Private School : అధికారుల వేధింపులకు నిరసనగా రేపు ఏపీలో ప్రైవేట్ స్కూళ్లు బంద్
Private School : తనిఖీలు, నోటీసుల పేరిట కొన్ని జిల్లాల్లో అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని అసోసియేషన్ ఆరోపిస్తోంది
- Author : Sudheer
Date : 02-07-2025 - 8:30 IST
Published By : Hashtagu Telugu Desk
ఆంధ్రప్రదేశ్‌లోని ప్రైవేట్ పాఠశాలల (Private School) యాజమాన్యాలు అధికారుల వేధింపులకు వ్యతిరేకంగా రేపు (జూలై 3) బంద్ (Private School Bandh)కు పిలుపునిచ్చాయి. తనిఖీలు, నోటీసుల పేరిట కొన్ని జిల్లాల్లో అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని అసోసియేషన్ ఆరోపిస్తోంది. ఇది విద్యార్థులు, టీచర్లు, యాజమాన్యాలను మానసికంగా ప్రభావితం చేస్తోందని వారు తెలిపారు. సరిగ్గా పరిశీలించకుండా ఎలాంటి చర్యలు తీసుకోవడం సబబు కాదని పేర్కొంటూ, ప్రభుత్వం తమ ఆవేదనను సీరియస్‌గా తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
YS Jagan: మరోసారి కూటమి ప్రభుత్వంపై ఫైర్ అయిన వైఎస్ జగన్.. ఏమన్నారంటే?
ప్రైవేట్ పాఠశాలలు ప్రభుత్వానికి ఆర్థిక భారం కాకుండా సేవలందిస్తున్నాయని యాజమాన్యాలు స్పష్టం చేశాయి. రాష్ట్రవ్యాప్తంగా 55 శాతం కన్నా ఎక్కువ మంది విద్యార్థులు ప్రైవేట్ పాఠశాలల ద్వారానే విద్యా సేవలు పొందుతున్నారని పేర్కొన్నారు. విద్యా ప్రమాణాలు మెరుగ్గా ఉండేందుకు తాము నిరంతరం కృషి చేస్తున్నామని, కానీ కొంతమంది అధికారులు తమ అధికారాలను అతి వేగంగా వినియోగించి పాఠశాలలపై ఒత్తిడి తెస్తున్నారని వాపోయారు.
ఈ క్రమంలోనే తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు జూలై 3న రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రైవేట్ పాఠశాలలను మూసివేయాలని నిర్ణయించారు. ఒకరోజు బంద్ ద్వారా తమ నిరసన తెలియజేసి, అధికారుల దుర్వ్యవహారాన్ని నియంత్రించాలన్నదే తమ ఉద్దేశమని స్పష్టం చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాదని, సమస్యల పరిష్కారానికే ఈ బంద్ చేపడుతున్నామని పాఠశాలల యాజమాన్యాలు స్పష్టంచేశాయి. తగిన చర్యలు తీసుకుని సమస్యలను పరిష్కరించాలని వారు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.