Jana Sena 12th Foundation Day : జనసేన విజయం వెనుక అసలు కారణాలు ఇవే
Jana Sena 12th Foundation Day : రాజకీయాల్లోకి అడుగు పెట్టిన ఆయన, ఆంధ్రప్రదేశ్‌లో ఒక సరికొత్త శక్తిగా మారారు
- By Sudheer Published Date - 11:25 AM, Fri - 14 March 25

Jana Sena 12th Foundation Day : పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఒక సాధారణ సినిమా హీరోగా తన సినీ ప్రయాణాన్ని ప్రారంభించారు. తన పవర్‌ఫుల్ డైలాగులు, వినూత్నమైన నటనతో యువతలో విపరీతమైన అభిమానాన్ని సంపాదించారు. కానీ 2014 నుంచి ఆయన జీవితం కొత్త మలుపు తీసుకుంది. రాజకీయాల్లోకి అడుగు పెట్టిన ఆయన ఆంధ్రప్రదేశ్‌లో ఒక సరికొత్త శక్తిగా మారారు. తొలుత జనసేన పార్టీ స్థాపనకు ఎవరూ పెద్దగా ప్రాధాన్యం ఇవ్వలేదు. కానీ కాలక్రమేణా తన కృషి, ప్రజాపక్ష వైఖరి ద్వారా రాజకీయాల్లో తన ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు.

రాజకీయ దృఢసంకల్పం – ఒంటరిగా పోరాటం
2014లో పార్టీ స్థాపించినప్పటికీ జనసేన (Janasena) ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయలేదు. అప్పట్లో కేంద్రంలో రాష్ట్రంలో ఎన్డీయే ప్రభుత్వాలను మద్దతు ఇచ్చిన పవన్ కళ్యాణ్, ప్రజల సమస్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించడంలో వెనుకడుగు వేయలేదు. 2019లో తొలిసారి పార్టీ ఎన్నికల్లో పోటీ చేయగా అనుకూల ఫలితాలు రాలేదు. అయినప్పటికీ వెనుకడుగు వేసే వ్యక్తి కాదని నిరూపించుకున్నారు. వైసీపీ ప్రభుత్వంలోని అనేక అవినీతి, అరాచకాలకు వ్యతిరేకంగా పోరాడుతూ 2024లో గెలిచేలా తన వ్యూహాన్ని సిద్ధం చేసుకున్నారు.
టీడీపీ-బీజేపీ-జనసేన కూటమి విజయ రహస్యాలు
పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో తాను ఏ నిర్ణయం తీసుకున్నా దానిని అచేచ్యంగా అమలు చేసే నాయకుడిగా మారారు. 2024 ఎన్నికలకు ముందు విపక్ష ఓటు చీల్చకుండా టీడీపీ, బీజేపీ, జనసేన కూటమిగా పోటీచేయడానికి కీలకంగా వ్యవహరించారు. టీడీపీ, బీజేపీ మధ్య పొత్తు సాధ్యమే కాదనే అభిప్రాయం ఉన్నప్పటికీ పవన్ కళ్యాణ్ వారి మధ్య చర్చలు జరిపి, ఐక్యాన్ని కాపాడారు. ఈ కూటమి ఏర్పడటమే వైసీపీ పరాజయానికి ప్రధాన కారణంగా మారింది.

జనసేన 2024లో సునామీ విజయం
జనసేన పార్టీ 2024 ఎన్నికల్లో వందశాతం స్ట్రైక్ రేటు సాధించింది. పోటీ చేసిన 21 అసెంబ్లీ, 2 పార్లమెంట్ స్థానాల్లో అద్భుత విజయాన్ని సాధించింది. కార్యకర్తలకు అండగా నిలిచే నాయకుడిగా పవన్ కళ్యాణ్ పేరు తెచ్చుకున్నారు. ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడంలో ఆయన చూపించిన నిబద్ధత, నిర్భయత, త్యాగం జనసేన విజయానికి కీలకంగా మారింది. సంపద కోరిక లేకుండా, కేవలం సేవా భావంతో ముందుకు సాగిన పవన్, 2024లో ఏపీ రాజకీయాల్లో నిజమైన గేమ్ ఛేంజర్‌గా మారారు.