చమురు సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి భారత్ మాస్టర్ ప్లాన్!

స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్ ప్రాంతంలో ఉద్రిక్తతలు గరిష్ట స్థాయికి చేరిన సమయంలో భారత్ ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.

Published By: HashtagU Telugu Desk
Russian Oil

Russian Oil India

Oil Supply: అమెరికా- ఇరాన్ మధ్య కొనసాగుతున్న యుద్ధ వాతావరణం, స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్ వద్ద నెలకొన్న ఉద్రిక్తతల వల్ల ప్రపంచవ్యాప్తంగా చమురు, గ్యాస్ సరఫరాపై ఆందోళనలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో చమురు కొరత ఏర్పడకుండా భారతదేశం ఒక తెలివైన నిర్ణ‌యం తీసుకుంది. రష్యన్ చమురును తీసుకువచ్చే ఓడలకు బీమా కల్పించే రష్యన్ కంపెనీల సంఖ్యను పెంచాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది. గతంలో 8 కంపెనీలకు మాత్రమే అనుమతి ఉండగా, ఇప్పుడు ఆ సంఖ్యను 11కి పెంచారు. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ షిప్పింగ్ ఈ నిర్ణయం తీసుకుంది.

ఈ కంపెనీలు ఓడలకు P&I అనే ప్రత్యేక రకమైన బీమాను అందిస్తాయి. అంతర్జాతీయ సముద్ర మార్గాల్లో ఓడలు ప్రయాణించడానికి ఈ బీమా అత్యంత కీలకం. నిజానికి రష్యాపై పాశ్చాత్య దేశాల ఆంక్షల కారణంగా ఐరోపాకు చెందిన పెద్ద బీమా కంపెనీలు రష్యన్ చమురును మోసే ఓడలకు బీమా ఇవ్వడం తగ్గించాయి. రష్యా నుండి పెద్ద మొత్తంలో చమురు కొనుగోలు చేస్తున్న భారత్‌కు ఇది పెద్ద సమస్యగా మారింది. ఇప్పుడు రష్యన్ బీమా కంపెనీలకే అనుమతి ఇవ్వడం ద్వారా భారత్ ఈ సమస్యకు పరిష్కారం కనుగొంది.

Also Read: మారుతున్న శాలరీ స్ట్రక్చర్.. ఎవరికి లాభం? ఎవరికి నష్టం?

ఏయే కంపెనీలకు అనుమతి లభించింది?

ప్రపంచ ప్రసిద్ధ రష్యన్ కంపెనీలైన గజ్‌ప్రోమ్ ఇన్సూరెన్స్, రోస్‌గోస్‌ట్రాఖ్‌ల‌కు ఫిబ్రవరి 2027 వరకు పని చేయడానికి అనుమతి లభించింది. అదేవిధంగా VSK, సోగాజ్, ఆల్ఫాస్ట్రాఖోవాని కంపెనీలకు 2030 వరకు అనుమతి ఇచ్చారు. దీన్ని బట్టి భారత్ కేవలం ప్రస్తుత అవసరాల కోసమే కాకుండా రాబోయే ఐదారు ఏళ్ల భవిష్యత్తు కోసం ముందస్తు ప్రణాళికతో ఉన్నట్లు స్పష్టమవుతోంది. వీటితో పాటు దుబాయ్‌కు చెందిన ఇస్లామిక్ ప్రొటెక్షన్ అండ్ ఇండెమ్నిటీ క్లబ్ కంపెనీకి కూడా ఫిబ్రవరి 2027 వరకు సేవలు అందించడానికి అనుమతి ఇచ్చారు. దీనివల్ల ఒకే కంపెనీపై ఆధారపడాల్సిన అవసరం ఉండదు.

స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్ వద్ద ఉద్రిక్తత

స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్ ప్రాంతంలో ఉద్రిక్తతలు గరిష్ట స్థాయికి చేరిన సమయంలో భారత్ ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. ప్రపంచ చమురు రవాణాలో ఈ మార్గం అత్యంత కీలకమైనది. ఇక్కడ ఏదైనా అడ్డంకి ఏర్పడితే భారత్ వంటి దేశాలపై నేరుగా ప్రభావం పడుతుంది. ప్రపంచంలోనే చమురును దిగుమతి చేసుకునే మూడవ అతిపెద్ద దేశమైన భారత్.. ఇటీవలి కాలంలో రష్యా నుండి తక్కువ ధరకే చమురు కొనుగోలును పెంచింది. ఈ క్రమంలో చమురు రవాణాకు ఎలాంటి ఆటంకం కలగకుండా చూసుకోవడం భారత్‌కు చాలా అవసరం. భారత్ తీసుకున్న ఈ నిర్ణయం ఒక ‘రక్షణ కవచం’లా పనిచేస్తుంది. దీనివల్ల దేశ ఇంధన అవసరాలకు ఎలాంటి అంతరాయం కలగదు.

  Last Updated: 21 Apr 2026, 11:32 AM IST