Peddireddy : పెద్దిరెడ్డి పై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి సిఫారసు
Peddireddy : అదనంగా 77.54 ఎకరాల అటవీ భూమిని ఆక్రమించి మొత్తం 104 ఎకరాల్లో వ్యవసాయ క్షేత్రాన్ని అభివృద్ధి చేసినట్లు నివేదికలో పేర్కొన్నారు
- By Sudheer Published Date - 12:21 PM, Mon - 10 February 25

ఏపీ మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి (Peddireddy Ramachandra Reddy) భూకబ్జాలపై విజిలెన్స్ విభాగం కీలక నివేదికను రూపొందించింది. ప్రభుత్వ అధికారిక రికార్డుల ప్రకారం పెద్దిరెడ్డి కుటుంబానికి 23.69 ఎకరాల భూమి మాత్రమే ఉంది. అయితే అదనంగా 77.54 ఎకరాల అటవీ భూమిని ఆక్రమించి మొత్తం 104 ఎకరాల్లో వ్యవసాయ క్షేత్రాన్ని అభివృద్ధి చేసినట్లు నివేదికలో పేర్కొన్నారు. చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గంలోని మంగళంపేట రక్షిత అటవీ భూమిని కబ్జా చేసి, కంచె వేసినట్లు అధికారులు నిర్ధారించారు.
Droupadi Murmu : త్రివేణి సంగమంలో పవిత్ర స్నానం ఆచరించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
విజిలెన్స్ దర్యాప్తులో పెద్దిరెడ్డి కుమారుడు, వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి సహా ఇతర కుటుంబ సభ్యుల పేర్లపై అక్రమంగా భూములను రిజిస్టర్ చేయించినట్లు తేలింది. రాజకీయ ప్రభావంతో అటవీ భూములను అక్రమంగా తన ఆధీనంలోకి తెచ్చుకున్నారని అధికారులు గుర్తించారు. భూమి అక్రమ లావాదేవీలకు సంబంధించిన మొత్తం ఏడు రకాల ఆధారాలను సేకరించినట్లు విజిలెన్స్ విభాగం వెల్లడించింది. ఈ నివేదిక ఆధారంగా పెద్దిరెడ్డిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ప్రభుత్వానికి విజిలెన్స్ విభాగం సిఫారసు చేసింది. భూ ఆక్రమణ, నేరపూరిత దురాక్రమణ, ఫోర్జరీ డాక్యుమెంట్ల కల్పన వంటి నేరాల కింద చర్యలు తీసుకోవాలని సూచించారు. భూ కబ్జా నిరోధక చట్టంలోని సెక్షన్-5 కింద కేసు నమోదు చేయాలని, అటవీ భూములను తిరిగి ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకోవాలని విజిలెన్స్ అధికారుల రిపోర్టులో పేర్కొన్నారు.
భూకబ్జాలకు పాల్పడిన పెద్దిరెడ్డి కుటుంబ సభ్యులు బీఎన్‌ఎస్ 316 (5), బీఎన్‌ఎస్ 336 (3), బీఎన్‌ఎస్ 329 (3), బీఎన్‌ఎస్ 340 (2) సెక్షన్ల కింద శిక్షలు ఎదుర్కొనే అవకాశం ఉంది. ఈ నేరాలకు జీవిత ఖైదు లేదా పదేళ్ల జైలు, భారీ జరిమానా, ఏడు సంవత్సరాల వరకు జైలు శిక్షలు విధించే అవకాశముంది. ఈ అక్రమ కార్యకలాపాలకు సహకరించిన రెవెన్యూ, అటవీ అధికారులపై కూడా చర్యలు తీసుకోవాలని విజిలెన్స్ నివేదిక సూచించింది.