Test Squad: భారత జట్టు వన్డేలు, టీ20ల్లో అదరగొడుతున్నప్పటికీ టెస్ట్ ఫార్మాట్‌లో మాత్రం ఆశించిన స్థాయిలో రాణించలేకపోతోంది. దీంతో టెస్ట్ జట్టును బలోపేతం చేసేందుకు బీసీసీఐ ఇప్పుడు దేశవాళీ క్రికెట్‌లో సత్తా చాటుతున్న కుర్రాళ్లపై కన్నేసింది. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ ముఖ్యంగా ముగ్గురు ఆటగాళ్లకు సుదీర్ఘకాలం పాటు అవకాశాలు ఇవ్వాలని యోచిస్తోంది.
దేవదత్ పడిక్కల్
టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం ప్రకారం.. దేవదత్ పడిక్కల్‌ను నంబర్ 3 పొజిషన్‌లో స్థిరంగా కొనసాగించాలని బీసీసీఐ భావిస్తోంది. దేశవాళీ క్రికెట్‌లో పడిక్కల్ వరుసగా పరుగులు సాధిస్తుండటం అతనికి కలిసొచ్చే అంశం. భవిష్యత్తులో అతను టీమ్ ఇండియాకు కీలక బ్యాటర్‌గా మారే అవకాశం ఉంది.
Also Read: సీఎస్కే బౌలర్ ఇంట విషాదం!
రుతురాజ్ గైక్వాడ్
సీఎస్కే కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్‌ను మిడిల్ ఆర్డర్‌లో పరీక్షించాలని మేనేజ్‌మెంట్ భావిస్తోంది. గైక్వాడ్ స్పిన్నర్లను ఎదుర్కోవడంలో సిద్ధహస్తుడు. కాబట్టి అతన్ని నంబర్ 5 స్థానంలో ఆడిస్తే బ్యాటింగ్ లైనప్ మరింత పటిష్టమవుతుందని బోర్డు భావిస్తోంది.
ధ్రువ్ జురెల్
వికెట్ కీపర్ బ్యాటర్ ధ్రువ్ జురెల్‌పై కూడా బీసీసీఐ ప్రత్యేక దృష్టి సారించింది. అతన్ని కేవలం వికెట్ కీపర్‌గానే కాకుండా స్పెషలిస్ట్ బ్యాటర్‌గా కూడా సుదీర్ఘకాలం పాటు జట్టులో కొనసాగించే ఆలోచనలో సెలక్టర్లు ఉన్నారు.
వీరికి తప్పని వేటు?
నంబర్ 3 స్థానంలో వరుస అవకాశాలు ఇచ్చినప్పటికీ సాయి సుదర్శన్ వాటిని అందిపుచ్చుకోవడంలో విఫలమయ్యాడు. దీంతో సెలక్షన్ కమిటీ అతన్ని పక్కన పెట్టే అవకాశం ఉంది. ఆల్ రౌండర్ కోటాలో అవకాశాలు పొందుతున్న తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డి బ్యాటింగ్‌లో తడబడుతున్నాడు. పైగా కెప్టెన్ గిల్ అతనితో బౌలింగ్ కూడా చేయించడం లేదు. దీంతో నితీష్‌కు టెస్ట్ జట్టులో చోటు దక్కడం కష్టంగా మారింది. ఈ మార్పులతో టీమ్ ఇండియా టెస్ట్ ఫార్మాట్‌లో తిరిగి పూర్వ వైభవం సాధిస్తుందని క్రికెట్ నిపుణులు భావిస్తున్నారు.
