FIFA World Cup 2026: ఫిఫా వరల్డ్ కప్ 2026 ప్రారంభానికి మరికొద్ది రోజులే సమయం ఉన్న వేళ ఫుట్‌బాల్ ప్రపంచంలో ఒక ఊహించని వివాదం రాజుకుంది. టోర్నీకి ఇప్పటికే అర్హత సాధించిన ఇరాన్ జట్టును తప్పించి, ఆ స్థానంలో నాలుగుసార్లు ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచిన ఇటలీని చేర్చాలంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సన్నిహితుడు, ప్రత్యేక ప్రతినిధి పాలో జాంపొల్లి చేసిన ప్రతిపాదన ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో చర్చకు దారితీసింది. ఫైనాన్షియల్ టైమ్స్ నివేదిక ప్రకారం.. ఈ ప్రతిపాదనను ఆయన నేరుగా ఫిఫా అధ్యక్షుడు జియాని ఇన్ఫాంటినో దృష్టికి తీసుకెళ్లారు. మధ్యప్రాచ్యంలో నెలకొన్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, ఇరాన్ ఆటగాళ్ల ప్రయాణ పరమైన ఇబ్బందులను సాకుగా చూపుతూ ఈ ప్రతిపాదన తెరపైకి రావడం గమనార్హం.
పాలో జాంపొల్లి స్వతహాగా ఇటలీ దేశస్థుడు కావడంతో తన మాతృదేశం వంటి గొప్ప ఫుట్‌బాల్ చరిత్ర ఉన్న జట్టు అమెరికా ఆతిథ్యమిస్తున్న మెగా టోర్నీలో ఉండాలని తాను బలంగా కోరుకుంటున్నట్లు బహిరంగంగానే ప్రకటించారు. వరుసగా మూడు ప్రపంచ కప్‌లకు అర్హత సాధించలేకపోయిన ఇటలీని ప్రత్యేక పరిస్థితుల కింద టోర్నీలోకి తీసుకోవడం వల్ల క్రీడకు, టోర్నీ ఆదాయానికి పెద్ద ఎత్తున ప్రయోజనం చేకూరుతుందని ఆయన వాదిస్తున్నారు. అయితే క్రీడా నిబంధనల ప్రకారం ఇది అత్యంత క్లిష్టమైన ప్రక్రియ. ఒక ఖండానికి చెందిన జట్టు (ఆసియా) అర్హత సాధించినప్పుడు ఆ స్థానాన్ని మరో ఖండానికి (యూరప్) చెందిన జట్టుకు కేటాయించడం ఫిఫా నిబంధనలకు విరుద్ధం అవుతుంది. ఒకవేళ ఇరాన్ వైదొలిగితే ఆసియా ఫుట్‌బాల్ కాన్ఫెడరేషన్ నుండి మరొక జట్టుకే ఆ అవకాశం దక్కాలని క్రీడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
Also Read: బెంగాల్ ఎన్నికల్లో ‘ఝల్‌మురి’ సెగ.. మోదీ వర్సెస్ దీదీ
మరోవైపు ఇరాన్ జట్టు ఇప్పటికే తమ సన్నద్ధతను ముమ్మరం చేసింది. అమెరికాలోని లాస్ ఏంజిల్స్, సీటెల్ నగరాల్లో జరగనున్న తమ గ్రూప్ మ్యాచ్‌ల కోసం ఆటగాళ్లు సిద్ధమవుతున్నారు. భద్రతా కారణాల దృష్ట్యా తమ మ్యాచ్‌లను మెక్సికోకు మార్చాలని ఇరాన్ గతంలో కోరినప్పటికీ షెడ్యూల్ మార్పుకు ఫిఫా సుముఖంగా లేదు. ఫిఫా అధ్యక్షుడు ఇన్ఫాంటినో కూడా ఇటీవల ఇరాన్ శిబిరాన్ని సందర్శించి, ఏర్పాట్లపై సంతృప్తి వ్యక్తం చేస్తూ ఆ జట్టు టోర్నీలో పాల్గొంటుందని స్పష్టం చేశారు.
జూన్ 11న ప్రారంభం కానున్న ఈ మెగా ఈవెంట్‌లో ఇరాన్ స్థానాన్ని మార్చడం అంటే అది కేవలం క్రీడాపరమైన నిర్ణయం మాత్రమే కాకుండా, పెద్ద రాజకీయ వివాదానికి దారితీసే అవకాశం ఉంది. ప్రస్తుతానికి అమెరికా ప్రతినిధి చేసిన ఈ ప్రతిపాదన ఒక విజ్ఞప్తి స్థాయిలోనే ఉన్నప్పటికీ అగ్రరాజ్యం ఒత్తిడి పెరిగితే ఫిఫా ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఇప్పుడు సర్వత్రా ఆసక్తి రేకెత్తిస్తోంది.
