అమెరికాలో ఇన్సూరెన్స్ పాలసీల టైటిల్ రికార్డులను తారుమారు చేసి, ఒక బ్యాంకు నుంచి దాదాపు 100 మిలియన్ డాలర్లు (భారత కరెన్సీలో రూ. 954.2 కోట్లు) మోసపూరితంగా దోచుకున్న భారత సంతతికి చెందిన వ్యాపారవేత్తను అదుపులోకి తీసుకున్నారు. భారత సంతతికి చెందిన 44 ఏళ్ల వ్యాపారవేత్త మహేందర్ మఖిజానీని బుధవారం ఉదయం న్యూపోర్ట్ బీచ్‌లోని అతడి విలాసవంతమైన భవనంలో అమెరికా పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో ఆరోపణలు రుజువైతే అతడికి గరిష్ఠంగా 30 ఏళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉంది. భారతీయ పౌరుడైన మఖిజానీ గ్రీన్ కార్డుపై అమెరికాలో నివాసం ఉంటున్నారు.
ఆర్థిక మోసాలకు పాల్పడటమే కాదు.. సాయుధ అనుచరులతో హోటళ్లు, రెస్టారెంట్లను స్వాధీనం చేసుకోవడం, సెక్స్, డ్రగ్ పార్టీలు నిర్వహించడం వంటి పలు చట్టవిరుద్ధమైన చర్యలకు పాల్పడినట్లు కూడా ఆయనపై ఆరోపణలు ఉన్నాయి. కాలిఫోర్నియా సెంట్రల్ డిస్ట్రిక్ట్ ఫస్ట్ అసిస్టెంట్ యూఎస్ అటార్నీ బిలాల్ ఎస్సాయిలీ మాట్లాడుతూ.. కరోనా డెల్ మార్ ప్రాంతంలో నివాసం ఉంటున్న భారతీయ పౌరుడైన మహేందర్ మఖిజానీ ఒక బ్యాంకును దాదాపు 100 మిలియన్ డాలర్ల మేర మోసం చేసినట్లు వచ్చిన ఫిర్యాదు ఆధారంగా అరెస్ట్ చేశామని చెప్పారు.
అమెరికా ఇంటర్నల్ రెవెన్యూ సర్వీస్ ప్రకారం.. టైటిల్ ఇన్సూరెన్స్ రికార్డులను మఖిజానీ తారుమారు చేసి, అసలైన లీన్ పొజిషన్లను (ఆస్తిపై హక్కుదారులు) దాచిపెట్టాడు. ఫెడరల్ ఇన్సూరెన్స్ ఉన్న బ్యాంకును తప్పుదోవ పట్టించడానికి షెల్ కంపెనీల నెట్‌వర్క్‌ను ఉపయోగించాడు. ‘‘మా ప్రత్యేక ఏజెంట్లు వివిధ ఖాతాల ద్వారా జరిగిన లావాదేవీలను నిశితంగా పరిశీలించి కుట్రను ఛేదించారు.. తమ వ్యక్తిగత లాభం కోసం ఇలాంటి మోసాలకు పాల్పడిన వ్యక్తులను వదిలిపెట్టేది లేదు.. ’’ అని ఐఆర్ఎస్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ లాస్ ఏంజిల్స్ ఫీల్డ్ ఆఫీస్ యాక్టింగ్ స్పెషల్ ఏజెంట్ ఇంఛార్జ్ డారెన్ లియాన్ అన్నారు.
ఫిర్యాదుతో పాటు దాఖలు చేసిన అఫిడవిట్ ప్రకారం.. న్యూపోర్ట్ బీచ్‌లో మఖిజానీ కాంటర్ గ్రూప్ V LLC కంపెనీని నడుపుతున్నారు. ఈ సంస్థకు సదరు బ్యాంకుతో రుణాలు తీసుకునే ఒప్పందం ఉంది. దీని ప్రకారం రియల్ ఎస్టేట్ ద్వారా సురక్షిత రుణాలను సృష్టించడానికి లేదా కొనుగోలు చేయడానికి బ్యాంకు కాంటర్ గ్రూప్‌నకు దాదాపు 100 మిలియన్ డాలర్లు అడ్వాన్స్‌గా చెల్లించింది.
ఆ తర్వాత, కాంటర్ తాను పొందిన రుణాలను, వాటికి సంబంధించిన హామీ ఆస్తులను తాకట్టు పెట్టి, రుణాల ద్వారా వచ్చిన ఆదాయం నుంచి బ్యాంకుకు తిరిగి చెల్లించాల్సి ఉంది. సెప్టెంబర్ 2024 నుంచి ఏప్రిల్ 2025 వరకు టైటిల్ ఇన్సూరెన్స్ పాలసీలను ఫోర్జరీ చేసి, ఆయా రియల్ ఎస్టేట్ ఆస్తులపై కాంటర్ గ్రూప్‌నకే యాజమాన్య హక్కు ఉన్నట్టు తప్పుడు పత్రాలను సృష్టించారని ఆరోపణలు ఉన్నాయి. అనంతరం తన ఉద్యోగి ద్వారా నకిలీ పాలసీలను బ్యాంకుకు సమర్పించాడు. అంతేకాదు, బ్యాంకు ప్రతినిధుల ఫోన్ చేసినప్పుడు అబద్ధాలు చెప్పి నమ్మించారనే ఆరోపణలు ఉన్నాయి.
కోర్టు పత్రాల ప్రకారం.. డ్రగ్స్, సెక్స్ వర్కర్లతో మఖిజానీ నిర్వహించే ప్రైవేట్ పార్టీలకు బ్యాంకు ఉద్యోగులు కూడా హాజరయ్యేవారని ఆరోపణలు ఉన్నాయి. అయితే, పార్టీలో బ్యాంకు సిబ్బంది వీడియోలు తీసి బ్లాక్‌మెయిల్ వారిని తన గుప్పిట్లో పెట్టుకున్నాడు. తన కింద పనిచేసే సిబ్బందిని చంపుతానని, వారి కుటుంబాలను రోడ్డున పడేస్తానని తీవ్రంగా బెదిరించినట్లు డాక్యుమెంట్లు పేర్కొంటున్నాయి.
మరోవైపు, గత నెలలో లగున బీచ్‌కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త మహ్మద్ హొనార్కర్‌తో జరిపిన రియల్ ఎస్టేట్ లావాదేవీలలో జరిగిన మోసానికి గానూ, మఖిజాని దాదాపు 1.3 బిలియన్ డాలర్ల (సుమారు రూ. 12,391.6 కోట్లు) నష్టపరిహారం చెల్లించాల్సి ఉంటుందని ఒక మధ్యవర్తిత్వ కమిటీ తీర్పునిచ్చింది. న్యూయార్క్ పోస్ట్ నివేదిక ప్రకారం.. హొనార్కర్ వంటి తన వ్యాపార ప్రత్యర్థులపై పైచేయి సాధించడానికి బెదిరింపులు, అరాచకాలు, హింసను మఖిజానీ ఆశ్రయించినట్లు రెండు కేసులలో కోర్టు పత్రాలు ఆరోపిస్తున్నాయి.
