AP : చట్టాన్ని ఉల్లంఘించే స్కానింగ్ సెంటర్లపై కఠిన చర్యలు.. కలెక్టర్ హెచ్చరిక
- Author : Prasad
Date : 27-05-2026 - 12:14 IST
Published By : Hashtagu Telugu Desk
గర్భస్థ పిండ లింగ నిర్ధారణ నిషేధ (PC-PNDT) చట్టాన్ని ఉల్లంఘించే స్కానింగ్ సెంటర్లు, ఐవీఎఫ్ కేంద్రాలపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ హెచ్చరించారు. చట్టాన్ని ఉల్లంఘించే కేంద్రాలపై ఆకస్మిక తనిఖీలు, డెకాయ్ ఆపరేషన్లను మరింత ముమ్మరం చేయాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో పీసీ-పీఎన్‌డీటీ, ఏఆర్‌టీ-సరోగసీ చట్టాల అమలుపై జిల్లా స్థాయి కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో పిండ లింగ నిర్ధారణ నిషేధ చట్టాన్ని కఠినంగా అమలు చేయాలని, ఫిర్యాదులు అందిన వెంటనే వాటిపై వేగంగా చర్యలు తీసుకోవాలని సూచించారు.
గర్భస్థ పిండ లింగ నిర్ధారణ పరీక్షలు చట్టరీత్యా నేరమని, దీనిపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. వైద్య ఆరోగ్య శాఖ, మహిళా శిశు సంక్షేమ శాఖ, పోలీసు శాఖ తదితర విభాగాలు సమన్వయంతో పని చేయాలని సూచించారు. అలాగే స్కానింగ్ కేంద్రాలు అన్ని నిబంధనల ప్రకారం పనిచేయాలని, ఐవీఎఫ్ కేంద్రాలు దంపతులకు సక్సెస్ రేట్‌పై స్పష్టమైన సమాచారం అందించాలని ఆదేశించారు. నిబంధనల ఉల్లంఘన నిరూపితమైతే రెన్యువల్ నిరాకరించడంతో పాటు కేంద్రాల అనుమతులు పూర్తిగా రద్దు చేస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో డీఎంహెచ్‌వో డా. ఎం. సుహాసిని, వాసవ్య సంస్థ ప్రతినిధులు, వైద్య నిపుణులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.