నేపాల్ వెళ్తున్నారా? జాగ్రత్త! రూ. 63 దాటితే చాలు ట్యాక్స్ కట్టాల్సిందే!

సరిహద్దుల్లో కఠిన తనిఖీల కారణంగా బీర్‌గంజ్ బోర్డర్ వద్ద భారీ క్యూలు కనిపిస్తున్నాయి. నిత్యావసరాల కోసం భారత్‌కు వచ్చి వెళ్లే నేపాలీలు, వ్యాపారులు గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తోంది.

Published By: HashtagU Telugu Desk
Nepal Customs Rule

Nepal Customs Rule

Nepal Customs Rule: భారత్ నుండి నేపాల్‌కు వెళ్లే పర్యాటకులకు, సరిహద్దు ప్రాంత నివాసితులకు నేపాల్ ప్రభుత్వం ఊహించని షాక్ ఇచ్చింది. భారత్ నుండి నేపాల్‌లోకి తీసుకెళ్లే వస్తువులపై కస్టమ్స్ డ్యూటీ నిబంధనలను అక్కడి ప్రభుత్వం అత్యంత కఠినతరం చేసింది. దీని ప్రకారం.. ఎవరైనా భారత్ నుండి కేవలం 100 నేపాలీ రూపాయల (సుమారు 63 భారతీయ రూపాయలు) కంటే ఎక్కువ విలువైన వస్తువులను నేపాల్‌లోకి తీసుకెళ్తే తప్పనిసరిగా పన్ను చెల్లించాల్సి ఉంటుంది.

బీర్‌గంజ్ సరిహద్దులో నిరసనల హోరు

ఈ నిబంధనపై నేపాల్‌లోని బీర్‌గంజ్ నగరంలో భారీ ఎత్తున నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. 100 రూపాయల పరిమితి అనేది చాలా తక్కువని, కనీసం కిలో పంచదార లేదా నిత్యావసర సరుకులు తెచ్చుకున్నా పన్ను కట్టాల్సి వస్తోందని స్థానికులు మండిపడుతున్నారు. నిరసనకారులు ఈ నిర్ణయాన్ని ‘అప్రకటిత దిగ్బంధనం’గా అభివర్ణిస్తున్నారు. భారత సరిహద్దు ప్రాంతాల్లో నివసించే ప్రజలు తమ దైనందిన అవసరాల కోసం, వ్యవసాయ ఎరువుల కోసం భారతీయ మార్కెట్లపైనే ఆధారపడతారు. ఇప్పుడు ఈ కఠిన నిబంధనల వల్ల సాధారణ ప్రజల జీవితం భారంగా మారింది.

Also Read: ఐసీయూలో మాజీ క్రికెటర్.. ప్రాణాంతక వ్యాధితో పోరాటం!

ప్రభుత్వం వాదన ఏంటి?

అయితే నేపాల్ ప్రభుత్వం, సాయుధ పోలీసు బలగం అధికారులు మాత్రం ఇది కొత్త చట్టం కాదని, పాత నిబంధనలనే ఇప్పుడు కఠినంగా అమలు చేస్తున్నామని చెబుతున్నారు. పన్ను చెల్లించకుండా భారీగా వస్తువులను నేపాల్‌లోకి తరలించడం వల్ల ప్రభుత్వానికి భారీగా ఆదాయ గండి పడుతోందని వారు వాదిస్తున్నారు. సరిహద్దుల్లో స్మగ్లింగ్, అనధికారిక వ్యాపారాన్ని అరికట్టేందుకు ‘జీరో టాలరెన్స్’ విధానాన్ని అనుసరిస్తున్నట్లు స్పష్టం చేశారు.

సామాన్యుడిపై ప్రభావం

సరిహద్దుల్లో కఠిన తనిఖీల కారణంగా బీర్‌గంజ్ బోర్డర్ వద్ద భారీ క్యూలు కనిపిస్తున్నాయి. నిత్యావసరాల కోసం భారత్‌కు వచ్చి వెళ్లే నేపాలీలు, వ్యాపారులు గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తోంది. తరతరాలుగా కొనసాగుతున్న సరిహద్దు వాణిజ్యంపై ఈ నిర్ణయం తీవ్ర ప్రభావం చూపుతోందని ఆందోళన వ్యక్తమవుతోంది.

  Last Updated: 21 Apr 2026, 02:17 PM IST