YCP : అసెంబ్లీకి రమ్మంటే రప్పా రప్పా అంటారేంటి -వైసీపీ పై బాబు సెటైర్లు
YCP : ‘రాజకీయాల్లో ఓనమాలు తెలియని వారు ప్రతిపక్ష హోదా కావాలని అడుగుతున్నారు’ అంటూ వారిపై విమర్శనాస్త్రాలు సంధించారు
- By Sudheer Published Date - 08:28 PM, Wed - 10 September 25

రాయలసీమకు చంద్రబాబు (Chandrababu) ఇచ్చిన హామీలు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. అసెంబ్లీకి రాకుండా సోషల్ మీడియా ఆఫీసులు తెరిచారని వైసీపీ నేతలను (YCP Leaders ) ఉద్దేశించి చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీశాయి. ‘రాజకీయాల్లో ఓనమాలు తెలియని వారు ప్రతిపక్ష హోదా కావాలని అడుగుతున్నారు’ అంటూ వారిపై విమర్శనాస్త్రాలు సంధించారు. అసెంబ్లీకి రాకుండా ‘రప్పా రప్పా’ అని రంకెలేస్తే చూస్తూ ఊరుకోమని, తమ పాలనలో ‘రప్పా రప్పా’ అనే వారికి తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. పులివెందుల, ఒంటిమిట్ట ఉపఎన్నికల్లో ప్రజలే వైసీపీకి ‘బెండు తీశారు’ అని వ్యంగ్యంగా పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య రాజకీయ దూషణలు ఏ స్థాయిలో ఉన్నాయో తెలియజేస్తున్నాయి.
ICC Rankings: ఐసీసీ ర్యాంకింగ్స్‌లో పాక్ క్రికెటర్ల హవా
అదే సమయంలో చంద్రబాబు రాయలసీమకు ఇచ్చిన హామీలు కూడా చర్చనీయాంశమయ్యాయి. అనంతపురంలో ఆయన మాట్లాడుతూ, ఈ ఏడాది వర్షపాతం తక్కువగా ఉన్నప్పటికీ అన్ని చెరువులకు నీళ్లు వచ్చాయని తెలిపారు. రాయలసీమకు జీవం పోసింది టీడీపీ ప్రభుత్వమేనని ఆయన చెప్పుకొచ్చారు. హంద్రీనీవా, గాలేరు నగరి, తెలుగు గంగ ప్రాజెక్టులు టీడీపీ హయాంలోనే వచ్చాయని గుర్తు చేశారు. డ్రిప్ ఇరిగేషన్, ప్రాజెక్టులతో రాయలసీమను అభివృద్ధి చేశామని, కియా కార్ల పరిశ్రమను తీసుకువచ్చామని వివరించారు. ఈ ప్రాంతానికి కరవును శాశ్వతంగా దూరం చేస్తానని హామీ ఇచ్చారు, ఇది కేవలం మాట మాత్రమే కాదని, తన పంతమని అన్నారు.
చంద్రబాబు చేసిన ఈ రెండు రకాల వ్యాఖ్యలు – ఒకవైపు రాజకీయ విమర్శలు, మరోవైపు అభివృద్ధి హామీలు – ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో అధికార కూటమి వ్యూహాన్ని సూచిస్తున్నాయి. ప్రతిపక్షంపై పదునైన విమర్శలు చేస్తూనే, పాలనాపరమైన విజయాలు, భవిష్యత్ ప్రణాళికలను ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఒకవైపు ప్రజల్లో తమ పట్ల విశ్వాసం పెంచుకోవడానికి, మరోవైపు ప్రతిపక్షాన్ని బలహీనపరిచేందుకు ఉపయోగపడుతోంది. ముఖ్యమంత్రిగా తన పాలనా సామర్థ్యాన్ని నిరూపించుకోవడానికి, ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి ఈ వ్యూహం ఎంతవరకు పని చేస్తుందో రాబోయే రోజుల్లో తేలనుంది.