Pawan Kalyan: పార్ట్ టైం కాదు.. ఫుల్ టైం `జనవాణి`!
- Author : CS Rao
Date : 29-06-2022 - 4:00 IST
Published By : Hashtagu Telugu Desk
ప్రత్యామ్నాయ శక్తిగా ఎదుగుతోన్న జనసేన వ్యూహాత్మక కార్యక్రమాలను రూపొందిస్తోంది. దసరా తరువాత పవన్ కల్యాణ్ రోడ్ షోలకు ప్లాన్ చేస్తున్నారు. అందుకు సంబంధించిన కాన్వాయ్ ను కూడా సిద్ధం చేసిన అంశం సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆ లోపు ప్రజలతో మమేకం కావడానికి `జనవాణి` అనే ఒక ప్రోగ్రామ్ ను వినూత్నంగా ఆ పార్టీ రూపొందించింది.
నాన్ సీరియస్ పొలిటిషియన్ గా ప్రత్యర్థులు పవన్ పై తొలి నుంచి దాడి చేస్తున్నారు. దానికి చెక్ పెట్టడానికి సంతకాలు చేసిన సినిమాలను కూడా వదలుకున్నారని టాలీవుడ్ టాక్. ఇక నుంచి ప్రజలతోనే ఉండేలా కార్యక్రమాలను జనసేన రూపొందిస్తోంది. ఇక నుంచి నేరుగా పవన్ కల్యాణ్ ప్రజల సమస్యలను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఐదు వారాల పాటు `జనవాణి` పేరుతో ఫిర్యాదులను అందుకోనున్నారు.
తొలి విడత జులై 3న విజయవాడలోని మాకినేని బసవపున్నయ్య ఆడిటోరియంలో ‘జనవాణి` ద్వారా అర్జీలను స్వయంగా పవన్ అందుకుంటారు. రెండో ఆదివారం కూడా విజయవాడ కేంద్రంగా ‘జనవాణి` ఉండేలా జనసేన ప్లాన్ చేసింది. ఆ తరువాత ఉత్తరాంధ్ర, రాయలసీమ, ఉభయగోదావరి ప్రాంతాల్లోని ప్రజల సమస్యలను పవన్ తెలుసుకుంటారు. ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఉండేలా షెడ్యూల్ చేశారు. సామాన్యుడికి న్యాయం జరిగేలా ఈ కార్యక్రమం రాజకీయాలకు అతీతంగా ఉంటుందని ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. ప్రజల విశ్వాసాన్ని పొందడానికి `జనవాణి` బాగా ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. ఇప్పటికే పవన్ కు చెప్పుకుంటే సమస్యలు పరిష్కారం అవుతాయన్న నమ్మకం ఉందని జనసేన విశ్వసిస్తోంది. మరింత నమ్మకాన్ని ప్రజల్లో కలిగించేందుకు ఐదు ఆదివారాల పాటు `జనవాణి` వివిధ ప్రాంతాల్లో ఉంటుందని ప్రాథమికంగా జనసేన వెల్లడించింది.
సాధారణంగా ప్రభుత్వాలు గ్రీవెన్స్ డే గా ప్రతి సోమవారం నిర్వహిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో నిర్వహించే ఈ కార్యక్రమంలో సామాన్యులు కలెక్టర్ లేదా జాయింట్ కలెక్టర్లతో కూడిన అధికార బృందానికి కలెక్టరేట్ కేంద్రం ఇస్తుంటారు. అలాగే, మండల స్థాయిలో ఎమ్మార్వో, డివిజన్ స్థాయిలో ఆర్డీవో ఆధ్వర్యంలో కొన్నేళ్లుగా గ్రీవెన్స్ నడుస్తోంది. అదే తరహాలో పవన్ `జనవాణి` ఉండనుంది. ఆయన వద్దకు వచ్చే ఆర్జీలను ఆ రోజు సాయంత్రానికి సంబంధిత అధికారులకు పంపిస్తారు. ఆ తరువాత జనసేన కేంద్ర కార్యాలయం నుంచి వాటి పరిష్కారాన్ని సమీక్షిస్తారంట. పవన్ కల్యాణ్ స్వీకరించే ప్రతి అర్జీకి రసీదు ఇవ్వడంతో పాటు ఆ పార్టీ లీడర్లు నిరంతం వాటి పరిష్కారం కోసం ప్రయత్నం చేస్తారు. ఇలా, కొత్త వినూత్నంగా `జనవాణి` కార్యక్రమాన్ని రూపుదిద్దారు. ఐదు వారాల పాటు వచ్చే అర్జీలపై అధ్యయనం చేసి అక్టోబర్లో నిర్వహించే రోడ్ షోల ద్వారా వాటిని మరింత ప్రాచుర్యంలోకి తీసుకెళనున్నారు. మొత్తం మీద పవన్ సీరియస్ పొలిటిషియన్ గా ప్రజల్లో గుర్తింపు పొందేలా జనసేన పక్కా స్కెచ్ వేసింది.