అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల ఇరాన్‌పై చేసిన వ్యాఖ్యల తర్వాత, హార్ముజ్ జలసంధిలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్స్ వాణిజ్య నౌకలను లక్ష్యంగా చేసుకుని రెండు క్షిపణులు ప్రయోగించినట్లు అమెరికా అధికారులు ఆరోపిస్తున్నారు. ఈ దాడిలో హార్ముజ్ జలసంధి నుంచి ప్రయాణిస్తున్న రెండు వాణిజ్య నౌకలు దెబ్బతిన్నాయి. అయితే, ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని తెలుస్తోంది.
హార్మూజ్ జలసంధిలోని ఒమాన్ తీరానికి సమీపంలో ప్రయాణిస్తున్న ఒక చమురు ట్యాంకర్‌పై గుర్తుతెలియని ప్రాజెక్టయిల్ పడటంతో మంటలు చెలరేగాయి. యునైటెడ్ కింగ్‌డమ్ మెరిటైమ్ ట్రేడ్ ఆపరేషన్స్ తెలిపిన వివరాల ప్రకారం, ఒమాన్‌లోని లిమాహ్ సమీపంలో దక్షిణ దిశగా ప్రయాణిస్తున్న ట్యాంకర్ ఎడమ వైపు ఈ ప్రాజెక్టయిల్ పడింది. ఈ ప్రమాదంతో ఎలాంటి నష్టం జరగలేదని బ్రిటిష్ సైన్యం వెల్లడించింది. ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతోంది. ఈ దాడికి ఇప్పటివరకు ఏ సంస్థా బాధ్యత స్వీకరించలేదు.
ఖమేనీ అంత్యక్రియల సమయంలో తాము తలుచుకుంటే ఇరాన్ అగ్ర నేతలు అందరినీ ఒకేసారి మట్టుపెట్టేస్తాం అంటూ డొనాల్డ్ ట్రంప్ తాజాగా వ్యాఖ్యలు చేశారు. కానీ.. తాము అలాంటి పని చేయడం లేదని, ఎందుకంటే ప్రస్తుతం ఇరు దేశాలు శాంతి ఒప్పందంలో ఉన్నాయని చెప్పారు. దీనిపై ఇరాన్ కూడా ఘాటుగానే బదులిచ్చింది. ఈ వ్యాఖ్యల తర్వాతే హార్మూజ్‌లో మంటలు చెలరేగడం ఆసక్తికరంగా మారింది.
మూడు వారాల క్రితమే అమెరికా-ఇరాన్ మధ్య కుదిరిన అవగాహన ఒప్పందం ప్రకారం, హార్ముజ్ జలసంధిలో వాణిజ్య నౌకలపై దాడులు నిలిపివేయాలని ఇరాన్ అంగీకరించింది. అంతేకాకుండా ఖతార్ మధ్యవర్తిత్వంలో అమెరికా-ఇరాన్ మధ్య వారం రోజుల పాటు దాడులు నిలిపివేయాలనే తాత్కాలిక ఒప్పందం కూడా ఇటీవల ముగిసింది. ఈ నేపథ్యంలో తాజాగా జరిగిన దాడులు మళ్లీ యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయా? అనే అనుమానాలను రేకెత్తిస్తున్నాయి.
ఇటీవల రోజుల్లో ఒమాన్ సమీపంలో ప్రయాణిస్తున్న మరో రెండు నౌకలపై కూడా ఇరాన్ దాడి చేసి ఉండొచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. హార్ముజ్ జలసంధి ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన సముద్ర మార్గం కావడంతో, ఈ వరుస ఘటనలు అంతర్జాతీయంగా ఆందోళనకు దారితీశాయి. ప్రస్తుతం సముద్ర భద్రతపై వివిధ దేశాలు నిఘా మరింత పెంచాయి.
