TRS : కేసీఆర్ పై మాట మార్చిన కవిత..!!

రాష్ట్ర రాజకీయాల్లో ఈ తండ్రీకూతుళ్ల పోరు ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఒకవైపు కేసీఆర్ జాతీయ రాజకీయాల వైపు అడుగులు వేస్తుంటే, కవిత మాత్రం పాత 'టీఆర్ఎస్' (తెలంగాణ రక్షణ సేన) పేరుతో మళ్లీ రాష్ట్ర రాజకీయాల్లో బలపడాలని చూస్తున్నారు

Published By: HashtagU Telugu Desk
Kavitha Jayalalitha

Kavitha Jayalalitha

తెలంగాణ రక్షణ సేన (TRS) అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తన తండ్రి, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై చేస్తున్న విమర్శల పట్ల స్పష్టతనిచ్చారు. ఇటీవల జరిగిన ఒక ప్రెస్ మీట్‌లో ఆమె మాట్లాడుతూ, తన తండ్రిపై తనకు వ్యక్తిగతంగా ఎలాంటి ద్వేషం లేదని స్పష్టం చేశారు. “ఆయన నా తండ్రి.. ఆయన లేకపోతే నాకు జన్మ లేదు, గుర్తింపు లేదు. ఆయన పట్ల నాకు ఎప్పుడూ గౌరవం ఉంటుంది” అని భావోద్వేగంగా వ్యాఖ్యానించారు. అయితే, ఒక రాజకీయ నాయకుడిగా, బీఆర్ఎస్ అధ్యక్షుడిగా కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలపై మాత్రమే తనకు అభ్యంతరాలు ఉన్నాయని, తండ్రిని కాకుండా కేవలం రాజకీయ ప్రత్యర్థిగా మాత్రమే ఆయనను విమర్శిస్తున్నానని కవిత పేర్కొన్నారు.

బీఆర్ఎస్ సిద్ధాంతాలతోనే విభేదాలు

కేసీఆర్‌తో తనకున్న విభేదాలు కేవలం ‘ఐడియలాజికల్’ (సిద్ధాంతపరమైనవి) మాత్రమేనని కవిత క్లారిటీ ఇచ్చారు. తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలను నెరవేర్చడంలో బీఆర్ఎస్ విఫలమైందని, సామాజిక న్యాయం పక్కదారి పట్టిందని ఆమె ఆరోపించారు. “మొన్న విమర్శించాను.. రేపు కూడా తప్పు జరిగితే ఖచ్చితంగా ప్రశ్నిస్తాను. రాజకీయాల్లో భావజాలం ముఖ్యం కానీ బంధుత్వాలు కాదు” అని ఆమె కుండబద్దలు కొట్టారు. ఉద్యమ కాలం నాటి కేసీఆర్ కు, అధికారంలోకి వచ్చిన తర్వాత మారిన కేసీఆర్ కు మధ్య చాలా వ్యత్యాసం ఉందని, అందుకే తాను సొంతంగా పార్టీ పెట్టి ప్రజా సమస్యలపై పోరాడాలని నిర్ణయించుకున్నట్లు వివరించారు.

తండ్రికి ధీటుగా కూతురి సవాల్

రాష్ట్ర రాజకీయాల్లో ఈ తండ్రీకూతుళ్ల పోరు ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఒకవైపు కేసీఆర్ జాతీయ రాజకీయాల వైపు అడుగులు వేస్తుంటే, కవిత మాత్రం పాత ‘టీఆర్ఎస్’ (తెలంగాణ రక్షణ సేన) పేరుతో మళ్లీ రాష్ట్ర రాజకీయాల్లో బలపడాలని చూస్తున్నారు. తన విమర్శలు కేసీఆర్ వ్యక్తిత్వాన్ని కించపరిచేలా ఉండవని, కేవలం ఆయన పాలనలోని లోపాలను మాత్రమే ఎత్తిచూపుతానని ఆమె చెబుతున్నారు. అయితే, సోషల్ మీడియాలో వస్తున్న నెగటివ్ కామెంట్స్ నేపథ్యంలో ఆమె తన మాట మార్చుకున్నారనే ప్రచారం జరుగుతోంది. ఏది ఏమైనా, రాబోయే రోజుల్లో తెలంగాణలో కవిత నేతృత్వంలోని టీఆర్ఎస్ వర్సెస్ కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ మధ్య పోరు ఏ దిశగా సాగుతుందో చూడాలి.

  Last Updated: 02 May 2026, 04:54 PM IST