Social Media Ban : 16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను బ్యాన్ చేసేందుకు ఆస్ట్రేలియా ప్రభుత్వం రెడీ అవుతోంది. దీనికి సంబంధించిన బిల్లును ఈనెలాఖరులోగా పార్లమెంటులో ప్రవేశపెట్టనుంది. పిల్లల మానసిక ఆరోగ్యాన్ని కాపాడే లక్ష్యంతో ఈ నిర్ణయాన్ని తీసుకున్నామని ఆస్ట్రేలియా ప్రధానమంత్రి ఆంథోనీ అల్బనీస్ గురువారం ప్రకటించారు. తమ బ్యాన్‌కు అనుగుణంగా సోషల్ మీడియా కంపెనీలు కూడా కొత్త నిబంధనలను అమలు చేయాలని ఆయన సూచించారు. లేదంటే భారీ జరిమానాలను చెల్లించాల్సి ఉంటుందని హెచ్చరించారు.
‘‘సోషల్ మీడియా పిల్లలకు(Social Media Ban) ఎంతో చేటు చేస్తోంది. వారు రోజంతా సోషల్ మీడియాలోనే గడుపుతున్నారు. ఇది చాలా ప్రమాదకర పరిణామం. పిల్లలకు సోషల్ మీడియా యాక్సెస్‌ను నిరోధించడానికి మేం సహేతుకమైన చర్యలన్నీ తీసుకోబోతున్నాం. వాటికి అనుగుణంగా సోషల్ మీడియా కంపెనీలు తప్పకుండా నడుచుకోవాలి. పిల్లలకు సోషల్ మీడియా యాక్సెస్ లేకుండా చూడాల్సిన బాధ్యత సోషల్ మీడియా కంపెనీలదేే. పిల్లలు, వారి తల్లిదండ్రులకు దీనితో సంబంధం లేదు’’ అని ఆస్ట్రేలియా ప్రధానమంత్రి ఆంథోనీ అల్బనీస్ తెలిపారు.
Also Read :AP MLC Elections : ‘గ్రాడ్యుయేట్’ ఓటర్ల నమోదుకు 20 వరకు ఛాన్స్.. అప్లై చేయడం ఇలా
- సోషల్ మీడియా కంటెంట్ విషయంలో ఆస్ట్రేలియా ప్రభుత్వం మొదటి నుంచే కఠినంగా వ్యవహరిస్తోంది. ఈవిషయంలో రాజీలేకుండా నిర్ణయాలు తీసుకుంటోంది.
- తమ దేశ మీడియా సంస్థల న్యూస్‌ను పబ్లిష్ చేసుకున్నందుకు డబ్బులు చెల్లించాలంటూ ఫేస్‌బుక్, గూగుల్‌లపై ఆస్ట్రేలియా ప్రభుత్వం గతంలో కోర్టును ఆశ్రయించింది.
- సిడ్నీలో జరిగిన తీవ్రవాద దాడికి సంబంధించిన వీడియోను తొలగించడంలో విఫలమైనందుకు ఎలాన్ మస్క్‌కు చెందిన ‘ఎక్స్’ (ట్విట్టర్) కంపెనీని ఆస్ట్రేలియా ప్రభుత్వం కోర్టుకు ఈడ్చింది.
- ప్రపంచంలో పర్యావరణ పరిరక్షణ, జంతుపరిరక్షణ చట్టాలను పక్కాగా అమలుచేసే దేశం కూడా ఆస్ట్రేలియానే.
- మొత్తం మీద పిల్లలు ఇంటర్నెట్, సోషల్ మీడియా మాయలో చిక్కి.. క్రియేటివిటీ కోల్పుతున్నారనే అంశాన్ని ఆస్ట్రేలియా ప్రభుత్వం గుర్తించడం మంచి పరిణామం. భవిష్యత్తులో మన దేశం కూడా ఈ బాటలోనే పయనిస్తుందో లేదో వేచిచూద్దాం..