MLC By Poll : ఏపీలో రెండు ఎమ్మెల్సీ స్థానాలకు బైపోల్.. జులై 12న పోలింగ్
ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో ఖాళీగా ఉన్న రెండు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాల బైపోల్‌కు రంగం సిద్ధమైంది.
- By Pasha Published Date - 02:44 PM, Tue - 18 June 24

MLC By Poll : ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో ఖాళీగా ఉన్న రెండు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాల బైపోల్‌కు రంగం సిద్ధమైంది. దీనికి సంబంధించిన ఉప ఎన్నిక షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం మంగళవారం విడుదల చేసింది. సి.రామచంద్రయ్య, షేక్ మహ్మద్ ఇక్బాల్‌పై శాసన మండలి ఛైర్మన్ కొయ్యే మోషేన్‌రాజు అనర్హత వేటు వేయడంతో ఈ ఉప ఎన్నిక వచ్చింది. ఈ ఉప ఎన్నికకు సంబంధించిన నోటిఫికేషన్ ఈ నెల 25న విడుదల కానుంది. నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ జులై 2. నామినేషన్ల ఉపసంహరణకు జులై 5 వరకు గడువు ఉంది.జులై 12న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తారు. అదే రోజు సాయంత్రంకల్లా ఎన్నికల ఫలితాలను విడుదల చేస్తారు.
We’re now on WhatsApp. Click to Join
కర్ణాటక (జగదీష్ శెట్టర్-రాజీనామా), బిహార్(రామ్‌బాలి సింగ్-అనర్హత వేటు), ఉత్తరప్రదేశ్(స్వామి ప్రసాద్ మౌర్య-రాజీనామా)లలోని మూడు ఎమ్మెల్సీ స్థానాలకు కూడా జులై 12న ఉప ఎన్నిక జరగనుంది. ఈమేరకు కేంద్ర ఎన్నికల సంఘం మంగళవారం షెడ్యూల్ విడుదల చేసింది. ఈనెల 25వ తేదీన ఉప ఎన్నిక నోటిఫికేషన్ (MLC By Poll) విడుదల చేస్తామని వెల్లడించింది.
Also Read :NEET – Supreme Court : చిన్న నిర్లక్ష్యమున్నా సరిదిద్దాల్సిందే.. ఎన్టీఏకు సుప్రీంకోర్టు మొట్టికాయలు
ప్రస్తుతం ఏపీ శాసన మండలిలో వైఎస్సార్ సీపీ స్ట్రాంగ్‌గానే ఉంది. శాసనమండలిలోని మొత్తం 58 స్థానాల్లో42 ఇంకా వైఎస్సార్ సీపీ దగ్గరే ఉన్నాయి. టీడీపీకి ఎనిమిది మంది ఎమ్మెల్సీలు మాత్రమే ఉన్నారు. ఇప్పుడు టీడీపీ అధికార పీఠంపై ఉండటంతో.. ఈ రెండు స్థానాలు ఆ పార్టీకే దక్కే అవకాశం ఉంది. గత ఎన్నికల సమయంలో అనేక మంది పొత్తుల్లో భాగంగా తమ సీట్లను త్యాగం చేశారు. దీంతో వారంతా ఇప్పుడు టీడీపీ తరఫున ఎమ్మెల్సీ అభ్యర్థిత్వం కోసం పోటీ పడే అవకాశముంది. వీరిలో పవన్ కల్యాణ్ కోసం పిఠాపురం సీటు త్యాగం చేసిన వర్మ ముందు వరుసలో ఉన్నట్లు తెలుస్తోంది. టీడీపీ, జనసేన ఉమ్మడి ఖాతాలో ఆయనకు ఎమ్మెల్సీగా అవకాశం దక్కే ఛాన్స్ ఉందని అంటున్నారు.