NTR District : నేడు ఎన్టీఆర్ జిల్లాలోని అన్ని విద్యాసంస్థలకు సెలవు ప్రకటించిన కలెక్టర్
మిచాంగ్ తుపాను దృష్ట్యా ఎన్టీఆర్ జిల్లాలోని అన్ని విద్యాసంస్థలకు సెలవులు ప్రకటిస్తూ జిల్లా కలెక్టర్ ఢిల్లీ రావు ఉత్తర్వులు జారీ
- Author : Prasad
Date : 06-12-2023 - 8:07 IST
Published By : Hashtagu Telugu Desk
మిచాంగ్ తుపాను దృష్ట్యా ఎన్టీఆర్ జిల్లాలోని అన్ని విద్యాసంస్థలకు సెలవులు ప్రకటిస్తూ జిల్లా కలెక్టర్ ఢిల్లీ రావు ఉత్తర్వులు జారీ చేశారు. నేడు (డిసెంబర్ 6న) జిల్లాలోని అన్ని ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలకు సెలవు ఇవ్వాలని ఆయన తెలిపారు. తుపాను కారణంగా జిల్లాలోని పలు ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు, ఈదురు గాలులు వీస్తున్నాయని తెలిపారు. ఈ నేపథ్యంలో బుధవారం విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. జిల్లాలో కురుస్తున్న వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడడం, భవనాలు కూలడం వంటి ప్రమాదాల నుంచి ప్రజలు సురక్షితంగా ఉండేందుకు జిల్లాలోని కొండ ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించాలని, సమీపంలోని నివాసితులను అప్రమత్తం చేయాలని అధికారులను ఆదేశించారు. హాస్టల్స్‌లో ఉండే విద్యార్థులు బయటికి రావొద్దని ఆయన సూచించారు. భారీ వర్షాల నేపథ్యంలో రోడ్లపైకి ఎవరూ రావోద్దని కోరారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షితప్రాంతాలకు తరలివెళ్లాలని కోరారు. ఎలాంటి సమస్యలు ఉన్నా స్థానిక అధికారులకు సమాచారం ఇవ్వాలని తెలిపారు.