AP TET Results: ఏపీ టెట్ ఫలితాలు విడుదల చేసిన మంత్రి నారా లోకేష్
ఏపీ టెట్ ఫలితాలు విడుదలయ్యాయి. మంత్రి నారా లోకేష్ సోమవారం ఉదయం ఫలితాలను ప్రకటించారు. ఈ పరీక్షలో 50.79% మంది అర్హత సాధించారు, మొత్తం 1,87,256 మంది అర్హత పొందారు.
- By Kode Mohan Sai Published Date - 01:00 PM, Mon - 4 November 24

AP TET Results: ఏపీ టెట్ – 2024 ఫలితాలు విడుదలయ్యాయి. సోమవారం ఉదయం మంత్రి నారా లోకేష్ ఫలితాలను ప్రకటించారు. ఈ పరీక్షలో 50.79% మంది అర్హత సాధించారు, అంటే మొత్తం 1,87,256 మంది అర్హత పొందారు. ఈ సందర్భంలో మంత్రి, త్వరలో మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ను విడుదల చేయబోతున్నట్లు తెలిపారు.
రాష్ట్రంలో యువత, నిరుద్యోగులకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. ఈ క్రమంలో అక్టోబర్ 2024లో నిర్వహించిన టెట్ పరీక్ష ఫలితాలను ఈరోజు విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా 3,68,661 మంది ఈ పరీక్షకు హాజరుకాగా, అందులో 1,87,256 మంది (50.79%) అర్హత సాధించారు. ఫలితాలను తెలుసుకోవడానికి (https://cse.ap.gov.in) వెబ్‌సైట్‌ను సందర్శించాలని సూచించారు. నిరుద్యోగ టీచర్లకు ఇచ్చిన వాగ్దానాన్ని గుర్తించి, త్వరలో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తామన్నారు. టెట్‌లో అర్హత సాధించిన వారందరికీ మంత్రి నారా లోకేష్ శుభాకాంక్షలు తెలిపారు.
రాష్ట్రంలో యువత, నిరుద్యోగులకు ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చే దిశగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా ఈ ఏడాది జూలైలో నిర్వహించిన టెట్ -2024 ఫలితాలను ఈరోజు విడుదల చేస్తున్నాం. ఈ పరీక్షలకు రాష్ట్రవ్యాప్తంగా 3,68,661 మంది… pic.twitter.com/7RJmwmtu1Q
— Lokesh Nara (@naralokesh) November 4, 2024
గత నెల అక్టోబర్‌లో నిర్వహించిన ఏపీ టెట్ -2024 పరీక్షకు మొత్తం 4,27,300 మంది దరఖాస్తు చేసుకోగా, 3,68,661 మంది పరీక్ష రాశారు. 58,639 మంది గైర్హాజరయ్యారు. 16,347 పోస్టుల కోసం త్వరలో మెగాడీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేయనున్నందున, టెట్ ఫలితాలపై అభ్యర్థుల్లో ఆసక్తి పెరిగింది. టెట్‌లో అర్హత సాధించినవారికి డీఎస్సీలో దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. గతంలో టెట్ అర్హత సర్టిఫికెట్ 7 సంవత్సరాల పాటు మాత్రమే చెల్లుబాటులో ఉండగా, 2022 నుండి ఇది జీవిత కాలానికి మార్చబడింది. 2022 టెట్‌లో చాలామంది అర్హత సాధించినప్పటికీ, మార్కుల్లో మెరుగుదల కోసం మరోసారి పరీక్ష రాసేందుకు చాలామంది సిద్ధమయ్యారు. డీఎస్సీలో టెట్ మార్కులకు 20% వెయిటేజీ ఉంటుంది.