Drugs On Dark Web : డ్రగ్స్ దందాను స్మగ్లర్లు కొత్త పుంతలు తొక్కిస్తున్నారు. డార్క్ వెబ్‌ను అడ్డాగా చేసుకొని సీక్రెట్‌గా డ్రగ్స్‌ను అమ్ముతూ భారీగా డబ్బులు ఆర్జిస్తున్నారు. ఈ తరహాలో తెలంగాణలోని ఖమ్మంకు చెందిన యువ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ఒకరు డ్రగ్స్‌ను ఆర్డర్ ఇచ్చి తెప్పించుకున్నాడు. అయితే పోలీసులు ఆ ఆర్డర్‌ను ట్రాక్ చేసి పట్టుకున్నారు. వివరాల్లోకి వెళితే..
We’re now on WhatsApp. Click to Join
ఖమ్మంకు చెందిన సదరు సాఫ్ట్‌వేర్ ఉద్యోగి కాలేజీ రోజులలోనే డ్రగ్స్‌కు అలవాటు అయ్యాడు. అంతకుముందు హైదరాబాద్‌లో సీక్రెట్‌గా డ్రగ్స్ కొని సేవించేవాడు. అయితే పోలీసుల నిఘాతో డ్రగ్స్ దొరకడం కష్టతరంగా మారింది. దీంతో అతడు జులై 31న డ్రగ్స్ కోసం ఇంటర్నెట్‌లో డార్క్ వెబ్‌ను సెర్చ్ చేశాడు. అందులో అతడికి ఒక చైనా పోర్టల్ కనిపించింది. అందులోకి వెళ్లి 3 గ్రాముల సింథటిక్ డ్రగ్స్ కోసం ఆర్డర్ ఇచ్చాడు. అయితే పేమెంట్ చేయడం ఇబ్బందికరంగా మారింది. చైనా కరెన్సీ తన వద్ద లేకపోవడంతో భారతీయ కరెన్సీనే క్రిప్టో కరెన్సీ రూపంలోకి మార్చాడు. అలా మార్చిన క్రిప్టో కరెన్సీతో జులై 31న డ్రగ్స్ కోసం ఆర్డర్ పెట్టాడు. దీంతో ఆగస్టు 8న పశ్చిమ బెంగాల్‌లోని సిలిగురి నుంచి స్పీడ్ పోస్టులో డ్రగ్స్ వచ్చాయి. అయితే డార్క్ వెబ్ ద్వారా తెలంగాణ నుంచి వెళ్లిన ఈ డ్రగ్స్ ఆర్డర్‌పై పోలీసులకు అప్పటికే అలర్ట్ వెళ్లింది. దీంతో వారు నిఘా ఉంచారు. బెంగాల్ నుంచి వచ్చిన డ్రగ్స్ స్పీడ్ పోస్టును సదరు యువ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ తీసుకుంటుండగా పోలీసులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఆ యువకుడికి తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సెలింగ్ ఇచ్చారు.మత్తు అలవాటు నుంచి బయటపడటానికి తాము సహాయ సహకారాలు అందిస్తామని చెప్పారు.
Also Read :Water Poisoning: వాటర్ పాయిజనింగ్ అంటే ఏమిటి..? దాని లక్షణాలివే..?
సదరు యువకుడు ఇప్పటికే నాలుగుసార్లు డార్క్ వెబ్(Drugs On Dark Web) ద్వారా ఎల్‌ఎస్‌డీ, హెరాయిన్‌ను తెప్పించుకొని వాడాడని టీజీ న్యాబ్ అధికార వర్గాలు తెలిపాయి. డార్క్‌వెబ్ ద్వారా డ్రగ్స్‌కు ఆర్డర్స్ పెడుతున్న వారిపై తమ నిఘా ఉంటుందని వారు వెల్లడించారు. డార్క్ వెబ్‌లోని సదరు వెబ్‌సైటుకు తెలంగాణ నుంచి ఇంకా ఎంతమంది డ్రగ్స్ ఆర్డర్లు ఇచ్చారు అనేది తెలుసుకోవడంపై ఫోకస్ చేసినట్లు వెల్లడించారు. ఆర్డర్స్ తీసుకొని బెంగాల్ నుంచి డ్రగ్స్ సప్లై చేస్తున్న ముఠా సమాచారాన్ని కూడా సేకరిస్తామని తెలిపారు. ప్రత్యేకించి తల్లిదండ్రులు తమ పిల్లల కదలికలపై కాస్త నిఘా పెట్టడం ద్వారా వారి అలవాట్లపై ఒక అవగాహన రావచ్చని పోలీసులు సూచిస్తున్నారు. అవసరమైతే ఫోన్ నెంబర్ 8712671111 లేదా 1908 కాల్ చేయాలని టీజీ న్యాబ్ అధికారులు కోరుతున్నారు. అధికారిక ఈమెయిల్ పోర్టల్ tsnabho-hyd@tspolice.gov.in ద్వారా కూడా సమాచారం ఇవ్వొచ్చని తెలిపారు.