హైదరాబాద్‌కు చెందిన సీనియర్ న్యాయవాది ఖాజా మొయిజుద్దీన్ హత్య కేసులో పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. ఈ కేసులో ఇప్పటివరకు మొత్తం ఏడుగురు నిందితులను అరెస్టు చేసినట్లు పోలీసులు శుక్రవారం వెల్లడించారు. మే 23న మసాబ్ ట్యాంక్‌లోని తన నివాసం వెలుపల ఖాజా మొయిజుద్దీన్‌పై కారు దూసుకెళ్లడంతో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ అనంతరం మృతి చెందారు. మొయిజుద్దీన్ కుమారుడు ఫర్హాన్ చేసిన ఫిర్యాదు మేరకు.. వక్ఫ్ భూములు వివాదాలకు సంబంధించి మహబూబ్ ఆలం ఖాన్, ఆయన కుమారుడు ముజాహిద్ ఆలం ఖాన్‌ల నుంచి తన తండ్రికి గత కొన్ని నెలలుగా బెదిరింపులు వస్తున్నాయని ఆరోపించారు. గత కొన్నేళ్లలో తన తండ్రిపై ఐదుసార్లు దాడులు జరిగినట్లు కూడా పేర్కొన్నారు.
ఈ కేసు విచారణలో భాగంగా మే 24న మహబూబ్ ఆలం ఖాన్, ముజాహిద్ ఆలం ఖాన్‌లను పోలీసులు విచారణకు పిలిచారు. అనంతరం పరారీలోకి వెళ్లిన తండ్రీకొడుకులు.. ఢిల్లీకి పారిపోవడానికి ప్రయత్నిస్తుండగా హర్యానాలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ముజాహిద్ ఆలం ఖాన్ తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) ఉపాధ్యక్షుడిగా, మెదక్ పార్లమెంటరీ నియోజకవర్గం ఇన్‌చార్జిగా వ్యవహరిస్తున్నారు. మహబూబ్ ఆలం ఖాన్ అన్వర్-ఉల్-ఉలూమ్ ఎడ్యుకేషనల్ అసోసియేషన్ కార్యదర్శిగా ఉన్నారు. ఇప్పటికే ఈ కేసులో మరో నిందితుడు వినయ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. హత్యకు దాదాపు ఆరు నెలల ముందే మొయిజుద్దీన్ కదలికలను గమనిస్తూ ప్రణాళికాబద్ధంగా నేరానికి పాల్పడినట్లు విచారణలో తేలింది. సీనియర్ న్యాయవాది హత్య రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపింది. ఈ ఘటనతో న్యాయ, రాజకీయ వర్గాలు దిగ్భ్రాంతికి గురయ్యాయి. ఈ ఘటనపై పూర్తిగా విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.
