Nara Lokesh Warning : తప్పు చేసిన ఏ వైసీపీ నేతను వదిలిపెట్టను – మంత్రి లోకేష్
Nara Lokesh Warning : ఈ కేసులో అన్ని వాస్తవాలు త్వరలో వెలుగులోకి వస్తాయని, చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు
- Author : Sudheer
Date : 16-02-2025 - 8:16 IST
Published By : Hashtagu Telugu Desk
ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారిన వల్లభనేని వంశీ అరెస్టు(Vallabhaneni Vamsi Arrest)పై మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) స్పందించారు. ఎస్సీ యువకుడిని కిడ్నాప్ చేసినందుకే వంశీ జైలుకు వెళ్లాడని స్పష్టంగా పేర్కొన్నారు. ఈ కేసులో అన్ని వాస్తవాలు త్వరలో వెలుగులోకి వస్తాయని, చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. గత ఐదేళ్ల వైసీపీ పాలనలో అన్యాయంగా టీడీపీ నాయకులను వేధించిన ప్రతి ఒక్కరిపై “రెడ్ బుక్” ప్రకారం చర్యలు తీసుకుంటామని నారా లోకేశ్ హెచ్చరించారు. 2019-24లో అరాచక పాలన సాగిందని మంత్రి లోకేశ్ ఆరోపించారు. ప్రజాసమస్యలపై పోరాడుతున్న టీడీపీ నాయకులను పోలీసులు అన్యాయంగా వేధించారని, చంద్రబాబును నిర్బంధించేందుకు ఇంటి గేటుకు తాళాలు వేసే పరిస్థితి కూడా తీసుకొచ్చారని గుర్తు చేశారు. టీడీపీ కార్యాలయాలపై దాడులు చేయించడమే కాకుండా, అక్రమ కేసులు పెట్టి నాయకులను ఇబ్బంది పెట్టారని అన్నారు. ఇప్పుడు అదే వైసీపీ నేతలు న్యాయం గురించి మాట్లాడటం హాస్యాస్పదమని పేర్కొన్నారు.
NTR Trust Euphoria Musical Night : బాలకృష్ణ గురించి పవన్ ఆసక్తికర వ్యాఖ్యలు
వల్లభనేని వంశీకి మద్దతుగా జగన్ మాట్లాడడం దురుద్దేశపూరితం అని హోంమంత్రి అనిత అన్నారు. టీడీపీ కార్యాలయాలపై దాడి జరిగినప్పుడు స్పందించని జగన్, ఇప్పుడు వంశీకి మద్దతుగా మాట్లాడటం దయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని ఆమె వ్యాఖ్యానించారు. వంశీ అరెస్టు కేసు న్యాయపరంగా జరుగుతుందని, దళిత యువకుడిపై దాడి కేసులో పోలీసుల విచారణ కొనసాగుతోందని వివరించారు. అయితే వైసీపీ దీనిపై దుష్ప్రచారం చేస్తోందని ఆమె మండిపడ్డారు. టీడీపీ మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న కూడా వంశీ అరెస్టుపై స్పందించారు. వల్లభనేని వంశీ లాంటి వారు సమాజానికి హానికరమని, ఆయనను వెనకేసుకురావడం చాలా సిగ్గుచేటు అని విమర్శించారు. వైసీపీ పాలనలో ప్రజలు అనుభవించిన బాధలే ఎన్నికల్లో తీర్పుగా మారాయని, అందుకే ప్రజలు ఆ పార్టీ ని ప్రతిపక్ష హోదా కూడా లేకుండా ఓడించారని గుర్తు చేశారు.