Operation Sindoor: గతేడాది భారత వైమానిక దళం చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’ పాకిస్థాన్ సైనిక స్థావరాలకు కలిగించిన గాయాలు నేటికీ పచ్చిగానే ఉన్నాయి. తాజా శాటిలైట్ చిత్రాల ద్వారా పాకిస్థాన్ తన భోలారి ఎయిర్‌బేస్‌లో జరిగిన నష్టాన్ని పూడ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లు వెల్లడైంది. మే 10, 2025న భారత వైమానిక దళం జరిపిన ఖచ్చితమైన దాడిలో ఇక్కడి ప్రధాన హ్యాంగర్ పూర్తిగా ధ్వంసమైంది. ఇరు దేశాల మధ్య 88 గంటల పాటు కొనసాగిన ఉద్రిక్తతలు గరిష్ట స్థాయికి చేరుకున్న సమయంలో ఈ దాడి జరిగింది.
పాక్ గుట్టు రట్టు చేసిన శాటిలైట్ చిత్రాలు
తాజా శాటిలైట్ చిత్రాలను పరిశీలిస్తే భారత్ లక్ష్యంగా చేసుకున్న భోలారి ఎయిర్‌బేస్‌లోని అదే హ్యాంగర్‌పై ప్రస్తుతం మరమ్మతు పనులు జరుగుతున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. హ్యాంగర్ పచ్చని పైకప్పు ఉన్న పెద్ద భాగాన్ని తొలగించారు. దెబ్బతిన్న నిర్మాణ భాగాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. దాడి జరిగిన సమయంలో ఈ హ్యాంగర్‌లో పాకిస్థాన్‌కు చెందిన అత్యంత కీలకమైన ‘సాబ్ 2000 ఎరీఐ’ నిఘా విమానం ఉన్నట్లు భారత వైమానిక దళ నిపుణులు భావిస్తున్నారు. ఇప్పుడు పాకిస్థాన్ శిథిలాలను తొలగించి పైకప్పును కొత్తగా నిర్మించి నిర్మాణాన్ని బలోపేతం చేసే పనిలో నిమగ్నమైంది.
Also Read: జగన్ తో TVK విజయ్..ఫ్యాన్స్ లో ఆసక్తి
భోలారి ఎయిర్‌బేస్ విధ్వంసం
మే 10, 2025 ఉదయం 10 నుండి 12 గంటల మధ్య భారత వైమానిక దళం భోలారిలోని ఈ స్థావరంపై భీకర దాడి చేసింది. వాయుసేన అధికారికంగా వాడిన ఆయుధాల పేర్లను వెల్లడించనప్పటికీ ‘ఆపరేషన్ సిందూర్’లో అనేక ఆధునిక ఎయిర్-టు-సర్ఫేస్ మిసైళ్లను ఉపయోగించినట్లు సమాచారం. ఈ దాడి పాకిస్థాన్ వ్యూహాత్మక రాడార్ వ్యవస్థలు, నిఘా విమానాలకు భారీ నష్టాన్ని కలిగించింది. ఇప్పుడు ఆ శిథిలాలను బాగు చేయడం ద్వారా పాకిస్థాన్ తన వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తోంది.
ఇతర స్థావరాలలోనూ మరమ్మతులు
భారత దెబ్బకు చితికిపోయిన స్థావరం భోలారి ఒక్కటే కాదు. దీనికి ముందు మురిద్ ఎయిర్‌బేస్‌లో దెబ్బతిన్న పైకప్పులను ఎర్రటి టార్పాలిన్లతో కప్పే ప్రయత్నం చేశారు. సుక్కూర్‌లోని పాకిస్థాన్ డ్రోన్ హ్యాంగర్ కూడా శిథిలాల కుప్పగా మారింది. అటు నూర్ ఖాన్ ఎయిర్‌బేస్‌లోని కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ కూడా భారత దాడులకు వణికిపోయింది. భోలారిలో ప్రస్తుతం జరుగుతున్న పనులు, భారత వైమానిక దళం పాక్ రక్షణ వ్యవస్థ వెన్నుముకను ఎంతలా విరిచిందో నిరూపిస్తున్నాయి.
