CBN: సంవిధాన్ హత్యా దినం – ఎమర్జెన్సీని గుర్తు చేసిన చంద్రబాబు, జగన్ పాలనపై ఘాటు విమర్శలు
అలా జరగకూడదన్న బోధనకు అది ఒక పెద్ద కేస్ స్టడీ,’’ అని అన్నారు. అప్పట్లో అలహాబాద్ హైకోర్టు ఇందిరాగాంధీ ఎన్నికను చెల్లదని చెప్పిన నేపథ్యంలో ఎమర్జెన్సీ విధించారని గుర్తు చేశారు.
- By Hashtag U Published Date - 10:42 PM, Wed - 25 June 25

అమరావతి: జూన్ 25 – (Constitution Assassination Day) భారత ప్రజాస్వామ్య చరిత్రలో చీకటి రోజుగా గుర్తింపు పొందిన ఈ తేదీకి అర్థవంతంగా, ఆ రోజును “సంవిధాన్ హత్యా దినం”గా గుర్తు చేస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన విమర్శలతో మరోసారి ప్రజల ముందుకొచ్చారు. అమరావతిలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, 1975లో అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ విధించిన ఎమర్జెన్సీపై, మరియు ఇటీవల జరిగిన రాజకీయ పరిణామాలపై స్పష్టమైన వ్యాఖ్యలు చేశారు.
చంద్రబాబు వ్యాఖ్యానిస్తూ, ‘‘ఎమర్జెన్సీ విధించి ప్రజల ఆధికారాలను కాలరాశారు. అది ప్రజాస్వామ్యాన్ని కుదిపేసిన సంఘటన. అలా జరగకూడదన్న బోధనకు అది ఒక పెద్ద కేస్ స్టడీ,’’ అని అన్నారు. అప్పట్లో అలహాబాద్ హైకోర్టు ఇందిరాగాంధీ ఎన్నికను చెల్లదని చెప్పిన నేపథ్యంలో ఎమర్జెన్సీ విధించారని గుర్తు చేశారు.
ఆ సమయంలో జరిగిన అరాచకాలు, హింసాచారాలు దేశ ప్రజల మనసుల్లో మచ్చలుగా మిగిలిపోయాయని వ్యాఖ్యానించిన సీఎం, ‘‘పాలన ఎలా ఉండకూడదో తెలుసుకోవాలంటే ఎమర్జెన్సీని చదవాలి. పాలకుల తీరూ ఎలా ఉండకూడదో చూడాలంటే జగన్ ప్రభుత్వాన్ని చూడాలి,’’ అంటూ తీవ్ర విమర్శలు గుప్పించారు.
ఏపీని కాపాడేందుకు తాను పవన్ కల్యాణ్, నరేంద్ర మోదీలతో కలిసి కూటమిగా ఏర్పడి పోరాటం చేశామని వివరించారు. ‘‘విధ్వంసం నుంచి పునర్నిర్మాణ దిశగా తీసిన మొదటి అడుగు – మోదీ సహకారంతో ప్రారంభమైంది,’’ అని పేర్కొన్నారు.
ఓటు హక్కు గురించి మాట్లాడుతూ, ‘‘ప్రజాస్వామ్య పరిరక్షణకు అంబేడ్కర్ ఇచ్చిన గొప్ప ఆయుధం ఓటు. ఆ హక్కును విలువైనదిగా భావించి వినియోగించాలి. మంచి నాయకులను ఎన్నుకోవాలంటే ఐదు తరాల భవిష్యత్‌దాకా ఆలోచించాలి,’’ అని సూచించారు.
చరిత్ర చెడు పని చేసిన వారిని క్షమించదని, ఎమర్జెన్సీ సమయంలో జరిగిన ఘటనలు అందుకు ఉదాహరణ అని అన్నారు. ప్రజాస్వామ్య విలువలను పరిరక్షించడంలో ప్రతి పౌరుడికి బాధ్యత ఉందని చంద్రబాబు స్పష్టం చేశారు. ‘‘ఎన్టీఆర్‌ను తొలగించిన తర్వాత ప్రజలే తిరిగి గద్దెనెక్కించారని, అదే ప్రజాస్వామ్య విజయానికి ఉదాహరణ’’ అన్నారు.
ఈ సందర్భంగా ప్రధాని మోదీ ప్రవేశపెట్టిన “సంవిధాన్ హత్యా దినం” కార్యక్రమం ప్రజల్లో చైతన్యం కలిగించే దిశగా సాగుతుందన్నారు. ప్రజలు మంచి-చెడుల మధ్య తేడా తెలుసుకోవాలని, చీకటి రోజులను మరచిపోకూడదని హెచ్చరించారు.