జీహెచ్‌ఎంసీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అవకాశవాద రాజకీయాలకు పాల్పడుతోందని తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు విమర్శించారు. సూర్యాపేటలో నిర్వహించిన పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ప్రశిక్షణ అభియాన్ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన కేవలం ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఓటర్లను ఆకర్షించేందుకే కాంగ్రెస్ పార్టీ ఎన్టీఆర్ ప్రస్తావన తీసుకువచ్చిందని ఆయన ఆరోపించారు. తెలుగువారి ఆత్మగౌరవాన్ని అవమానించిన కాంగ్రెస్‌కు ఎన్టీఆర్ గురించి మాట్లాడే నైతిక హక్కు లేదని.. కాంగ్రెస్ వ్యతిరేక రాజకీయాలకు ఎన్టీఆర్ ప్రతీకగా నిలిచారని రామ్‌చందర్ రావు వ్యాఖ్యానించారు.
పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడిన ఆయన ఒకప్పుడు సభ్యత్వ నమోదు కోసం బీజేపీ కార్యకర్తలు సైకిళ్లపై గ్రామాలు తిరిగేవారని గుర్తుచేశారు. ప్రస్తుతం తెలంగాణలో 8 మంది ఎంపీలు, 8 మంది ఎమ్మెల్యేలతో పార్టీ బలపడిందంటే దానికి కార్యకర్తల త్యాగాలు, కృషే కారణమని పేర్కొన్నారు. రైతుల సమస్యల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని, వరి కొనుగోళ్లలో రైతులను కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ) కంటే తక్కువ ధరలకు అమ్ముకునే పరిస్థితి తీసుకొచ్చిందని ఆరోపించారు. బీజేపీ చేపట్టిన ‘రైతు గోస – భరోసా యాత్ర’ కారణంగానే ప్రభుత్వం స్పందించి చర్యలు తీసుకోవాల్సి వచ్చిందని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రైతుల నుంచి ధాన్యం మొత్తాన్ని వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.
కేంద్రంలోని నరేంద్రమోడీ ప్రభుత్వం తెలంగాణ అభివృద్ధికి సహకరించిందని రామ్‌చందర్ రావు తెలిపారు. జాతీయ రహదారులు, ఉచిత బియ్యం పంపిణీ, కొత్త విమానాశ్రయాలు, ఎరువుల కర్మాగారాలు, వస్త్ర పరిశ్రమలు, తెలంగాణలో రూ.13 లక్షల కోట్ల పెట్టుబడులు వంటి అంశాలను ప్రస్తావించారు. ఓబీసీ ప్రాతినిధ్యం గురించి కాంగ్రెస్ మాట్లాడటం కపటత్వమని ఆయన ఆరోపించారు. రాహుల్ గాంధీ ఓబీసీల గురించి మాట్లాడతారు. కానీ కాంగ్రెస్‌కు ఉన్న ఏకైక ఓబీసీ ముఖ్యమంత్రిని తొలగించిందని ఆయన ఆరోపించారు. ప్రస్తుతం కాంగ్రెస్ ముఖ్యమంత్రులందరూ అగ్రకులాలకు చెందిన వారేనని వ్యాఖ్యానించారు. రాబోయే ఎన్నికల్లో బీజేపీ విజయం సాధిస్తుందని విశ్వాసం వ్యక్తం చేసిన రామ్‌చందర్ రావు, పార్టీ కార్యకర్తలు క్రమశిక్షణ, సేవాభావంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. తెలంగాణ సమగ్ర అభివృద్ధి బీజేపీ పాలనతోనే సాధ్యమవుతుందని ఆయన స్పష్టం చేశారు.
