Chandrababu Arrest : చంద్రబాబు అరెస్టు పై పవన్ ఫైర్..
చంద్రబాబు అరెస్ట్ పై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. అన్యాయంగా చంద్రబాబును అరెస్టు చేశారని మండిపడ్డారు.
- Author : Pasha
Date : 09-09-2023 - 12:22 IST
Published By : Hashtagu Telugu Desk
చంద్రబాబు అరెస్ట్ (Chandrababu Arrest) పై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) స్పందించారు. అన్యాయంగా చంద్రబాబును అరెస్టు చేశారని మండిపడ్డారు. ఈమేరకు సందేశంతో ఓ వీడియోను పవన్ కళ్యాణ్ విడుదల చేశారు. ప్రాధమిక ఆధారాలు చూపకుండా అర్దరాత్రి టైంలో అరెస్టు చేసే విధానాన్ని వైసీపీ ప్రభుత్వం అవలంబిస్తుండటం సరికాదన్నారు. గత ఏడాది అక్టోబర్ లో విశాఖలో కూడా జనసేన పట్ల జగన్ సర్కారు ఏ విధంగా వ్యవహరించిందో అందరూ చూశారని పవన్ మండిపడ్డారు. ఏ తప్పూ చేయని జనసేన పార్టీ లీడర్ల పై హత్యాయత్నం కేసులు బనాయించి అక్రమ అరెస్టులు చేశారని ఆయన గుర్తు చేశారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబును పోలీసులు అరెస్టు చేసిన తీరును సంపూర్ణంగా జనసేన ఖండిస్తుందని ఆయన వెల్లడించారు.
Read Also : Skill Development Scam : చంద్రబాబుకు పదేళ్ల జైళ్ల శిక్ష పడొచ్చు..? – ఏపీ CID చీఫ్ సంజయ్
పాలనా పరంగా ఎంతో అనుభవం ఉన్న చంద్రబాబు లాంటి వ్యక్తి పట్ల జగన్ సర్కారుకు ఇలాంటి వైఖరి ఉండటం సరికాదన్నారు. గతంలో చిత్తూరులో కూడా ఇదే విధంగా చంద్రబాబు పట్ల జగన్ ప్రభుత్వం దారుణంగా వ్యవహరించిందని చెప్పారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే చర్యలను జగన్ ప్రభుత్వమే ప్రోత్సహిస్తోందని పవన్ కళ్యాణ్ ఆరోపించారు. చంద్రబాబును అరెస్టు చేసి, రోడ్లపైకి రావద్దని టీడీపీ నాయకులను హెచ్చరించడం అమానుషమని పేర్కొన్నారు. ఒక పార్టీ అధినేతను అరెస్ట్ చేసినప్పుడు క్యాడర్ బయటికి వచ్చి నిరసనలు తెలపడం సహజమేనని, దాన్ని కూడా ఆపేలా పోలీసులు హెచ్చరికలు జారీ చేయడం కరెక్ట్ కాదని ఆయన అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే.. వైసీపీ, ప్రభుత్వం, పోలీసులు ఊరుకోరని ఏపీ పోలీసు శాఖ వివాదాస్పద ప్రకటన చేసిందని మండిపడ్డారు.