Liquor Price Hike : తెలంగాణ మద్యం ప్రియులకు బిగ్ షాక్.. !!

ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం, సాధారణ బ్రాండ్ల (Ordinary Brands) ఫుల్ బాటిల్‌పై రూ. 20 నుండి రూ. 60 వరకు, ఇక ప్రీమియం బ్రాండ్ల (Premium Brands) పై ఏకంగా రూ. 100 నుండి రూ. 120 వరకు ధరలు పెరిగే అవకాశం ఉంది

Published By: HashtagU Telugu Desk
Liquor Price

Liquor Price

తెలంగాణ రాష్ట్రంలో మద్యం ప్రియులకు చేదు వార్త అందనుంది. రాష్ట్ర ఖజానాకు ప్రధాన ఆదాయ వనరుగా ఉన్న ఎక్సైజ్ శాఖ ద్వారా ఈ ఏడాది మరింత ఆదాయాన్ని రాబట్టాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఇందులో భాగంగానే మద్యం ధరలను భారీగా పెంచేందుకు రంగం సిద్ధమైంది. ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం, సాధారణ బ్రాండ్ల (Ordinary Brands) ఫుల్ బాటిల్‌పై రూ. 20 నుండి రూ. 60 వరకు, ఇక ప్రీమియం బ్రాండ్ల (Premium Brands) పై ఏకంగా రూ. 100 నుండి రూ. 120 వరకు ధరలు పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికే దీనిపై కసరత్తు పూర్తి చేసిన ముగ్గురు సభ్యుల కమిటీ, తన నివేదికను ప్రభుత్వానికి సమర్పించిన వెంటనే అధికారిక ఉత్తర్వులు వెలువడనున్నాయి.

వేసవి గండం గడిచాకే ధరల సవరణ.. ఎందుకంటే?

సాధారణంగా ఏప్రిల్, మే నెలల్లో ఎండల తీవ్రత దృష్ట్యా బీర్ల అమ్మకాలు విపరీతంగా ఉంటాయి. అయితే, గత ఏడాది వేసవి కాలంలోనే ధరలను పెంచడం వల్ల అమ్మకాలు ఒక్కసారిగా పడిపోయి ప్రభుత్వ ఆదాయానికి గండిపడింది. ఈ చేదు అనుభవాన్ని దృష్టిలో ఉంచుకున్న ఎక్సైజ్ శాఖ, ఈసారి వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. ప్రస్తుత ఎండాకాలం సీజన్ ముగిసే వరకు వేచి చూసి, ఆ తర్వాతే కొత్త ధరలను అమలులోకి తీసుకురావాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. దీనివల్ల వేసవిలో వచ్చే ఆదాయానికి అడ్డంకి లేకుండా చూసుకోవడమే కాకుండా, వర్షాకాలం నాటికి పెంచిన ధరలతో ఖజానాను నింపుకోవచ్చని ప్రభుత్వం భావిస్తోంది.

ఆదాయం పెంపే లక్ష్యం – సామాన్యుడిపై భారం

రాష్ట్రంలో అమలవుతున్న వివిధ సంక్షేమ పథకాలకు నిధుల సమీకరణలో భాగంగా అబ్కారీ శాఖపై ప్రభుత్వం ఆశలు పెట్టుకుంది. మద్యం ధరల పెంపు ద్వారా వేల కోట్ల రూపాయల అదనపు ఆదాయాన్ని గడించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే ఈ నిర్ణయం సామాన్య, మధ్యతరగతి వర్గాలపై తీవ్ర ప్రభావం చూపనుంది. ఇప్పటికే నిత్యావసర ధరల పెరుగుదలతో సతమతమవుతున్న సామాన్యుడికి, ఇప్పుడు మద్యం ధరల బాదుడు కూడా తోడవనుంది. బ్రాండ్లను బట్టి ధరల పెరుగుదల ఉంటుందని, ముఖ్యంగా క్వార్టర్, హాఫ్ బాటిళ్లపై కూడా దామాషా పద్ధతిలో ధరలు పెరగనున్నాయని సమాచారం. అధికారిక ప్రకటన వెలువడితే కానీ ఏ బ్రాండ్‌పై ఎంత భారం పడుతుందో పూర్తి స్పష్టత రాదు.

  Last Updated: 02 May 2026, 03:03 PM IST