Kukatpally Robbery హైదరాబాద్ నగరంలోని కూకట్‌పల్లిలో నిన్న రాత్రి సినిమా ఫక్కీలో భారీ దోపిడీ జరిగింది. ఇద్దరు వ్యక్తుల కళ్లలో కారం చల్లిన దుండగులు, వారి వద్ద ఉన్న రూ. కోటి నగదును అపహరించుకుపోయారు. ఈ ఘటన ఏకంగా ఏసీపీ కార్యాలయానికి సమీపంలోనే జరగడం తీవ్ర కలకలం రేపింది.
వివరాల్లోకి వెళితే.. బహదూర్‌పురాకు చెందిన ఎండీ ఖుస్రు (42), ఎండీ అజీముద్దీన్ (38) అనే ఇద్దరు ఏసీ మెకానిక్‌లు సోమవారం రాత్రి ద్విచక్ర వాహనంపై జీడిమెట్లకు బయలుదేరారు. వారు గోల్డ్ డ్రాప్ ఆయిల్ కార్టన్ బాక్సులో రూ. కోటి నగదును తరలిస్తున్నారు. రాత్రి సుమారు 9:40 గంటల సమయంలో కూకట్‌పల్లి మెట్రో పిల్లర్ నంబర్ 837 వద్దకు రాగానే, రెండు మోటార్ సైకిళ్లపై వచ్చిన నలుగురు గుర్తుతెలియని వ్యక్తులు వారిని అడ్డగించారు.
వెంటనే వారి కళ్లలోకి కారం పొడి చల్లి దాడికి పాల్పడ్డారు. బాధితులు తేరుకునేలోపే, వారి వద్ద ఉన్న నగదు బాక్సును లాక్కొని అక్కడి నుంచి పరారయ్యారు. దాడిలో బాధితులకు కంటి సమస్యలు తప్ప తీవ్ర గాయాలు కాలేదు. బాధితుల ఫిర్యాదు మేరకు కూకట్‌పల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఈ దోపిడీ వెనుక హవాలా లావాదేవీలు ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. నిందితులను పట్టుకునేందుకు నాలుగు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఘటనా స్థలంలోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తూ, నిందితుల ఆచూకీ కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.
