తెలంగాణలో బీటెక్ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన మోస్ట్ అవేటెడ్ టీజీ ఎప్‌సెట్ 2026 మొదటి విడత కౌన్సెలింగ్ ప్రక్రియ జూన్ 19వ తేదీ శుక్రవారం అంటే ఈరోజు నుంచే అధికారికంగా ప్రారంభమైంది. ఇంజినీరింగ్ సీటు సాధించాలనే లక్ష్యంతో ఉన్న విద్యార్థులు ఈ రోజు నుంచి ఆన్‌లైన్‌లో ప్రాసెసింగ్ ఫీజు చెల్లించి, తమకు అనుకూలమైన తేదీ, సమయాన్ని బట్టి ధ్రువపత్రాల పరిశీలన కోసం స్లాట్ బుక్ చేసుకోవచ్చు. రాష్ట్రవ్యాప్తంగా ఈసారి అర్హత సాధించిన 1,44,704 మంది విద్యార్థుల కోసం సాంకేతిక విద్యాశాఖ అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ప్రక్రియను సులభతరం చేసేందుకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 37 హెల్ప్‌లైన్ కేంద్రాలను సిద్ధం చేశారు. ఈ ఏడాది కొత్తగా శాతవాహన యూనివర్సిటీ పరిధిలోని హుస్నాబాద్ ఇంజినీరింగ్ కళాశాలలో కూడా ప్రత్యేక కేంద్రాన్ని కేటాయించినట్లు ఎప్‌సెట్ ప్రవేశాల కన్వీనర్, సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ శ్రీదేవసేన వెల్లడించారు.
కన్వీనర్ కోటా కింద కౌన్సెలింగ్‌లో పాల్గొని సీటు దక్కించుకోవాలనుకునే వారికి ధ్రువపత్రాల పరిశీలన అత్యంత కీలకం కాగా.. ఈ ప్రక్రియ విజయవంతంగా పూర్తయిన వారికి మాత్రమే వెబ్ ఆప్షన్లు ఇచ్చుకునే అర్హత లభిస్తుంది. జూన్ 25వ తేదీ నుంచి విద్యార్థులు తమకు నచ్చిన కాలేజీలు, బ్రాంచ్‌లను ప్రాధాన్యతా క్రమంలో ఎంచుకోవచ్చు. గత ఏడాది కన్వీనర్ కోటాలో సుమారు 92 వేల సీట్లు అందుబాటులో ఉండగా.. ఈ ఏడాది కాలేజీల వారీగా స్పష్టమైన సీట్ల వివరాలు జూన్ 24వ తేదీ నాటికి తేలనున్నాయి. సాధారణంగా ప్రతి ఏటా 90 వేల నుంచి 95 వేల మంది కౌన్సెలింగ్‌కు హాజరవుతుండగా.. దాదాపు 80 వేల మందికి పైగా సీట్లు పొందుతున్నారు.
మొదటి విడత కౌన్సెలింగ్ పూర్తి షెడ్యూల్ ఇదే..!
జూన్ 19వ తేదీ నుంచి 28వ తేదీ వరకు ప్రాసెసింగ్ ఫీజు చెల్లింపు, సర్టిఫికెట్ వెరిఫికేషన్ కోసం స్లాట్ బుకింగ్ వంటివి చేసుకోవాలి. అలాగే జూన్ 22వ తేదీ నుంచి 29వ తేదీ వరకు హెల్ప్‌లైన్ కేంద్రాలలో ధ్రువపత్రాల పరిశీలన ఉంటుంది. ఇక జూన్ 25వ తేదీ నుంచి జులై 1వ తేదీ వరకు విద్యార్థులు వెబ్ ఆప్షన్లు ఎంచుకునేందుకు అవకాశం ఉంటుంది. జులై 4వ తేదీలోపు ఆప్షన్ల ఆధారంగా ‘మాక్ కౌన్సెలింగ్’ సీట్ల కేటాయింపు జరుగుతుంది. జులై 5వ తేదీ నుంచి 7వ తేదీ వరకు మాక్ అలాట్‌మెంట్‌ను బట్టి అవసరమైతే వెబ్ ఆప్షన్లను మార్చుకునే అవకాశం కల్పించింది. జూన్ 10వ తేదీ లోపు మొదటి విడత తుది సీట్ల కేటాయింపు జరుగుతుంది.
ఫీజు రీయంబర్స్‌మెంట్‌కు కొత్త నిబంధనలు..!
ప్రభుత్వం అందించే ఫీజు రీయంబర్స్‌మెంట్‌కు ప్రభుత్వం కొన్ని కొత్త నిబంధనలను విధించింది. దాని ప్రకారం.. అభ్యర్థుల కుటుంబ వార్షిక ఆదాయం ఖచ్చితంగా రూ.2.50 లక్షల లోపు ఉండాలి. తహసీల్దార్ ద్వారా పొందిన తాజా ఆదాయ ధ్రువపత్రాన్ని (ఇన్‌కమ్ సర్టిఫికేట్) వెరిఫికేషన్ సమయంలో సమర్పిస్తేనే రీయంబర్స్‌మెంట్‌కు అర్హత లభిస్తుంది. ఈ నియమం గ్రామీణ, పట్టణ ప్రాంతాల వారందరికీ సమానంగా వర్తిస్తుంది. అయితే ఎస్సీ , ఎస్టీ, మైనారిటీ విద్యార్థులకు కాలేజీ ఫీజుతో సంబంధం లేకుండా పూర్తి మొత్తాన్ని ప్రభుత్వమే భరిస్తుంది. రాష్ట్ర లేదా కేంద్ర ప్రభుత్వ పరిధిలోని జూనియర్ కళాశాలల్లో ఇంటర్ చదివి ఎప్‌సెట్‌లో ర్యాంకు సాధించిన వారికి కూడా పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్ అందుతుంది. ఎప్‌సెట్ పరీక్షలో 10 వేలలోపు ర్యాంకు సాధించిన విద్యార్థులకు, వారి కులంతో సంబంధం లేకుండా ప్రభుత్వం పూర్తి ఫీజును చెల్లిస్తుంది.
