ఆన్‌లైన్ గేమింగ్‌.. కేంద్రం కీల‌క నిర్ణ‌యం!

ఆన్‌లైన్ గేమింగ్‌లో పెరుగుతున్న సైబర్ మోసాలు, డేటా ప్రైవసీ ఉల్లంఘనలు, బెట్టింగ్ వంటి అంశాలను నియంత్రించడమే లక్ష్యంగా ఈ కొత్త వ్యవస్థను తీసుకువచ్చారు.

Published By: HashtagU Telugu Desk
Online Gaming

Online Gaming

Online Gaming: భారతదేశంలో వేగంగా విస్తరిస్తున్న ఆన్‌లైన్ గేమింగ్ రంగాన్ని క్రమబద్ధీకరించే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆన్‌లైన్ గేమింగ్ ప్రమోషన్ అండ్ రెగ్యులేషన్ యాక్ట్ 2025 కింద ఏర్పాటు చేసిన ఆన్‌లైన్ గేమింగ్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఓజీఏఐ) వచ్చే మే 1వ తేదీ నుండి పూర్తిస్థాయిలో తన విధులను ప్రారంభించనుంది. కేంద్ర ఎలక్ట్రానిక్స్- సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ పరిధిలో ఒక డిజిటల్ కార్యాలయంగా పనిచేసే ఈ సంస్థకు ఆ శాఖ అదనపు కార్యదర్శి నాయకత్వం వహిస్తారు. ఈ బోర్డులో హోం, ఆర్థిక, క్రీడలు, న్యాయ శాఖలకు చెందిన ఉన్నతాధికారులు సభ్యులుగా ఉండి సమన్వయం చేస్తారు.

దేశంలో అందుబాటులో ఉండే అన్ని రకాల ఆన్‌లైన్ గేమ్స్, ఈ-స్పోర్ట్స్ టైటిల్స్‌ను నమోదు చేయడం, వాటి నిర్వహణను పర్యవేక్షించడం ఈ అథారిటీ ప్రధాన బాధ్యత. ముఖ్యంగా గేమింగ్ కంపెనీలు వినియోగదారుల వ్యక్తిగత డేటాను ఏ విధంగా భద్రపరచాలి అనే అంశంపై ఓజీఏఐ కఠినమైన మార్గదర్శకాలను జారీ చేయనుంది. అయితే కేవలం వినోదం కోసం ఆడే, నగదు లావాదేవీలతో సంబంధం లేని గేమ్‌ల విషయంలో ప్రభుత్వం కొంత మినహాయింపునిచ్చింది. అటువంటి గేమ్ డెవలపర్లు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేయడం ద్వారా చిన్న తరహా డెవలపర్లకు ఊరటనిచ్చింది.

Also Read: ఇరాన్‌తో చర్చలకు ట్రంప్ సంకేతం.. ఆ రోజే రెండో ద‌ఫా చ‌ర్చలు?

ఆన్‌లైన్ గేమింగ్‌లో పెరుగుతున్న సైబర్ మోసాలు, డేటా ప్రైవసీ ఉల్లంఘనలు, బెట్టింగ్ వంటి అంశాలను నియంత్రించడమే లక్ష్యంగా ఈ కొత్త వ్యవస్థను తీసుకువచ్చారు. గతంలో గేమింగ్ రంగానికి సంబంధించి స్పష్టమైన నిబంధనలు లేకపోవడంతో అనేక సమస్యలు తలెత్తేవి. ఇప్పుడు ఈ అథారిటీ రాకతో దేశవ్యాప్తంగా ఒకే రకమైన చట్టాలు అమలులోకి రానున్నాయి. ఇది గేమింగ్ పరిశ్రమలో పారదర్శకతను పెంచడమే కాకుండా బాధ్యతాయుతమైన గేమింగ్ వాతావరణాన్ని నిర్మించడంలో కీలక పాత్ర పోషిస్తుందని ప్రభుత్వం భావిస్తోంది.

  Last Updated: 23 Apr 2026, 10:58 AM IST