Vaibhav Suryavanshi: ఐపీఎల్ చరిత్రలో 15 ఏళ్ల సంచలనం వైభవ్ సూర్యవంశీ మరోసారి అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. శనివారం నాడు జైపూర్ వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో ఈ యువ ఆటగాడు కేవలం 15 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేసి రికార్డు సృష్టించాడు. ఐపీఎల్ కెరీర్‌లో వైభవ్ ఇలా 15 బంతుల్లో హాఫ్ సెంచరీ చేయడం ఇది మూడోసారి కావడం విశేషం. అక్కడితో ఆగకుండా కేవలం 36 బంతుల్లోనే సెంచరీ మార్కును చేరుకుని, ఈ లీగ్‌లో తన రెండో శతకాన్ని నమోదు చేశాడు. మొత్తం మీద 37 బంతుల్లో 103 పరుగులు చేసి అవుట్ అయిన సూర్యవంశీ ఇన్నింగ్స్‌లో 5 ఫోర్లు, 12 సిక్సర్లు ఉన్నాయి. స్ట్రైక్ రేట్ 278.37గా నమోదైంది.
ఈ తుపాకీ ఇన్నింగ్స్‌తో వైభవ్ సూర్యవంశీ పలు ప్రపంచ రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు. టీ20 క్రికెట్ చరిత్రలో అతి తక్కువ వయసులో 1000 పరుగుల మైలురాయిని అందుకున్న బ్యాటర్‌గా నిలిచినట్లు లైవ్ కామెంటరీలో వెల్లడించారు. అంతేకాకుండా ఎదుర్కొన్న బంతుల పరంగా కూడా అత్యంత వేగంగా 1000 టీ20 పరుగులు చేసిన రికార్డును సొంతం చేసుకున్నాడు. వైభవ్ కేవలం 473 బంతుల్లోనే ఈ ఘనత సాధించగా, అంతకుముందు మిచెల్ ఓవెన్ (533 బంతులు), ఆండ్రూ సైమండ్స్ (558 బంతులు), ఆశుతోష్ శర్మ (570 బంతులు), ఫిన్ అలెన్ (573 బంతులు) టాప్ లిస్టులో ఉండేవారు. ఇప్పుడు వారందరినీ వెనక్కి నెట్టి సూర్యవంశీ అగ్రస్థానానికి చేరుకున్నాడు.
Also Read: ఐపీఎల్ 2026.. ఒకే రోజు 986 పరుగులు!!
ఇన్నింగ్స్‌ల పరంగా చూసినా వైభవ్ అరుదైన జాబితాలో చేరిపోయాడు. అత్యంత వేగంగా (తక్కువ ఇన్నింగ్స్‌ల్లో) 1000 టీ20 పరుగులు చేసిన ఆటగాళ్లలో 26 ఇన్నింగ్స్‌లతో ఫిలిప్ హ్యూస్‌తో కలిసి సంయుక్తంగా నిలిచాడు. ఈ జాబితాలో ఆస్ట్రేలియా దిగ్గజాలు బ్రాడ్ హాడ్జ్ (23 ఇన్నింగ్స్‌లు), షాన్ మార్ష్ (23 ఇన్నింగ్స్‌లు) మొదటి స్థానంలో ఉండగా.. మ్యాథ్యూ హేడెన్ (24 ఇన్నింగ్స్‌లు), దేవదత్ పడిక్కల్ (25 ఇన్నింగ్స్‌లు) తర్వాతి స్థానాల్లో ఉన్నారు. ఒకే సీజన్‌లో CSK, ఆర్సీబీ వంటి జట్లపై కూడా 15 బంతుల్లోనే హాఫ్ సెంచరీలు బాదిన వైభవ్.. ప్రస్తుత ఐపీఎల్ సీజన్‌లో అత్యంత ప్రమాదకరమైన బ్యాటర్‌గా అవతరించాడు.
