Pastor Praveen : పాస్టర్ ప్రవీణ్ కేసులో కీలక మలుపు
Pastor Praveen : సుమారు 200 సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలించిన పోలీసులు, ప్రవీణ్ రామవరప్పాడు వద్ద రాత్రి 8.47 గంటలకు చివరిసారిగా కెమెరాలో రికార్డు అయినట్లు గుర్తించారు
- By Sudheer Published Date - 10:09 AM, Mon - 31 March 25

పాస్టర్ పగడాల ప్రవీణ్ (Pastor Praveen)అనుమానాస్పద మృతి కేసులో విచారణ ఊహించని మలుపు తిరిగింది. ఈ కేసును పోలీసులు సీరియస్‌గా తీసుకుని, ప్రవీణ్ చివరి కదలికలను గుర్తించేందుకు సాంకేతిక ఆధారాలను సేకరించారు. సీసీ కెమెరాల ఫుటేజీ ద్వారా ఆయన రాజమహేంద్రవరం చేరుకునే ముందు విజయవాడలో ఆగినట్టు వెల్లడైంది. అంతేకాక అతను కోదాడ వద్ద మద్యం కొనుగోలు చేసినట్లు, అనంతరం బుల్లెట్ బైక్ అదుపు తప్పినట్లు గుర్తించారు. ఈ ప్రమాదంలో ప్రవీణ్ చేతులకు గాయాలయ్యాయి. అనంతరం గొల్లపూడి ప్రాంతంలో పెట్రోల్ బంక్ వద్దకు వెళ్లి, అక్కడ చెల్లింపులు ఫోన్‌పే ద్వారా చేసినట్లు ఆధారాలు బయటపడ్డాయి.
PM Internship Scheme: కేంద్రం కొత్త స్కీమ్.. ఏడాదికి రూ. 66 వేలు, ఈరోజే లాస్ట్ డేట్..!
పోలీసులు సేకరించిన ఫుటేజీ ప్రకారం.. ప్రవీణ్ తీవ్ర అస్వస్థతతో కనిపించాడని బంక్ సిబ్బంది పేర్కొన్నారు. ట్రాఫిక్ పోలీసులు అతనికి సహాయం చేసినప్పటికీ, ప్రవీణ్ తన ప్రయాణాన్ని కొనసాగించాడు. మహానాడు కూడలి రామవరప్పాడు రింగ్ వద్ద అతని బుల్లెట్ బైక్ పాక్షికంగా దెబ్బతిన్నట్లు గుర్తించారు. అక్కడ పోలీసులు అతన్ని రెయిలింగ్ వద్ద కూర్చోబెట్టి, విశ్రాంతి తీసుకునేందుకు వీలు కల్పించారు. ఆ తరువాత స్థానిక టీ స్టాల్ వద్దకు తీసుకెళ్లి టీ ఇచ్చారు. రాత్రి 8.20 గంటల వరకు గడ్డిలో విశ్రాంతి తీసుకున్న ప్రవీణ్ మళ్లీ బుల్లెట్ బైక్‌పై ఏలూరు వైపు బయల్దేరాడు.
సుమారు 200 సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలించిన పోలీసులు, ప్రవీణ్ రామవరప్పాడు వద్ద రాత్రి 8.47 గంటలకు చివరిసారిగా కెమెరాలో రికార్డు అయినట్లు గుర్తించారు. ఈ ఆధారాలన్నిటిని పరిశీలించి, ప్రవీణ్ మరణానికి గల అసలు కారణాన్ని నిర్ధారించేందుకు పోలీసులు కృషి చేస్తున్నారు. ప్రయాణం మధ్యలో జరిగిన సంఘటనలు, ప్రమాదం, శారీరక గాయాలు, అస్వస్థత వంటి అంశాలన్నీ మిస్టరీగా మారాయి. తాజా ఆధారాలు వెలుగులోకి రావడంతో ఈ కేసులో మరింత స్పష్టత రాబోతోందని పోలీసులు భావిస్తున్నారు.