Donald Trump: వాషింగ్టన్‌లో జరిగిన వైట్ హౌస్ కరస్పాండెంట్స్ డిన్నర్ కాల్పుల ఘటనపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రాథమిక సమాచారం ప్రకారం.. ఈ దాడి వెనుక ఎటువంటి అంతర్జాతీయ కుట్ర లేదని, ఇది ఒక వ్యక్తి చేసిన పనిగానే కనిపిస్తోందని ఆయన స్పష్టం చేశారు. ఇరాన్‌తో నెలకొన్న ఉద్రిక్తతలకు, ఈ దాడికి ఏమైనా సంబంధం ఉందా అని ప్రశ్నించగా.. ప్రస్తుతానికి అలాంటి ఆధారాలేమీ లేవని ఆయన సమాధానమిచ్చారు. పూర్తి విచారణ తర్వాతే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని, అయితే నిందితుడు ఒంటరిగానే ఈ దాడికి పాల్పడినట్లు సంకేతాలు ఉన్నాయని తెలిపారు.
దుండగుడు అనేక ఆయుధాలతో సెక్యూరిటీ చెక్‌పాయింట్ వద్ద దాడికి ప్రయత్నించాడని, అయితే సీక్రెట్ సర్వీస్, భద్రతా దళాలు అత్యంత వేగంగా స్పందించి అతడిని అదుపులోకి తీసుకున్నాయని ట్రంప్ ప్రెస్ బ్రీఫింగ్‌లో వివరించారు. భద్రతా బలగాల ధైర్యసాహసాలను ఆయన కొనియాడారు. వారి అప్రమత్తత వల్లే భారీ ప్రాణనష్టం తప్పిందని పేర్కొన్నారు. ఈ ఘటనలో ఒక అధికారికి గాయాలయ్యాయని, ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని తెలిపారు. నిందితుడు కాలిఫోర్నియా నివాసిగా గుర్తించినట్లు సమాచారం ఇచ్చారు.
Also Read: ట్రంప్‌పై కాల్పుల కలకలం!
ఇండోర్ ఈవెంట్స్ నిర్వహణపై ట్రంప్ స్పందన
ఈ ఘటన తర్వాత ఇండోర్ (ఒకే చోట గుమిగూడే) కార్యక్రమాల నిర్వహణపై ఆలోచన మార్చుకోవాల్సిన అవసరం ఉందా అని అడగగా నేను అలా చేయలేను అని ట్రంప్ తేల్చి చెప్పారు. కార్యక్రమం జరిగిన గది చాలా సురక్షితమైనదని ఆయన అభిప్రాయపడ్డారు. దాడి తనను లక్ష్యంగా చేసుకునే జరిగిందా అనే ప్రశ్నకు సమాధానమిస్తూ, బహుశా తాను కూడా లక్ష్యంగా ఉండి ఉండవచ్చని పేర్కొన్నారు. ఈ ఘటన నేపథ్యంలో ప్రజలందరూ సంయమనం పాటించాలని ట్రంప్ కోరారు. ఏవైనా విభేదాలు ఉంటే వాటిని హింస ద్వారా కాకుండా శాంతియుత మార్గాల్లో పరిష్కరించుకోవాలని పిలుపునిచ్చారు. పారదర్శకత కోసం, నిందితుడి కదలికలు, భద్రతా సంస్థల చర్యలకు సంబంధించిన వీడియోను విడుదల చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రస్తుతానికి విచారణ కొనసాగుతోంది.
