Janasena: భవిష్యత్తు ఆశల వారధి ఆవిర్భావ సభ – ‘పవన్ కళ్యాణ్’
- Author : HashtagU Desk
Date : 13-03-2022 - 2:18 IST
Published By : Hashtagu Telugu Desk
జనసేన పార్టీని స్థాపించి ఎనిమిది సంవత్సరాలు పూర్తి చేసుకొని 9వ వసంతంలోకి అడుగుపెడుతోందని అన్నారు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్. తొమ్మిదవ ఆవిర్భావ దినోత్సవాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి సమీపంలోని మంగళగిరి నియోజకవర్గం, ఇప్పటం గ్రామంలో నిర్వహిస్తున్నామని తెలిపారు. రాష్ట్ర క్షేమాన్ని ఆకాంక్షించేవారు, జనసైనికులు, వీరమహిళలు ప్రతి ఒక్కరు ఈ సభకు ఆహ్వానితులే. వీర మహిళలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశాం. వాళ్లు ప్రశాంతంగా కూర్చోవడానికి ప్రత్యేకంగా సీటింగ్ ఏర్పాటు చేశాం. ఈ సభ కోసం పార్టీ నాయకులు గత 10 రోజులుగా చాలా కష్టపడుతూ అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సభా ప్రాంగణానికి వచ్చేవారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు జరుగుతున్నాయి. వేదికకు దూరంగా ఉన్నవారి కోసం ఎల్.ఈ.డి. స్కీన్లు ఏర్పాటు చేస్తున్నాం. ఈ ప్రాంగణానికి నేను ఎంతగానో అభిమానించే దామోదరం సంజీవయ్య గారి పేరు నిర్ణయించాం. వారి స్ఫూర్తిని కొనసాగిస్తామని అన్నారు పవన్ కళ్యాణ్.
ఇది అన్ని సభల్లాంటి సభ కాదు:
ఈ నెల 14న జరగబోయే జనసేన ఆవిర్భావ దినోత్సవాన్ని అన్ని ఆవిర్భావ దినోత్సవాల్లాగా చూడడం లేదు. భవిష్యత్తు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను, రాష్ట్ర భవిష్యత్తును దిశానిర్దేశం చేయబోతున్నాం. గత రెండున్నరేళ్లలో ఏమి జరిగింది? ప్రజలు ఎలాంటి ఇబ్బందులు, ఉపద్రవాలు ఎదుర్కొన్నారు? భవిష్యత్తు ఎలా ఉండబోతోంది? భావి తరాలకు ఎలాంటి భరోసా కల్పిస్తే బలమైన భవిష్యత్తు ఇవ్వగలం? వంటి అంశాలపై సభా వేదికపై మాట్లాడతాను. అందుకే మీరందరూ క్షేమంగా వచ్చి సభను విజయవంతం చేసి క్షేమంగా ఇంటికి వెళ్తారని ఆశిస్తున్నానని తెలిపారు జనసేనాని పవన్ కళ్యాణ్.
ఇది మా హక్కు అని చెప్పండి:
సభకు రానీయకుండా జగన్ ప్రభుత్వం ఇబ్బందులు కలిగిస్తే సభకు వెళ్లడం మా హక్కు అని చెప్పండి. మన ఆవిర్భావ దినోత్సవం మన హక్కు. ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదు. పోలీస్ శాఖ వారికి కూడా మనస్ఫూర్తిగా విన్నవిస్తున్నాం… సభకు పూర్తిగా సహకరించండి. ఈ కీలకమైన సభలో రాష్ట్రానికి సంబంధించి అనేక అంశాలపై మాట్లాడబోతున్నాను. చాలా మందికి చాలా సందేహాలు ఉన్నాయి. ఎన్నో విమర్శలు చేశారు. వాటన్నింటిపై కూడా ఆవిర్భావ దినోత్సవంలో సమాధానాలు చెప్తాను. 9వ ఆవిర్భావ దినోత్సవానికి వస్తున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ఆహ్వానం. అలాగే దీనిని టీవీలో వీక్షించే వారికి, ప్రసారం చేసే మీడియా సంస్థలు, జర్నలిస్టులకు ధన్యవాదాలు. తెలుగు ప్రజల ఐక్యత కోసం, ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కోసం నిర్వహిస్తున్న ఈ సభకు అందరూ కలిసి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు తెలిపారు జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్.