Kovur : వైసీపీ మాజీ ఎమ్మెల్యే ఇంటిపై దాడి
Kovur : సుజాతమ్మ కాలనీలోని ఆయన ఇంటిపై దాడి చేసి మారణాయుధాలతో దుండగులు కార్లు, ఫర్నీచర్, విలువైన వస్తువులను ధ్వంసం చేశారు
- By Sudheer Published Date - 11:25 AM, Tue - 8 July 25

నెల్లూరు జిల్లాలో రాజకీయ ఉద్రిక్తత చోటుచేసుకుంది. కోవూరు మాజీ ఎమ్మెల్యే, వైసీపీ సీనియర్ నేత నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి (Nallapareddy Prasannakumar Reddy) నివాసంపై సోమవారం రాత్రి గుర్తు తెలియని దుండగులు దాడికి పాల్పడటం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. సుజాతమ్మ కాలనీలోని ఆయన ఇంటిపై దాడి చేసి మారణాయుధాలతో దుండగులు కార్లు, ఫర్నీచర్, విలువైన వస్తువులను ధ్వంసం చేశారు. సీసీ కెమెరాలను ముందే ధ్వంసం చేయడంతో వారు ఎవరో గుర్తించలేని పరిస్థితి ఏర్పడింది. ఈ దాడి సమయంలో ప్రసన్నకుమార్ ఇంట్లో లేకపోవడం ప్రాణాపాయాన్ని తప్పించినట్టు చెబుతున్నారు.
ఈ దాడికి సంబంధించిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. ఘటన జరిగిన సమయానికి ప్రసన్నకుమార్ రెడ్డి కోవూరులోని వైసీపీ సమావేశంలో పాల్గొని అక్కడే ఉన్నారు. అదే సమావేశంలో నాయుకులపై తీవ్రమైన విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యల నేపథ్యంలోనే ఈ దాడి జరిగిందని వైసీపీ వర్గాలు అనుమానిస్తున్నాయి. వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డిపై చేసిన విమర్శలతోనే ఈ హింసాత్మక చర్యలు వచ్చాయని భావిస్తున్నారు. ఇక వేమిరెడ్డి కుటుంబానికి ప్రసన్నకుమార్ బంధువేనన్న విషయం ఈ ఘటనను మరింత వివాదాస్పదంగా మార్చింది.
Heart Attack : ఆరోగ్యంగా ఉన్నప్పటికీ “ హార్ట్ ఎటాక్” ఎందుకు వస్తుంది?
ఈ ఘటనపై స్పందించిన ప్రసన్నకుమార్ రెడ్డి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. “నేను ఇంట్లో ఉంటే నన్ను చంపేసేవారు, నా తల్లిని బెదిరించారు” అని అన్నారు. ఇదంతా తనపై హత్యాయత్నంగా చూస్తున్నానని చెప్పారు. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందని, పోలీసులపై నమ్మకం లేదని ఆయన ఆరోపించారు. దీనిపై పవన్ కళ్యాణ్ లాంటి నాయకులు స్పందించాల్సిన అవసరం ఉందని అన్నారు. రాజకీయ విమర్శలు, ప్రతివిమర్శలు సహజమే కాని, ఇలాంటి దాడులకు పాల్పడటం తగదన్నారు.
ఇటు ప్రసన్నకుమార్ రెడ్డి తల్లి శ్రీలక్ష్మమ్మ కూడా ఈ ఘటనపై ఆందోళన వ్యక్తం చేశారు. “200 మంది దుండగులు ఒక్కసారిగా ఇంట్లోకి వచ్చారు. ‘నీ కుమారుడు ఎక్కడ?’ అంటూ నన్ను బెదిరించారు. ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్న నన్ను భయపెట్టారు. నా కుమారుడు ఇంట్లో ఉంటే చంపేసేవారు” అని విలపించారు. ఘటన స్థలాన్ని పరిశీలించిన పోలీసులు, సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా విచారణ చేపట్టారు. ప్రస్తుతం నెల్లూరు రాజకీయ వాతావరణం పూర్తిగా వేడెక్కగా, ఈ దాడి వెనుక ఉన్న అసలు కుట్ర ఏంటి? అనే చర్చ తీవ్ర స్థాయిలో సాగుతోంది.