ధమంటూ ఆ పిటిషన్లో పేర్కొన్నారు.
కాగా గతవారం మాజీఎంపి ఉండవల్లి అరుణ్ కుమార్ వేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. ఈ పిటిషన్ను సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ ధర్మాసనం ముందు అడ్వకేట్ ప్రశాంత భూషన్ ప్రస్తావించారు. అయితే దీనిపై కూడా త్వరలోనే విచారణ చేపడుతామన్నారు. ఈ వారంలోనే పిటిషన్ విచారణకు వచ్చేలా చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు రిజిస్ట్రీని సీజేఐ ఆదేశించారు. ఈ మేరకు ఇవాళ దీనిపై విచారణ జరిగింది.