Janasena : వైసీపీ కోటలు బద్దలు కొట్టే వ్యూహంతో పవన్
Janasena : ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ వర్గాల్లో తన ప్రభావాన్ని పెంచుకోవాలని పవన్ భావిస్తున్నారు.
- By Sudheer Published Date - 03:48 PM, Sun - 1 June 25

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan) తన మంత్రిత్వ బాధ్యతలను చేపట్టినప్పటి నుంచే పంచాయతీరాజ్, అటవీ, పర్యావరణ శాఖలపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఈ శాఖలను కావాలనే కోరుకోవడం వెనుక ఆయన వ్యూహాత్మక ఆలోచన దాగి ఉంది. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ వర్గాల్లో తన ప్రభావాన్ని పెంచుకోవాలని పవన్ భావిస్తున్నారు. ఇందులో భాగంగా “పల్లె పండుగ” మరియు “అడవి బాట” కార్యక్రమాల ద్వారా ప్రజలతో ప్రత్యక్షంగా మమేకమవుతున్నారు. గ్రామాల్లో అభివృద్ధి పనులు, గిరిజన గ్రామాలకు రహదారి సదుపాయాలు కల్పించడం ద్వారా ఆయా ప్రాంతాల్లో పవన్ తన ముద్ర వేస్తున్నారు.
Harish Rao : నీ అనుచరుల కోసమే అందాల పోటీలు పెట్టావా..?
పవన్ కల్యాణ్ ఇటీవల పార్వతీపురం మన్యం, అల్లూరి జిల్లాల్లో పర్యటించి, అక్కడి గిరిజనుల సమస్యలను స్వయంగా తెలుసుకుని పరిష్కార చర్యలు తీసుకున్నారు. రహదారులు నిర్మించడం, ఉచిత చెప్పుల పంపిణీ వంటి కార్యక్రమాల ద్వారా ఆయనకు స్థానిక ఆదివాసీల మద్దతు పెరుగుతోంది. ముఖ్యంగా కొండ ప్రాంతాల్లో రోడ్లే తెలియని ప్రాంతాల్లో రూ.88 లక్షల వ్యయంతో రోడ్డు నిర్మించి మౌలిక వసతులు కల్పించడం గిరిజనులకు ఎంతో ఊరటనిచ్చింది. ప్రజల నిత్య జీవితాల్లో మార్పు తెచ్చే పనులు చేయడం ద్వారా పవన్ గిరిజనుల్లో మంచి పేరు తెచ్చుకుంటున్నారు.
గత చరిత్రలో , అలాగే వైసీపీకి కంచుకోటగా నిలిచిన రిజర్వు నియోజకవర్గాలపై పవన్ ఇప్పుడు వ్యూహాత్మక దృష్టి పెట్టారు. గత ఎన్నికల్లో వైసీపీ గెలిచిన 29 రిజర్వు స్థానాల్లో ఒక్కటీ టీడీపీ గెలవలేకపోవడం వల్ల పవన్ ఇప్పుడు ఆయా ప్రాంతాల్లో తన దూకుడు పెంచారు. రిజర్వు స్థానాల్లో విశ్వసనీయత పెంచుకోవడం ద్వారా ప్రభుత్వంలో తన ప్రభావాన్ని మరింత పెంచుకునే ప్రయత్నంలో ఉన్నారు. కానీ పవన్ ఈ వ్యూహం ఎంతవరకు విజయవంతమవుతుందనేది త్వరలోనే తేలనుంది.