Site icon HashtagU Telugu

Telangana: ముగ్గురూ ముగ్గురే..!

Kcr And Revanth And Bandi

Kcr And Revanth And Bandi

ఏ విష‌యాన్ని రాజ‌కీయం చేయాలి. దేన్ని మాన‌వీయంగా చూడాలనే పెద్ద మ‌నసు లీడ‌ర్ల‌కు ఉండాలి. తెలంగాణలోని ప్ర‌ధాన పార్టీలు వ‌రి ధాన్యం కొనుగోలు అంశాన్ని రాజ‌కీయ కోణం నుంచి చూశాయ‌ని చెప్ప‌డానికి అనేక అంశాలు లేక‌పోలేదు. ఇప్ప‌టికే 10వంద‌ల మందికిపైగా రైతులు ఆత్మ‌హ‌త్య చేసుకున్నారు. తెలంగాణ ఉద్య‌మ ఆత్మ‌బ‌లిదానాల కంటే ఈ సంఖ్య ప్ర‌మాద‌క‌రంగా క‌నిపిస్తోంది. ఖ‌రీఫ్ ధాన్యం అమ్ముకోలేక రైతులు పిట్ట‌ల్లా రాలిపోతున్నారు. వ‌రి క‌ల్లాల్లోనే ప్రాణాలు విడిస్తున్నారు. ఈ ప‌రిస్థితిని మాన‌వీయ కోణం నుంచి చూడ‌కుండా రాజ‌కీయ గేమ్ ఆడ‌డం కొంద‌రు లీడ‌ర్ల వికృత‌క్రీడకు ప‌రాకాష్ట‌.

రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది. కేంద్రంలో బీజేపీ ఏడేళ్ల నుంచి రాజ్యాన్ని ఏలుతోంది. ఈ రెండు అధికారాన్ని చెలాయిస్తోన్న పార్టీల‌ని అంద‌రికీ తెలుసు. వ‌రి ధాన్యాన్ని ఈ రెండు ప్ర‌భుత్వాలు కొనుగోలు చేయాలి. ఆ రెండు ప్ర‌భుత్వాల మ‌ధ్య జ‌రిగిన ఒప్పందాలు, అగ్రిమెంట్లు ఇవ‌న్నీ రైతుల‌కు అన‌వ‌స‌రం. పండించిన ధాన్యం కొనుగోలు చేస్తున్నారా? లేదా? అనేది ముఖ్యం. కానీ, కేంద్రంలోని బీజేపీని టార్గెట్ చేయ‌డానికి వీలున్నంత ప్ర‌య‌త్నం టీఆర్ఎస్ చేస్తోంది. ఆ క్ర‌మంలో అధికారంలో ఉన్న గులాబీ ద‌ళం ఆందోళ‌న‌కు దిగ‌డం విచిత్రం. దేశాన్ని ఏలుతోన్న బీజేపీ ఢిల్లీలో ఒక విధంగా రాష్ట్రాల్లో మ‌రో విధంగా ఉంటూ రైతుల జీవితాల‌తో ఆడుకుంటోంది. ఈ ప‌రిణామం రైతుల ఆత్మ‌హ‌త్య‌ల‌కు ఊతమిస్తోంది.

తెలంగాణ రాష్ట్రంలో తొలి నుంచి టీఆర్ఎస్ పార్టీకి ప్ర‌తిప‌క్షం బీజేపీనా? కాంగ్రెస్ పార్టీనా? అనే దానిపై చాలా సంద‌ర్భాల్లో కేసీఆర్ గేమ్ ఆడాడు. కొన్ని సంద‌ర్భాల్లో టీఆర్ఎస్ కు ప్ర‌త్యామ్నాయం కాంగ్రెస్ అనే ధోర‌ణి ని ఆయ‌నే తీసుకెళ్లాడు. నిజ‌మైన ప్రత్యామ్నాయం బీజేపీ మాత్ర‌మే అనే స్పేస్ ను కొన్ని సంద‌ర్భాల్లో క్రియేట్ చేశాడు. రెండు పార్టీల‌తోనూ కేసీఆర్ రాజ‌కీయ చద‌రంగం ఆడుతున్నాడు. ఇప్పుడు ప్ర‌తిప‌క్ష పాత్ర ను కూడా కేసీఆర్ తీసుకోవ‌డం తెలంగాణ రైతుల‌కు అర్థం కాకుండా ఉంది. కాంగ్రెస్ పీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి బాధ్య‌త‌లు తీసుకున్న త‌రువాత ఆ పార్టీ దూకుడుగా వెళ్లింది. ఆ పార్టీలోని లీడ‌ర్లు కొంద‌రు కేసీఆర్ మ‌రికొంద‌రు కేటీఆర్ ఇంకొంద‌రు క‌విత..సంతోష్ బ్యాచ్ గా ఉన్నార‌ని టాక్‌. అలాంటి వాళ్లంద‌ర్నీ కోవ‌ర్టులుగా రేవంత్ వ‌ర్గం భావిస్తోంది. కోవ‌ర్టులు, రేవంత్ రెడ్డి వ‌ర్గీయుల మ‌ధ్య చాలా కాలంగా ప్ర‌చ్ఛ‌న్నయుద్ధం జ‌రుగుతోంది. హుజురాబాద్ ఎన్నిక‌ల త‌రువాత కోవ‌ర్టులదే పైచేయిగా మారింది. దీంతో బీజేపీ బాగా పుంజుకుంది. టీఆర్ఎస్ కు ప్ర‌త్యామ్నాయం బీజేపీ అంటూ ధాన్యం కొనుగోలు అంశం ద్వారా ప్ర‌జ‌ల్లోకి క‌మ‌ల‌ద‌ళం వెళ్లింది. పైగా రెండు పార్టీ ల మ‌ధ్య ఆ స్థాయి పొలిటిక‌ల్ గేమ్ నడుస్తోది.

బీజేపీ, టీఆర్ఎస్ ఆడుతోన్న గేమ్ కు చెక్ పెట్టేలా రేవంత్ స్కెచ్ వేశాడు. టీఆర్ఎస్ ఎంపీలు, మంత్రులు ఢిల్లీ నుంచి తిరిగి వ‌చ్చిన అంశాన్ని రాజ‌కీయ అస్త్రంగా ప్ర‌యోగించాడు. కేసీఆర్ ఫాంహౌస్ వ‌ద్ద స‌భ‌ను పెట్టి నిర‌స‌న తెల‌ప‌డానికి సిద్ధం అయ్యాడు. దీంతో పోలీసులు ఆయ‌న్ను గృహ నిర్బంధ చేశారు. ఫ‌లితంగా ఆయ‌న‌కు వ్య‌క్తిగ‌తంగా అవ‌స‌ర‌మైనంత ప్ర‌చారం మీడియా ముఖంగా వ‌చ్చింది. వ‌రి ధాన్యం కొనుగోలుపై రెండు వారాలుగా బీజేపీ, టీఆర్ఎస్ ఢిల్లీ గేమ్ ముగిసింది. ఇప్పుడు మ‌ళ్లీ తాజాగా నిరుద్యోగం వైపు ప్ర‌జ‌ల దృష్టిని మ‌ర‌ల్చే ప్ర‌య‌త్నం జ‌రుగుతోంది. లక్ష‌ల ఉద్యోగాల‌కు నోటిఫికేష‌న్లు ఇవ్వ‌బోతున్నామ‌ని కేసీఆర్ స‌ర్కార్ చెబుతోంది. ఆ ప్ర‌క‌ట‌న చేసిన మ‌రుస‌టి రోజే ఇందిరాపార్కు వ‌ద్ద బీజేపీ దీక్ష‌కు దిగింది. సో..ఇలా మూడు పార్టీలు ఎవ‌రికి దోచిన విధంగా వాళ్లు ధాన్యం కొనుగోలు అంశాన్ని రాజ‌కీయంగా వాడేసుకుంటున్నాయి. ఇప్పుడు మ‌ళ్లీ నిరుద్యోగుల వైపు బీజేపీ, టీఆర్ఎస్ మ‌ళ్ల‌గా..కాంగ్రెస్ ఏం చేస్తుందో చూద్దాం.