Ceasefire: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌తో కొనసాగుతున్న యుద్ధవిరామాన్ని పొడిగిస్తున్నట్లు ప్రకటించారు. అయితే దీనికి ఆయన ఒక కఠినమైన షరతును జోడించడంతో ఉద్రిక్తతలు తగ్గకపోగా మరింత పెరిగాయి. యుద్ధవిరామాన్ని పొడిగిస్తూనే ఇరాన్ ఓడరేవులపై నౌకాదళ దిగ్బంధనాన్ని కొనసాగించాలని ట్రంప్ కఠిన ఆదేశాలు జారీ చేశారు. పాకిస్థాన్ విజ్ఞప్తి మేరకు ఇరాన్ ప్రభుత్వంలోని అంతర్గత విభేదాలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ట్రంప్ పేర్కొన్నారు. ఇరాన్ నుండి ఒక ఏకీకృత, ఉమ్మడి ప్రతిపాదన వచ్చే వరకు తదుపరి చర్చలు సాధ్యం కాదని అమెరికా స్పష్టం చేసింది.
అమెరికా ప్రతిపాదనను తిరస్కరించిన ఇరాన్
ట్రంప్ తీసుకున్న ఈ చర్యను శాంతి ప్రయత్నంగా గుర్తించడానికి ఇరాన్ నిరాకరించింది. ఇదంతా ఒక పెద్ద కుట్ర అని ఇరాన్ కొట్టిపారేసింది. ఈ యుద్ధవిరామం కేవలం ఒక సాకు మాత్రమేనని, అమెరికా ‘సర్‌ప్రైజ్ అటాక్’ (అకస్మాత్తుగా దాడి) చేయడానికి సిద్ధమవుతోందని ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ సలహాదారు ఆరోపించారు. చర్చల పేరుతో ట్రంప్ సమయాన్ని వృథా చేస్తున్నారని, క్షేత్రస్థాయిలో నౌకాదళ దిగ్బంధనం ద్వారా ఇరాన్ ఆర్థిక నడ్డి విరవాలని చూస్తున్నారని ఇరాన్ భావిస్తోంది. ఇదే సమయంలో అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ తన పాకిస్థాన్ పర్యటనను రద్దు చేసుకోవడం శాంతి చర్చలకు పెద్ద దెబ్బగా మారింది.
Also Read: Kedarnath : నేటి నుండి కేదార్‌నాథ్ దర్శనం.. తెరుచుకున్న ఆలయ ద్వారాలు..
దిగ్బంధనం అంటే యుద్ధం ప్రకటించడమే!
అమెరికా నేరుగా యుద్ధవిరామ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తోందని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ ఆరోపించారు. ఇరాన్ ఓడరేవులను దిగ్బంధించడం అంటే అది ‘యుద్ధం ప్రకటించడమే’ అని, దీనిని ఏమాత్రం సహించబోమని ఆయన హెచ్చరించారు. వాణిజ్య నౌకలపై దాడులు చేయడం, సిబ్బందిని బందీలుగా పట్టుకోవడం అమెరికా దూకుడు విధానంలో భాగమని ఇరాన్ విమర్శించింది. అమెరికా తన నౌకాదళ దిగ్బంధనాన్ని పూర్తిగా ఎత్తివేసే వరకు చర్చల ప్రసక్తే లేదని ఇరాన్ భీష్మించుకుంది.
సైనిక చర్యకు పెరుగుతున్న డిమాండ్
అమెరికా విధిస్తున్న దిగ్బంధనానికి వ్యతిరేకంగా సైనిక చర్య చేపట్టాలనే డిమాండ్ ఇరాన్ లోపల బలంగా వినిపిస్తోంది. తాము ఎటువంటి బెదిరింపులకు లొంగబోమని, దేశ సార్వభౌమాధికారాన్ని కాపాడుకోవడానికి ఆయుధాలను ఉపయోగించడానికి వెనుకాడబోమని ఇరాన్ వ్యూహకర్తలు చెబుతున్నారు. అమెరికా చేస్తున్న ఈ కదలికలను ఇరాన్ ఒక పెద్ద రెచ్చగొట్టే చర్యగా చూస్తోంది. ఈ పరిణామాలు గల్ఫ్ దేశాలలో ఎప్పుడైనా యుద్ధానికి దారితీయవచ్చు. ఇరు దేశాల మధ్య నెలకొన్న ఈ ఉద్రిక్తత ఇప్పుడు ఒక ప్రమాదకరమైన మలుపుకు చేరుకుంది. ఇక్కడ జరిగే చిన్న తప్పు కూడా ప్రపంచాన్ని మరో వినాశకరమైన యుద్ధంలోకి నెట్టే అవకాశం ఉంది.
