నంద్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం , నలుగురు మృతి
ఆళ్లగడ్డ మండలం నల్లగట్ల గ్రామ సమీపంలో అత్యంత విషాదకరమైన రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అతివేగం తో కార్ డివైడర్‌ను దాటుకుంటూ వెళ్లి ఎదురుగా వస్తున్న సీజీఆర్ (CGR) ట్రావెల్స్ బస్సును బలంగా ఢీకొట్టింది.
- Author : Sudheer
Date : 26-12-2025 - 9:50 IST
Published By : Hashtagu Telugu Desk
- ఆళ్లగడ్డ మండలం నల్లగట్ల గ్రామ సమీపంలో ఘోర ప్రమాదం
- అతివేగంతో సీజీఆర్ (CGR) ట్రావెల్స్ బస్సును ఢీ కొట్టిన కార్
- అక్కడిక్కడే నలుగురు మృతి
ప్రతి రోజు ఎక్కడొక్కడ రోడ్డు ప్రమాదం అనేది వార్త నిద్ర లేవగానే వినాల్సి వస్తుంది. నిన్న కర్ణాటక లో ఘోర రోడ్డు ప్రమాదం లో దాదాపు 21 మంది మరణించగా , నేడు నంద్యాల జిల్లాలో మరో ప్రమాదం చోటుచేసుకుంది. ఆళ్లగడ్డ మండలం నల్లగట్ల గ్రామ సమీపంలో అత్యంత విషాదకరమైన రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అతివేగం తో కార్ డివైడర్‌ను దాటుకుంటూ వెళ్లి ఎదురుగా వస్తున్న సీజీఆర్ (CGR) ట్రావెల్స్ బస్సును బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాద తీవ్రతకు కారు నుజ్జునుజ్జు అవ్వగా, అందులో ప్రయాణిస్తున్న నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మృతులంతా హైదరాబాద్‌కు చెందిన వారుగా గుర్తించారు. మరణించిన వారిలో గుండురావు (60), శ్రావణ్ (22), నరసింహ మరియు బన్నీ ఉన్నారు. మరో ఇద్దరు తీవ్ర గాయాలపాలవడంతో ఘటనాస్థలి రక్తసిక్తమై భీతావహంగా మారింది.

Nandyal District Road Accid
ప్రమాదం జరిగిన వెంటనే తోటి వాహనదారులు పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు మరియు స్థానికులు సహాయక చర్యలు చేపట్టి, కారులో చిక్కుకున్న క్షతగాత్రులను వెలికితీసి చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. డీఎస్పీ ప్రమోద్ కుమార్ ఘటనా స్థలాన్ని స్వయంగా పరిశీలించి, ప్రమాదం జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. అతివేగమే ఈ ప్రమాదానికి ప్రధాన కారణమని ప్రాథమికంగా భావిస్తున్నారు. ఈ ఘటనతో జాతీయ రహదారిపై కాసేపు ట్రాఫిక్ నిలిచిపోగా, పోలీసులు వాహనాలను క్రమబద్ధీకరించి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.
ఈ ఘోర ప్రమాదంపై రాష్ట్ర మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేసిన ఆయన, జిల్లా యంత్రాంగాన్ని వెంటనే అప్రమత్తం చేశారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. తరచూ ఇలాంటి రోడ్డు ప్రమాదాలు జరిగి ప్రాణాలు గాలిలో కలిసిపోవడం అత్యంత బాధాకరమని ఆవేదన వ్యక్తం చేసిన మంత్రి, వాహనదారులు రోడ్లపై ప్రయాణించేటప్పుడు అత్యంత అప్రమత్తంగా ఉండాలని, వేగ నియంత్రణ పాటించాలని సూచించారు.