రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా వర్షాలు లేక, ఎండల తీవ్రతతో అల్లాడిపోతున్న సామాన్య ప్రజలకు, రుతుపవనాల రాక కోసం కళ్లల్లో ఒత్తులు వేసుకుని ఎదురు చూస్తున్న రైతాంగానికి భారత వాతావరణ శాఖ అత్యంత తీపి కబురు అందించింది. మందగించిన నైరుతి రుతుపవనాలు తిరిగి తమ ప్రతాపాన్ని చూపించేందుకు సిద్ధం అయ్యాయని.. జూన్ 23వ తేదీ మంగళవారం నుంచి తెలంగాణ వ్యాప్తంగా ఇవి ఊపందుకోనున్నాయని న్యూఢిల్లీ వాతావరణ కేంద్రం గురువారం విడుదల చేసిన బులెటిన్‌లో స్పష్టం చేసింది.
ప్రస్తుత వాతావరణ పరిస్థితులు రుతుపవనాల పురోగతికి పూర్తిగా అనుకూలంగా మారాయని శాస్త్రవేత్తలు వెల్లడించారు. దీనివల్ల రాబోయే నాలుగు నుంచి ఐదు రోజుల్లో రాష్ట్రంలోని మిగిలిన అన్ని ప్రాంతాలకూ రుతుపవనాలు వేగంగా విస్తరించనున్నాయని చెప్పారు. ప్రస్తుతం రుతుపవనాల ఉత్తర సరిహద్దు రేఖ హైదరాబాద్, భద్రాచలం పరిసర ప్రాంతాల్లోనే నిలిచిపోగా.. రానున్న రోజుల్లో ఈ వాతావరణ మార్పుల్లో స్పష్టమైన పురోగతి కనిపించనుంది.
జూన్ 21 నుంచి విస్తారంగా వర్షాలు.. పడిపోనున్న ఉష్ణోగ్రతలు!
వాతావరణ శాఖ అంచనాల ప్రకారం.. జూన్ 21వ తేదీ ఆదివారం రోజు నుంచి రాష్ట్ర వాతావరణంలో ఒక కీలకమైన మలుపు రానుంది. ప్రస్తుతం అక్కడక్కడా కురుస్తున్న చెదురుమొదురు వర్షాలు.. జూన్ 21వ తేదీ నాటికి తెలంగాణలోని పలు రీజియన్లలో ‘విస్తారమైన’ వర్షాలుగా మారనున్నాయి. ఇక జూన్ 23 నాటికి రుతుపవనాలు రాష్ట్రంపై పూర్తి పట్టు సాధించి, గత కొన్ని వారాలుగా వేధిస్తున్న ఉక్కపోత, ఎండల తీవ్రత నుండి ప్రజలకు పూర్తిగా ఉపశమనం కలిగిస్తాయి. మరోవైపు ఈ రుతుపవనాల పునరాగమనానికి తోడుగా రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు కూడా క్రమంగా తగ్గనున్నాయి.
జూన్ 19వ తేదీ శుక్రవారం అంటే ఈరోజు నుంచే గరిష్ట ఉష్ణోగ్రతలు 2 డిగ్రీల నుంచి 3 డిగ్రీల సెల్సియస్ వరకు క్రమంగా పడిపోతాయని ఐఎండీ అంచనా వేసింది. జూన్ నెలలో తీవ్రమైన వడగాల్పులకు కారణమైన పొడి గాలులు ఇప్పుడు పూర్తిగా వెనక్కి తగ్గుతున్నాయి. వాటి స్థానంలో సముద్రం నుంచి వచ్చే తేమతో కూడిన చల్లటి గాలులు రాష్ట్రంలోకి ప్రవేశిస్తుండటంతో.. స్థిరమైన వర్ష కాలానికి వేదిక కానుంది.
రాబోయే రోజుల్లో ఇలా ఉండబోతున్న వాతావరణం..!
జూన్ 17వ తేదీ నుంచి జూన్ 20వ తేదీ వరకు తెలంగాణలోని పలు జిల్లాల్లో అక్కడక్కడా మాత్రమే మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. కానీ జూన్ 21వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా వాతావరణం పూర్తిగా మారిపోయి, అన్ని ప్రాంతాలలో విస్తారంగా, ముమ్మరంగా వర్షాలు కురుస్తాయి. అంతేకాకుండా రాబోయే 24 గంటల్లో రాష్ట్రంలో అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో కూడిన పిడుగులు పడే అవకాశం ఉంది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో (కొన్నిసార్లు 60 కిమీ వేగంతో) బలమైన ఈదురు గాలులు వీచే ప్రమాదం ఉందని, ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది.
తెలంగాణతో పాటు ఒడిశా, జార్ఖండ్, బీహార్, ఛత్తీస్‌గఢ్‌లోని కొన్ని ప్రాంతాల్లో కూడా జూన్ 23 నాటికి రుతుపవనాలు మరింత ముందుకు సాగుతాయని ఐఎండీ నివేదిక పేర్కొంది. ఏదేమైనా ఈ తాజా వానల ముందస్తు సమాచారం ఖరీఫ్ సాగు పనులకు సిద్ధమవుతున్న రైతుల్లో కొత్త ఆశలు చిగురింపజేస్తోంది.
