ఒమన్ తీరానికి సమీపంలో అమెరికా బలగాలు జరిపిన దాడిలో ముగ్గురు భారత నావికులు మరణించినట్లు కేంద్ర మంత్రి సర్బానంద సోనోవాల్ వెల్లడించారు. తొలుత వీరు గల్లంతైనట్లు సమాచారం వచ్చినా ఇప్పుడు వారి మరణాన్ని అధికారికంగా ధ్రువీకరించారు. ముగ్గురిలో ఇద్దరి మృతదేహాలు మాత్రమే ఇప్పటివరకు లభ్యమైనట్లు తెలిపారు.
పలావు జెండాతో ప్రయాణిస్తున్న సెటెబెల్లో ఆయిల్ ట్యాంకర్‌పై ఈ దాడి జరిగినట్లు సమాచారం. నౌకలో మొత్తం 28 మంది సిబ్బంది ఉండగా వారిలో 24 మంది భారతీయులు ఉన్నారు. మిగిలిన వారిలో ఇద్దరు పాకిస్థాన్‌కు చెందిన వారు, ఓ ఉక్రెయిన్ పౌరుడు, ఓ రష్యా పౌరుడు ఉన్నారు.
దాడి తర్వాత 21 మంది భారత నావికులను సురక్షితంగా రక్షించారు. అయితే డెక్ క్యాడెట్ ఆదిత్య శర్మ, ఇంజిన్ ఫిట్టర్ శివానంద్ చౌరాసియా, చీఫ్ ఇంజినీర్ పట్నాల సురేశ్ కనిపించకుండా పోయారు. తాజాగా వీరు మరణించినట్లు నిర్ధారణ అయింది. ఈ ఘటన పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేసిన సోనోవాల్.. మృతుల కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. రక్షించిన సిబ్బందిని వెంటనే స్వదేశానికి తీసుకురావాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. మృతదేహాలను కూడా త్వరగా భారత్‌కు తరలించే చర్యలు చేపట్టాలని సూచించారు.
ఇరాన్ చమురు రవాణాపై అమల్లో ఉన్న ఆంక్షలను ఉల్లంఘించిందనే ఆరోపణలతో అమెరికా సెంట్రల్ కమాండ్ ఈ నౌకపై దాడి చేసినట్లు తెలుస్తోంది. హర్మూజ్ జలసంధి మీదుగా ప్రయాణించే సమయంలో ఈ ఘటన జరిగినట్లు సమాచారం. నౌకను నిలిపివేసేందుకు కచ్చితత్వంతో కూడిన ఆయుధాలను ఉపయోగించినట్లు అమెరికా వర్గాలు పేర్కొన్నాయి.
ఈ ఘటనను భారత్ తీవ్రంగా ఖండించింది. భారతీయులు ప్రయాణిస్తున్న నౌకపై దాడి జరగడం ఆందోళన కలిగించే విషయమని తెలిపింది. ఉద్రిక్త పరిస్థితులు మరింత పెరగకుండా వెంటనే చర్యలు తీసుకోవాలని పిలుపునిచ్చింది. ఢిల్లీలోని అమెరికా రాయబార కార్యాలయ ప్రతినిధిని పిలిపించి తీవ్ర నిరసన వ్యక్తం చేసింది.
