J Brands in AP : ఏపీలో ‘జే బ్రాండ్’ బాజా
ఏపీ ప్రభుత్వం విక్రయిస్తోన్న మద్యం బ్రాండ్లపై కేంద్రం ఆరా తీస్తోంది. జంగారెడ్డిగూడెం కల్తీసారా మరణాల తరువాత ఏపీ మద్యంపై కేంద్రం దృష్టి పడింది.
- By CS Rao Published Date - 03:09 PM, Wed - 23 March 22

ఏపీ ప్రభుత్వం విక్రయిస్తోన్న మద్యం బ్రాండ్లపై కేంద్రం ఆరా తీస్తోంది. జంగారెడ్డిగూడెం కల్తీసారా మరణాల తరువాత ఏపీ మద్యంపై కేంద్రం దృష్టి పడింది. మద్యం తయారీకి వాడుతోన్న పదార్థాల గురించి తెలుసుకోవడానికి నిపుణులతో అధ్యయనం చేయడానికి సిద్ధం అవుతున్నట్టు తెలుస్తోంది. మద్య నిషేధం హామీ వెనుక నడుస్తోన్న బ్రాండ్ల దందా ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేస్తోంది. ఆ మేరకు ఏపీ బీజేపీ ఎప్పటికప్పుడు కేంద్రానికి నివేదికలను అందచేస్తోందని తెలుస్తోంది. ఒక సామాజిక కార్యకర్త ఏపీ మద్యం బ్రాండ్ల శాంపిల్స్ ను తమిళనాడులోని ఒక ల్యాబ్ లో టెస్ట్ చేయగా వచ్చిన ఫలితాలంటూ ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. దాని సారాంశం భయంకర నిజాలను బయట పెట్టింది. దాని వివరాలు ఇలా ఉన్నాయి..
దేశంలో తయారవుతున్న ప్రముఖ మద్యం కంపెనీల బ్రాండ్లను కాదని…ఏపీ లో కొత్త బ్రాండ్ల మద్యం తయారీ అవుతోంది. ప్రమాదకర రసాయనాలతో మద్యాన్ని చౌకగా తయారు చేస్తూ రూ.10ల మద్యాన్ని 150కి ప్రభుత్వ దుకాణాల వద్ద విక్రయిస్తున్నారని వస్తోన్న ఆరోపణలు కోకొల్లలు.
డేంజర్ లిక్కర్ గుట్టురట్టు
సామాజిక కార్యకర్త ఒకరు చొరవ తీసుకుని ప్రభుత్వ మద్యం దుకాణాల్లోఅమ్ముతున్న బ్రాండ్లు ఓల్డ్ టైమర్ ,చాంపియన్, రాయల్‌సింహ, గ్రీన్ చాయిస్, సెలబ్రిటీ విస్కీ-బ్రాందీలను కొనుగోలు చేశాడు. తమిళనాడు రాష్ట్రంలోని వందేళ్లకి పైగా ప్రతిష్టాత్మక చరిత్ర గలిగిన ఫార్చ్యూన్ -500 కంపెనీల్లో ఒకటైన ఎస్ జీ సి ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ చెన్నై ల్యాబ్‌కి పరీక్షల కోసం పంపాడట.ఆ ల్యాబ్‌లలో పరీక్షించిన మద్యం రకాలన్నీ దాదాపుగా ‘స్లోపాయిజన్’తో సమానమని తేలిందట. ఆ మద్యంలో బెంజోక్వినోన్, స్కోపారోన్, డైమితోక్సినామిక్ యాసిడ్, పైరోగలాల్, వొల్కెనిన్, కాప్రొనల్యాక్టమ్ వంటి రసాయనాలు కనిపించాయని ఆ సామాజిక కార్యకర్తలకు ఇచ్చిన నివేదికలో పొందుపరిచిందని తెలుస్తోంది. ఆ రసాయనాల కారణంగా చర్మం పైపొరల్లోని సన్నని నరాలు క్రమంగా బలహీనం అవుతాయని వైద్యులు చెబుతున్నారు. దీర్ఘకాలంలో రక్త ప్రసరణపైనా ప్రభావం చూపుతుంది. మద్యం తాగిన 10 నుంచి 20 నిమిషాల వ్యవధిలో ఆయాసం వస్తుంది.మూత్ర సంబంధ సమస్యలు తలెత్తుతాయని నిపుణులు చెబుతున్నారు. ఆయా బ్రాండ్ల వారీగా తమిళనాడు. ల్యాబ్ ఇచ్చిన నివేదిక ప్రకారం సక్రమించే వ్యాధులు భయంకరం.
ఓల్డ్ టైమర్ విస్కీ
OLD TIMER DELUX WHISKYని కెమికల్ అనాలసిస్ చేయిస్తే బయటపడిన Benzoquinone, Volkenin, Scoparone, Dimethoxycinnamicacid ప్రమాదకర రసాయనాలు. వీటి కారణంగా ఒక్కసారిగా శ్వాసక్రియ పెరిగిపోవడం, బీపీ పడిపోవడం, నాడీ వ్యవస్థ పనితీరు ఒక్కసారిగా వేగవంతం కావడం, తల తిరగడం, తలనొప్పి, కడుపు నొప్పి, వాంతులు, అతిసారం, మానసిక గందరగోళం, శరీరం మెలికలు తిరగడం, మూర్చపోవడం, కళ్లు మండటం, చర్మం దురద, లివర్ సంబంధిత వ్యాధులు వస్తాయని వైద్యులు చెబుతున్నారు.
చాంపియన్ విస్కీ
మరో బ్రాండ్ CHAMPION SPECIAL WHISKYలో పరీక్షల అనంతరం Pyrogallol అనే రసాయనం బయటపడిందట. ఈ విస్కీ తాగినవారిలో దగ్గు, గొంతునొప్పి, చర్మం కందిపోవడం, కళ్లు ఎరుపెక్కడం, వాంతులు, అతిసారం, శ్వాస ఒక్కసారిగాపెరిగిపోవడం, బీపీ పడిపోవడం, ఒక్కసారిగా నాడీ వ్యవస్థ పనితీరు వేగంవంతం కావడం, తల తిరగటం, తలనొప్పి, కడుపు నొప్పి, వాంతులు, మానసిక గందరగోళం, శరీరం మెలికలు తిరగడం, మూర్ఛపోవడం వంటిసమస్యలతో ఇబ్బంది పడతారు.
రాయల్ సింహ విస్కీ
ప్రభుత్వ మద్యం దుకాణాల్లో అమ్ముతున్న ROYAL SIMHA SUPERIOR WHISKY ల్యాబ్‌లో పరీక్షించంగా ప్రమాదకరమైన Volkenin, Caprolactam, Benzoquinone వంటి స్లోపాయిజన్‌తో సమానమైన కెమికల్స్ ఉన్నాయని తేలిందట. ఇవి తాగేవారిలో శ్వాసక్రియ పెరిగిపోవడం, బీపీ పడిపోవడం, ఒక్కసారి నాడీవ్యవస్థ పనితీరు పెరగడం, తల తిరగడం, తలనొప్పి, కడుపు నొప్పి, వాంతులు, అతిసారం, మానసిక గందరగోళం, మెలికలు తిరగడం, మూర్ఛపోవడం, చర్మంపై దురద, నాడీ వ్యవస్థను అస్తవ్యస్తం చేయడం, జీర్ణ వ్యవస్థపై ప్రభావం వంటి దుష్ఫలితాలు కనిపిస్తాయి.
గ్రీన్ చాయిస్ విస్కీ
GREEN CHOICEని పరీక్షలకి పంపించగా Scoparone, Pyrogallol, Dimethoxycinnamicacid, Benzoquinone అవశేషాలు ఈ మద్యంలోఉన్నాయని తేలిందట. ఇవ్వన్నీ విషంతో సమానమైన కెమికల్స్. ఈ బ్రాండ్ తాగే వాళ్లకి కళ్లు మండటం, చర్మంపై దురద, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, లివర్ సంబంధిత వ్యాధులు, దగ్గు, గొంతునొప్పి, చర్మం ఎర్రబడటం, కళ్లు ఎర్రబడటం, వాంతులు, అతిసారం సమస్యలని ఎదుర్కొంటారు.
సెలబ్రిటీ బ్రాందీ
CELEBRITY BRANDYని జరిపిన పరీక్షలో Pyrogallol, Volkenin వంటి తీవ్రమైన విషపూరిత రసాయనాలు బయటపడ్డాయి. ఈ కెమికల్స్ చర్మానికి తగిలినా చాలు చర్మ సంబంధ వ్యాధుల బారిన పడతారు. దాని ఆవిరి పీల్చినా విష ప్రభావానికి లోనవుతారు. ఇవి తాగేవారిలో దగ్గు, గొంతు నొప్పి, కళ్లు ఎర్రబడటం, చర్మం ఎర్రబడటం, వాంతులు, అతిసారం లక్షణాలుంటాయి.
మద్యం తయారీకి కేంద్రం కొన్ని మార్గదర్శకాలు నిర్దేశించింది. ఏపీలో మద్యం బ్రాండ్లన్నీ.. కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాలకి విరుద్ధంగా వున్నాయని టీడీపీ ఆరోపిస్తోంది. తమిళనాడు ల్యాబ్ కూడా అదే తేల్చిందని టీడీపీ లీడర్లు చెబుతున్నారు. ఉత్పత్తికి ఎక్స్‌ట్రా న్యూట్రల్ ఆల్కహాల్(ఈఎన్‌ఏ) అనేది కీలకం. బియ్యం, బియ్యం నూకలు, మొక్కజొన్న ప్రాసెసింగ్ చేయడం ద్వారా తొలుత రెక్టిఫైడ్ స్పిరిట్ తయారు చేస్తారు. దాన్ని మరింత శుద్ధి చేస్తే ఈఎన్‌ఏగా మారుతుంది. స్పిరిట్‌లో ప్యూరిటీ 66శాతం దాటితే ఈఎన్‌ఏగా పిలుస్తారు. ఎక్సైజ్ నిబంధనల ప్రకారం కనీసం 66 శాతం ప్యూరిటీ ఉన్న ఈఎన్‌ఏతోనే మద్యం తయారు చేయాలి. ఆ తర్వాత ఈఎన్‌ఏకు నీరు, రంగు, ఫ్లేవర్, మాల్ట్‌లాంటివి కలిపి మద్యం ఉత్పత్తి చేస్తారు.కానీ ఈఎన్‌ఏ కాకుండా నేరుగా రెక్టిఫైడ్ స్పిరిట్‌తోనే ఏపీ బ్రాండ్ల ఉత్పత్తి ఉందని భావిస్తున్నారు.
రెక్టిఫైడ్ స్పిరిట్ ఎక్కడిది?
వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత కాకినాడ పోర్టు కేంద్రంగా బియ్యం ఎగుమతి బాగా పెరిగింది. రాష్ట్రంలో పండిన పంట కంటే ఎక్కువగా విదేశాలకు ఎగుమతులు చేశారట. 2021 ఆర్దిక సంవత్సరంలో దేశం నుంచి ఎగుమతి అయిన బియ్యంలో 40 శాతం ఏపీ నుంచి ఎగుమతి అయ్యాయి. టీడీపీ హయాంలో కాకినాడ పోర్టు నుంచి 2018-19లో 4,483 కోట్ల రూపాయలు విలువైన 18.09 లక్షల టన్నులు ఎగుమతి చేస్తే, వైసీపీ పాలనలో7,711 కోట్లు విలువైన 3.04 కోట్ల టన్నుల బియ్యం ఎగుమతి చేశారు. మన రాష్ట్రంలోని బియ్యం, నూకలే కాకుండా..దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల నుంచి విదేశాలకు ఎగుమతి చేస్తుంటే…ఏ బియ్యం నుంచి రెక్టిఫైడ్ స్పిరిట్ తయారు చేశారు? అనేది పెద్ద అనుమానం.
ఇథైల్ కి బదులు విషం వాడకం
మద్యం తయారీలో కీలకమైన లిక్విడ్ ఇథైల్ ఆల్కహాల్ వాడతారు. ఏపీలో ఉత్పత్తి అవుతోన్న లక్షల లీటర్ల మద్యానికి సరిపడా ఇథైల్ ఆల్కహాల్ రాష్ట్రంలో ఉత్పత్తి కాలేదు. దేశంలోనూ లేదు. ఇథైల్ ఆల్కహాల్ 2019-2021 వరకూ ఎంత దిగుమతి చేసుకున్నారు అని ఒక సమాచార హక్కు కార్యకర్త అడిగితే అసలు దిగుమతి చేసుకోలేదని సంబంధిత శాఖ నుంచి సమాచారం అందింది. మద్యం తయారీకి అత్యవసరమైన ఇథైల్ ఆల్కహాల్ దేశీయంగా ఉత్పత్తి లేకుండా, దిగుమతి చేసుకోకుండా ఏపీలో ప్రమాదకర బ్రాండ్ల తయారీకి వాడుతున్న రసాయనాలు ఏంటనేది ఎస్ జీ ఎస్ ల్యాబ్ పరీక్షల్లో తేటతెల్లమైంది. ఇథైల్ ఆల్కహాల్‌కి బదులుగా ఎక్స్‌టెర్నల్ మెడిసిన్ తయారు చేసేందుకు వాడే కెమికల్స్‌ని మద్యం తయారీకి వాడుతున్నారని అనుమానిస్తోంది. ఆయిట్మెంట్లు, టాబ్లెట్లు, క్రీములు తయారు చేసుకునేందుకు ఫార్మా కంపెనీలు దిగుమతి చేసుకున్న కెమికల్స్‌నే మద్యం తయారీకి వాడేస్తున్నారని నిపుణుల సందేహంగా ఉండడం గమనార్హం.
2725లో 2000 సొంత బ్రాండ్లు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మద్యం దుకాణాలలో ఊరూ పేరు లేని మద్యం బ్రాండ్లు దాదాపు 2725 రకాలు ఉన్నాయి. వీటిలో 70 శాతం బ్రాండ్లు పేరు గతంలో ఎప్పుడు విని ఉండరు. వీటిని ఎవరు తయారు చేస్తున్నారు? అనేది పెద్ద ప్రశ్న.
మద్యం పాలసీ అమలులోకి రాకముందే రాష్ట్రంలో ప్రముఖ బ్రాండ్ల మద్యం కంపెనీల యజమానుల డిస్టిలరీలు,బ్రూవరీస్ ను ఒక సిండికేట్ స్వాధీనం చేసుకుంది. గతంలో మండలానికి ఓ మద్యం సిండికేట్‌వుండగా, రాష్ట్రమంతా ఇప్పుడు ఒకే సిండికేట్‌గా మారింది. అమ్మేది ప్రభుత్వం పేరుతోనైనా తయారు చేసేది సిండికేట్ల డిస్టిలరీల్లోనే అనేది సర్వత్రా వినిపిస్తోన్న మాట. ఒక ఎంపీకి చెందిన డిస్టలరీ నుంచి ఎస్పీవై గెలాక్సీ బ్రాందీ, ఎస్పీవై చాంపియన్ విస్కీ, ఎస్పీవై, సెలబ్రిటీ బ్రాందీ, వైట్ టస్కర్, దారు హౌస్ బ్రాండ్లు తయారు చేస్తున్నారని వినికిడి. ఓ కీలక మంత్రికి చెందిన అదాన్, లీల డిస్టలరీలు సుప్రీం విస్కీ, బ్రిలియంట్ విస్కీ తయారు చేసి ప్రభుత్వ మద్యం దుకాణాల ద్వారా అమ్ముతున్నారని ప్రచారం జరుగుతోంది. సుమారు 2 వేలకి పైగా బ్రాండ్లన్నీ ఒక ఎంపీ, ఒక మంత్రి, ఒక సలహాదారు డిస్టలరీల నుంచి తయారు చేస్తూ అమ్ముతున్నారని టాక్.
దేశమంతా డిజిటల్ లావాదేవీలు జరుపుతుంటే ఏపీ ప్రభుత్వ మద్యం దుకాణాలలో ఓన్లీ క్యాష్ విక్రయాలే. ప్రమాదకరమైన మద్యం ఒక బాటిల్ తయారీకి రూ.10 అయితే 150కి అమ్ముతున్నారని ఆరోపణ. ఈ 140 సిండికేట్‌కు చేరవేయడానికి ఇలా నగదుకు మాత్రమే తీసుకుని మద్యం అమ్ముతున్నారని సమాచారం. తెలుగుదేశం పార్టీ పాలనలో ఏడాదికి గరిష్టంగా 6 వేల కోట్ల విలువైన మద్యం అమ్మకాలు జరిగాయి. మద్యనిషేధం హామీ ఇచ్చిన వైసీపీ పాలన ఆరంభమయ్యాక గరిష్టంగా 20 వేల కోట్లకి పైగానే విలువున్న మద్యం అమ్మకాలు జరపడం రికార్డ్. సిండికేట్ తయారుచేసిన ఈ మద్యం అమ్మకాల నుంచి నెలకి 200 కోట్లు ప్రభుత్వంలోని కొందరు పెద్దలకు అందేలా కీలక నేత సోదరుడు వ్యవహరిస్తున్నాడని సచివాలయ వర్గాల టాక్.మొత్తం మీద జంగారెడ్డిగూడెం కల్తీ సారా మరణాలు ఏపీలోని మద్యం సిండికేట్ వ్యవహారాన్ని ఢిల్లీ వరకు చేర్చాయి. ఇప్పుడు మోడీ సర్కార్ ఎలా వ్యవహరిస్తుందో..చూడాలి.