E85 Fuel: భారతదేశ ఇంధన రంగంలో త్వరలో ఒక చారిత్రాత్మక మార్పు రాబోతోంది. ప్రస్తుతం మనం వాడుతున్న E20 పెట్రోల్ తర్వాత ప్రభుత్వం మరింత శక్తివంతమైన E85 ఇంధనాన్ని ప్రవేశపెట్టేందుకు ముసాయిదా నిబంధనలను సిద్ధం చేస్తోంది. ఈ ఇంధనంలో 85 శాతం ఇథనాల్ ఉండగా, కేవలం 15 శాతం మాత్రమే పెట్రోల్ ఉంటుంది. దీనివల్ల భవిష్యత్తులో మన వాహనాలు పెట్రోల్ కంటే ఎక్కువగా వ్యవసాయ ఆధారిత ఇథనాల్‌పైనే నడిచే అవకాశం ఉంది. అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు ధరలు పెరుగుతున్న తరుణంలో విదేశీ దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించుకోవడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ఈ భారీ నిర్ణయం తీసుకుంటోంది. ప్రాథమిక పరీక్షలు ఇప్పటికే పూర్తయ్యాయని, త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉందని సమాచారం.
E85 ఇంధనం అందుబాటులోకి వస్తే వాహనదారులకు ఇంధన ఖర్చులు గణనీయంగా తగ్గే అవకాశం ఉంది. ఎందుకంటే సాధారణ పెట్రోల్, E20 కంటే E85 ధర తక్కువగా ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే ఈ ఇంధనాన్ని సాధారణ వాహనాల్లో వాడటం సాధ్యం కాదు. దీని కోసం ప్రత్యేకంగా రూపొందించిన ‘ఫ్లెక్స్-ఫ్యూయల్’ ఇంజన్లు కలిగిన వాహనాలు అవసరమవుతాయి. పాత వాహనాల్లో ఈ ఇంధనాన్ని వాడితే ఇంజన్ దెబ్బతినే ప్రమాదం ఉంది. కాబట్టి ఆటోమొబైల్ కంపెనీలు కూడా తమ ఇంజన్ టెక్నాలజీని ఆధునీకరించే పనిలో ఉన్నాయి. అలాగే పెట్రోల్ బంకుల్లో కూడా ఈ కొత్త ఇంధనం కోసం ప్రత్యేక నిల్వ కేంద్రాలు, నాజిల్‌లను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది.
Also Read:mప్రపంచ ధరిత్రి దినోత్సవం.. ఈ రోజే ఎందుకు జరుపుకుంటారో తెలుసా?
ఈ నిర్ణయం కేవలం వాహనదారులకే కాకుండా దేశ ఆర్థిక వ్యవస్థకు, పర్యావరణానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. ఇథనాల్‌ను చెరకు, మొక్కజొన్న, ధాన్యాల నుండి తయారు చేస్తారు. కాబట్టి రైతులకు ఇది అదనపు ఆదాయ వనరుగా మారుతుంది. చమురు దిగుమతుల కోసం విదేశాలకు చెల్లించే భారీ మొత్తాన్ని ఆదా చేయడంతో పాటు, పర్యావరణ కాలుష్యాన్ని కూడా తగ్గించవచ్చు. వచ్చే ఒకటి రెండు ఏళ్లలో ఈ ఇంధనం పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చేలా మౌలిక సదుపాయాల కల్పనపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఒకవైపు పర్యావరణ హితం, మరోవైపు రైతులకు లాభం చేకూర్చే ఈ ‘మద్యం ఆధారిత ఇంధనం’ భారత్ ఇంధన స్వయంసమృద్ధి సాధించడంలో కీలక పాత్ర పోషించనుంది.
