అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు విఫలం.. యుద్ధం త‌ప్ప‌దా?

ఈ చర్చలను విజయవంతం చేయడానికి పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ ఫలితం దక్కలేదు.

Published By: HashtagU Telugu Desk
US-Iran Peace Talks

US-Iran Peace Talks

US-Iran Peace Talks: అమెరికా- ఇరాన్ మధ్య జరుగుతున్న శాంతి చర్చలు మరోసారి ఎటువంటి ఫలితం లేకుండా ముగిశాయి. పాకిస్థాన్ మధ్యవర్తిత్వంలో ఎన్నో ఆశలతో ప్రారంభమైన ఈ చర్చల రెండో రౌండ్ కూడా విఫలమవ్వడం మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలను తగ్గించే ప్రయత్నాలకు పెద్ద దెబ్బగా మారింది. శనివారం ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘచీ నేరుగా చర్చలు జరపకుండానే తిరిగి వెళ్ళిపోయారు. దీంతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తమ ప్రతినిధి బృందం పాకిస్థాన్ పర్యటనను రద్దు చేశారు. అమెరికా తరపున ప్రత్యేక దూత స్టీవ్ విట్‌కాఫ్, ట్రంప్ అల్లుడు జారెడ్ కుష్నర్ ఇస్లామాబాద్‌కు రావాల్సి ఉంది.

ట్రంప్ ఏమన్నారు?

ఈ పర్యటనను అకస్మాత్తుగా రద్దు చేస్తూ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. అసలు ఇరాన్ తరపున ఎవరు మాట్లాడతారో వారికే స్పష్టత లేదు. ఇది సమయం, కష్టం రెండింటినీ వృధా చేయడమే అని ఆయన పేర్కొన్నారు. ఇరాన్ నాయకత్వంలో అంతర్గత విభేదాలు, గందరగోళం ఎక్కువగా ఉన్నాయని, అక్కడ ఎవరి నియంత్రణలో అధికారం ఉందో కూడా తెలియడం లేదని విమర్శించారు. ఫ్లోరిడాలో మీడియాతో మాట్లాడుతూ.. ప్రతినిధి బృందం పాకిస్థాన్ పర్యటనకు చాలా సమయం, ఖర్చు అవుతుందని, ఇరాన్ నిజంగా చర్చలు జరపాలనుకుంటే ఒక ఫోన్ కాల్ చేస్తే సరిపోతుందని ట్రంప్ ఎద్దేవా చేశారు.

Also Read: ట్రంప్ కార్యక్రమంపై కాల్పుల ఘటన.. స్పందించిన ప్రధాని మోదీ

నేరుగా చర్చలకు ఇరాన్ విముఖత

ఏప్రిల్ రెండో వారంలో ఇస్లామాబాద్‌లో అమెరికా, ఇరాన్ మధ్య మొదటిసారిగా ఉన్నత స్థాయి చర్చలు జరిగాయి. అయితే ఆ సమయంలో కూడా ఎటువంటి ఒప్పందం కుదరలేదు. తాజాగా రెండో రౌండ్ చర్చల కోసం ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘచీ పాకిస్థాన్ చేరుకున్నప్పటికీ అమెరికా అధికారులతో నేరుగా చర్చలు జరపబోమని స్పష్టం చేశారు. కేవలం పాకిస్థాన్ ద్వారానే తమ సందేశాలను అమెరికాకు చేరవేస్తామని ఇరాన్ పేర్కొంది. కానీ అమెరికా మాత్రం ఈసారి ముఖాముఖి చర్చలకే మొగ్గు చూపింది. పరస్పర భిన్న వాదనల వల్ల చర్చలు ముందుకు సాగలేదు.

విఫలమైన పాకిస్థాన్ ప్రయత్నం

ఈ చర్చలను విజయవంతం చేయడానికి పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ ఫలితం దక్కలేదు. మీడియా నివేదికల ప్రకారం.. ఆర్థిక ఆంక్షల విషయంలోనే ప్రధాన వివాదం నెలకొంది. తమపై ఉన్న అన్ని ఆంక్షలను తక్షణమే తొలగించాలని ఇరాన్ కోరుతుండగా, అమెరికా మాత్రం దశలవారీగా ఉపశమనం ఇస్తామని అంటోంది. దీనికి తోడు అణు కార్యక్రమం, హోర్ముజ్ స్ట్రైట్ వంటి కీలక అంశాలపై ఇరు దేశాల మధ్య తీవ్ర భేదాభిప్రాయాలు కొనసాగుతున్నాయి.

  Last Updated: 26 Apr 2026, 12:58 PM IST