Maddelacheruvu Suri Murder Case: సూరి హత్యా కేసులో 12 ఏళ్ళ తర్వాత జైలు నుండి భాను కిరణ్ విడుదల!
మద్దెల చెరువు సూరి హత్య కేసులో ప్రధాన నిందితుడు భాను కిరణ్ 12 సంవత్సరాలు జైలులో ఉన్న తర్వాత, నాంపల్లి కోర్టు అతడికి బెయిల్ మంజూరు చేయడంతో బుధవారం చంచల్‌గూడ జైలు నుంచి విడుదల అయ్యాడు.
- By Kode Mohan Sai Published Date - 03:47 PM, Wed - 6 November 24

Maddelacheruvu Suri Murder Case: మద్దెలచెరువు సూరి హత్య కేసులో ప్రధాన నిందితుడు భాను కిరణ్ చంచల్‌గూడా జైలు నుంచి విడుదలయ్యాడు. దాదాపు 12 ఏళ్లపాటు జైలు జీవితం గడించిన భాను కిరణ్‌కు, సూరి హత్య కేసులో న్యాయస్థానం ఇటీవల బెయిల్ మంజూరు చేసింది. ఈ నేపథ్యంలో, కాసేపటి క్రితం ఆయన జైలు నుంచి విడుదలయ్యారు.
మద్దెలచెరువు సూరి హత్య కేసులో నిందితుడు భాను కిరణ్‌కు బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. సీఐడీ ఆమ్స్ ఆక్ట్ కేసులో నాంపల్లి కోర్టు అతనికి బెయిల్ ఇచ్చింది. సూరి హత్య కేసులో న్యాయస్థానం భానుకిరణ్‌కు జీవిత ఖైదు విధించగా, గత 12 ఏళ్లుగా ఆయన చంచల్‌గూడా జైలులో ఉన్నారు. ఈ సమయంలో, తనకు బెయిల్ మంజూరి చేయాలని భాను కిరణ్ సుప్రీం కోర్టు మరియు హైకోర్టును ఆశ్రయించారు. అయితే, సుప్రీం కోర్టు ఈ విషయాన్ని స్థానిక కోర్టుకు అప్పగించి, బెయిల్ అంశంపై అక్కడే తేల్చుకోవాలని సూచించింది. ఈ నెల 11న భాను కిరణ్ యొక్క జీవిత ఖైదు కేసు కూడా విచారణకు రానుంది.
2011 సంవత్సరంలో మద్దెలచెరువు సూరి హత్య కేసులో భాను కిరణ్ ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. 2018 డిసెంబర్‌లో నాంపల్లి కోర్టు అతనికి శిక్ష ఖరారు చేసింది. 2011 జనవరి 4న మద్దెలచెరువు సూరిని భాను కిరణ్ హత్య చేశాడు. ఈ ఘటన అప్పట్లో పెద్ద సంచలనంగా మారింది. సూరి, దివంగత నేత టీడీపీ ఎమ్మెల్యే పరిటాల రవి హత్య కేసులో నిందితుడిగా ఉన్నాడు. జనవరి 4న హైదరాబాద్ సనత్‌నగర్ నవోదయ కాలనీలో సూరిని భాను కిరణ్ కాల్చిచంపాడు.
పరిటాల రవి హత్య కేసులో మద్దెల చెరువు సూరి ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. 2005లో తన కుటుంబాన్ని నాశనం చేసాడు అనే కోపంతో పరిటాల రవిని సూరి కాల్చి చంపాడు. ఆ తర్వాత పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. పరిటాల రవిని హత్య చేసిన కేసులో జైలు జీవితం గడిపి, తరువాత బెయిల్ మీద బయటకు వచ్చిన సూరి, 2011 జనవరి 4న భాను కిరణ్ చేతిలో కాల్చి చంపబడినాడు. ఈ కేసు నాంపల్లి కోర్టులో విచారణకు వచ్చి, 2018లో భాను కిరణ్‌కు జీవిత ఖైదు విధించింది. అప్పటి నుంచి భాను కిరణ్ చంచల్‌గూడ జైలులో ఉన్నాడు. ఇటీవల, భాను కిరణ్ తనకు బెయిల్ మంజూరి కోసం నాంపల్లి కోర్టును ఆశ్రయించగా, సీఐడీ ఆర్మ్స్ యాక్ట్ కేసులో కోర్టు అతనికి బెయిల్ మంజూరు చేసింది.