Vizag : విశాఖ డిప్యూటీ మేయర్ గా గోవింద్ రెడ్డి ఏకగ్రీవం
Vizag : మంగళవారం నిర్వహించిన గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ (జీవీఎంసీ) సమావేశంలో 59 మంది సభ్యుల సమ్మతి తో ఆయనను డిప్యూటీ మేయర్‌గా ప్రకటించారు
- By Sudheer Published Date - 12:23 PM, Tue - 20 May 25

విశాఖపట్నం డిప్యూటీ మేయర్ పదవి(GVMC Deputy Mayor)కి జనసేన పార్టీకి చెందిన కార్పొరేటర్ దల్లి గోవింద్ రెడ్డి (Dalli Govind Reddy) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మంగళవారం నిర్వహించిన గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ (జీవీఎంసీ) సమావేశంలో 59 మంది సభ్యుల సమ్మతి తో ఆయనను డిప్యూటీ మేయర్‌గా ప్రకటించారు. గోవింద్ రెడ్డి జీవీఎంసీ 64వ డివిజన్‌కు చెందిన జనసేన కార్పొరేటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఎన్నికల అధికారి ఆయన ఎంపికను అధికారికంగా ప్రకటించారు.
Charminar Fire Accident : అగ్ని ప్రమాద ఘటనపై సమగ్ర విచారణకు కమిటీ ఏర్పాటు
వాస్తవానికి నిన్న సోమవారం జరగాల్సిన డిప్యూటీ మేయర్ ఎన్నిక, కోరం లేకపోవడంతో వాయిదా పడిన సంగతి తెలిసిందే. మొత్తం 56 మంది కార్పొరేటర్లు అవసరం ఉన్న సమయంలో కేవలం 54 మంది మాత్రమే హాజరుకావడంతో ఎన్నికను అధికారులు మంగళవారానికి మార్చారు. ఈ సభకు గైర్హాజరైన 20 మంది సభ్యుల్లో ఎమ్మెల్యేలు, ఇతర కార్పొరేటర్లు ఉండటం, వారు ఎందుకు హాజరుకాలేదన్న విషయంపై అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి. సమన్వయం లోపమా? లేక అంతర్గత అసంతృప్తియే కారణమా? అనే చర్చలు కొనసాగుతున్నాయి.
మునుపటి జీవీఎంసీ ఎన్నికల్లో మేయర్, డిప్యూటీ మేయర్ పదవులను వైసీపీ గెలుచుకుంది. అయితే ఆ తర్వాత కూటమిలోని పార్టీల ప్రతిపాదనలతో మేయర్‌పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడంతో టీడీపీ మేయర్ పదవిని పొందింది. అదే తరహాలో డిప్యూటీ మేయర్‌పై కూడా అవిశ్వాసం తీసుకొచ్చి, ఆ పదవిని జనసేనకు కేటాయించారు. అయితే ఈ కేటాయింపుపై టీడీపీలోని కొంతమంది అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం. కానీ అన్ని విభేదాలను అధిగమించి గోవింద్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నిక కావడం విశాఖ రాజకీయాల్లో కొత్త దశను సూచిస్తోంది.