మాజీ మంత్రి కొడాలి నానిపై నమోదైన కేసు విచారణకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. 2021 పంచాయతీ ఎన్నికల సమయంలో సీఎం చంద్రబాబు నాయుడు, నిమ్మగడ్డ రమేష్ కుమార్‌పై కొడాలి నాని చేసిన వ్యాఖ్యలపై నమోదైన కేసులో విచారణ ముందుకు సాగనుంది.
పంచాయతీ ఎన్నికల సమయంలో కొడాలి నాని చేసిన వ్యాఖ్యలు ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించే విధంగా ఉన్నాయని రాష్ట్ర ఎన్నికల సంఘం అభిప్రాయపడింది. ఈ మేరకు ఆయనపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల సంఘం సంయుక్త కార్యదర్శి అప్పట్లో కృష్ణా జిల్లా ఎస్పీకి నివేదిక పంపించారు.
ఆ నివేదిక ఆధారంగా 2021లోనే స్థానిక న్యాయస్థానం అనుమతి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ఆ సమయంలో కొడాలి నాని రాష్ట్ర మంత్రిగా ఉండడంతో ఆయనపై కేసు విచారణ చేపట్టాలంటే ప్రభుత్వ అనుమతి తప్పనిసరిగా అవసరమైంది. దీంతో కేసు ప్రక్రియ పెండింగ్‌లో ఉండిపోయింది.
తాజాగా కృష్ణా జిల్లా కలెక్టర్ పంపిన నివేదికను పరిశీలించిన రాష్ట్ర హోంశాఖ, ప్రాసిక్యూషన్‌కు అనుమతి మంజూరు చేసింది. ఈ మేరకు హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజిత్ ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలుస్తోంది.
